Supreme Court: ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు.. నేటినుంచి అందరికీ అందుబాటులోకి..

గణతంత్ర దినోత్సవం నుంచి వివిధ భారతీయ భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచే సేవలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ బుధవారం ప్రారంభించారు.

Updated : 26 Jan 2023 08:50 IST

కొత్త సేవలను ప్రారంభించిన సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

ఈనాడు, దిల్లీ: గణతంత్ర దినోత్సవం నుంచి వివిధ భారతీయ భాషల్లోనూ తీర్పులను అందుబాటులో ఉంచే సేవలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ బుధవారం ప్రారంభించారు. ఎలక్ట్రానిక్‌ సుప్రీంకోర్టు రిపోర్టుల (ఈ-ఎస్‌సీఆర్‌) ప్రాజెక్టు గురువారం నుంచి మొదలవుతుందని, ప్రస్తుతానికి కొన్ని షెడ్యూల్డు భాషల్లో తీర్పుల అనువాద ప్రతులు సిద్ధంగా ఉంచామని సీజేఐ చెప్పారు. న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, ప్రజలు వాటిని ఉచితంగానే వినియోగించుకోవచ్చని తెలిపారు. దేశంలో గుర్తించిన అన్ని ప్రాంతీయ భాషల్లోకి సుప్రీంకోర్టు తీర్పులను అనువదించే కృషిని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ-ఎస్‌సీఆర్‌ ప్రాజెక్టులో భాగంగా సర్వోన్నత న్యాయస్థాన వెబ్‌సైట్‌లో ఇప్పుడు 34వేల తీర్పులు ఉన్నాయని చెప్పారు. అవసరమైన విషయం గురించి సెర్చ్‌ ఇంజిన్‌లో టైప్‌ చేస్తే దానికి సంబంధించిన ఇంగ్లిష్‌ జడ్జిమెంట్‌ ప్రతులు వస్తాయి. దాంతోపాటు ఆ తీర్పులు అనువాదమైన ఇతర భాషల జాబితా కూడా వస్తుంది. అందులో తమకు ఇష్టం వచ్చిన భాషను ఎంచుకొని సదరు ప్రతిని పరిశీలించుకోవచ్చు. ఈ అనువాద ప్రక్రియ ఇక ముందూ నిరంతరం సాగుతుందని, కక్షిదారుల సౌకర్యార్థం అనువాద ప్రతులను క్రమంగా అప్‌లోడ్‌ చేస్తూ ఉంటామని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పేర్కొంది.

గొప్ప ముందడుగు: వెంకయ్యనాయుడు

ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులను అందించే ప్రయత్నాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. గ్రామ-పట్టణాల మధ్య ఉన్న తేడాను భర్తీ చేయడానికి ఇదో గొప్ప ముందడుగని పేర్కొన్నారు. పాఠశాలలు, స్థానిక పరిపాలన, న్యాయ వ్యవస్థల్లో భారతీయ భాషల వినియోగాన్ని ప్రోత్సహించాలని తాను తొలి నుంచీ కోరుతూ వస్తున్నానని గుర్తు చేశారు. తీర్పులను భారతీయ భాషల్లో వెలువరించనున్నట్లు సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని