సంక్షిప్త వార్తలు(8)
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గురువారం జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులతో కలిసి స్మారకాన్ని సందర్శించిన ప్రధాని.. దేశసేవలో అమరులైన వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన మోదీ
దిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గురువారం జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులతో కలిసి స్మారకాన్ని సందర్శించిన ప్రధాని.. దేశసేవలో అమరులైన వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ‘స్వాతంత్య్ర సమరయోధుల కలలను నెరవేర్చేందుకు మనం ఐక్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈసారి గణతంత్ర వేడుకలు మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవం వేళ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం’ అని మోదీ అన్నారు.
జ్ఞాన సంపన్నుల దేశంగా తీర్చిదిద్దాలి: భాగవత్
జైపుర్: ప్రజలంతా కలిసి భారత్‌ను జ్ఞాన సంపన్నుల దేశంగా మార్చాలని ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. జైపుర్‌లోని కేశవ్ విద్యాపీఠ్‌లో గురువారం జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకుని బానిస సంకెళ్లను తెంచాలన్న దృఢ సంకల్పంతో చురుగ్గా ఉంటేనే భారత్‌ను జ్ఞాన సంపన్న దేశంగా మార్చగలుగుతామన్నారు. దిశానిర్దేశం లేకపోతే జ్ఞానం ప్రాణాంతకమవుతుందని, వివాదానికి కారణమవుతుందని వివరించారు. రాజ్యాంగ పరిషత్ సమగ్రంగా పరిశీలించి రూపొందించిన భారత రాజ్యాంగాన్ని ప్రజలకు అంకితం చేస్తూ డా.బి.ఆర్.అంబేడ్కర్ పార్లమెంటులో చేసిన ప్రసంగాన్ని ప్రతిఒక్కరూ చదవాలని కోరారు. మన కర్తవ్యమేంటో డా.బి.ఆర్.అంబేడ్కర్ బోధించారని, పరస్పరం పోట్లాడుకోకుండా ప్రతిఒక్కరూ సోదరభావంతో మెలగాలని ఉద్బోధించారని తెలిపారు.
సుప్రీంకోర్టుకు చేరిన దిల్లీ మేయర్ ఎన్నిక
దిల్లీ: నిర్ణీత కాలావధిలో దిల్లీ మేయర్ ఎన్నిక జరిగేలా ఆదేశాలివ్వాలని కోరుతూ గురువారం సుప్రీంకోర్టులో ఆప్ పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం జరిగిన దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలోనూ గందరగోళం తలెత్తి మేయర్ ఎన్నిక జరగకపోవడంతో ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
టెక్సాస్ మేధావుల సంఘానికి ఉపాధ్యక్షుడిగా గణేశ్ ఠాకుర్
హ్యూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన అత్యుత్తమ శాస్త్రజ్ఞులు, పరిశోధకులతో కూడిన టెక్సాస్ అకాడెమీ ఆఫ్ మెడిసిన్, ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ (టామెస్ట్) సంస్థ ఉపాధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన గణేశ్ ఠాకుర్ నియమితులయ్యారు. టామెస్ట్ బోర్డు డైరెక్టర్లు మంగళవారం ఆయన నియామకానికి ఆమోదముద్ర వేశారు. ఠాకుర్ 2025లో ఆ సంస్థకు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
ఏప్రిల్ 27న తెరుచుకోనున్న బద్రీనాథ్ ఆలయం
దేహ్రాదూన్: ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని బద్రీనాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 27న ఉదయం 7.10 గంటలకు తెరవనున్నారు. వసంత పంచమి సందర్భంగా గురువారం బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చలికాలం మంచు కురుస్తున్న నేపథ్యంలో ఈ క్షేత్రాన్ని గతేడాది నవంబరు 19న మూసేశారు. చార్‌ధామ్‌లోని కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు కూడా త్వరలో తెరుచుకోనున్నాయి.
గుజరాత్‌లో కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. నెల తర్వాత దొరికిన నిందితుడు
కారుతో బైకును ఢీకొట్టి 12 కి.మీ. ఈడ్చుకెళ్లి ఒకరి మృతికి కారణమైన నిందితుడు నెల రోజుల తర్వాత గుజరాత్ పోలీసులకు దొరికాడు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబరు 18న సూరత్ సమీపంలో బీరేన్ అహిర్ అనే వ్యాపారి బైకుపై వెళ్తున్న పాటిల్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు. దీంతో పాటిల్ అతడి కారు కింద పడిపోయాడు. అక్కడి నుంచి పారిపోయే ఉద్దేశంతో బీరేన్ కారును వేగంగా పోనిచ్చాడు. వాహనం కింద ఇరుక్కుపోయిన పాటిల్ శరీరం సుమారు 12 కి.మీ.వెళ్లిన తర్వాత కిందపడింది. తీవ్రగాయాలతో అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు ఇన్నాళ్లూ ముంబయి, రాజస్థాన్‌లో దాక్కున్నాడని, గురువారం సూరత్ వైపు వస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒకరి బదులు మరొకరు పరీక్షకు.. ఇద్దరిపై కేసు నమోదు
లఖ్‌నవూ: కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటీఈటీ)లో ఓ అభ్యర్థి స్థానంలో హాజరైన మరో వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. దీంతో ఆ ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన శుభం యాదవ్ అనే వ్యక్తి తన బదులు పరీక్ష రాయాలంటూ అదే రాష్ట్రానికి చెందిన మనీశ్ కుమార్‌ను సంప్రదించాడు. అందుకు రూ.15వేలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం ఇద్దరూ కలసి నకిలీ గుర్తింపు పత్రాలు, హాల్ టికెట్లు తయారు చేశారు. పరీక్ష రాయడానికి మనీశ్ లఖ్నవూకు వచ్చాడు. అయితే పరీక్షా కేంద్రంలో పర్యవేక్షణ సిబ్బందికి అతడిపై అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారి బండారం బయటపడింది.
కుప్పకూలిన 6 ఇళ్లు.. చిన్నారి మృతి
ఆగ్రా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో దుర్ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఆరు ఇళ్లు, ఓ దేవాలయం కుప్పకూలడంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తి, అతడి ఇద్దరు కుమార్తెలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వారిలో నాలుగేళ్ల చిన్నారి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. సమీంలోని ఓ అతిథి భవనంలో తవ్వకాలు జరుగుతున్నాయని, వాటి ప్రభావంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ఇందులో పలువురికి గాయాలయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: ఈ ఏడాది రాష్ట ప్రజల జీవితాల్లో వెలుగులు ఖాయం: చంద్రబాబు
-
Politics News
Revanth Reddy: టీఎస్పీఎస్సీలో అవకతవకలకు ఐటీ శాఖే కారణం: రేవంత్‌రెడ్డి
-
India News
Delhi: మోదీ వ్యతిరేక పోస్టర్ల కలకలం.. 100 ఎఫ్ఐఆర్లు, ఆరుగురి అరెస్ట్
-
India News
Viral News: అమితాబ్ సహాయకుడికి చెందిన రూ.1.4లక్షల ఫోన్ వాపస్ చేసిన కూలీ
-
General News
TTD: కొవిడ్ తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది: వైవీ సుబ్బారెడ్డి
-
World News
ISI: పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ రెండో ర్యాంక్ స్థాయి అధికారి హతం..!