అట్టహాసంగా గణతంత్ర వేడుకలు

దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. భారత సైనిక శక్తి, ‘ఆత్మనిర్భరత’ స్ఫూర్తిగా రూపొందించిన స్వదేశీ తయారీ ఆయుధాలు, ఘనమైన దేశ సాంస్కృతిక వారసత్వం కర్తవ్యపథ్‌లో ప్రతిబింబించాయి.

Published : 27 Jan 2023 04:16 IST

త్రివర్ణ పతాకానికి వందనం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. భారత సైనిక శక్తి, ‘ఆత్మనిర్భరత’ స్ఫూర్తిగా రూపొందించిన స్వదేశీ తయారీ ఆయుధాలు, ఘనమైన దేశ సాంస్కృతిక వారసత్వం కర్తవ్యపథ్‌లో ప్రతిబింబించాయి. గురువారం జరిగిన 74వ రిపబ్లిక్‌డే వేడుకలు ‘నారీశక్తి’ ఇతివృత్తంగా సాగాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకానికి వందనం సమర్పించారు. అనంతరం త్రివిధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. వేడులకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌-సీసీ, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖఢ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కర్తవ్యపథ్‌లో తొలిసారి.. రాష్ట్రపతి

సాయుధ దళాల గౌరవ వందనం తర్వాత త్రివర్ణ పతాక ఆవిష్కరణ జరిగింది. నాలుగు ఎంఐ 17 వీ5 హెలికాప్టర్లు ఆకాశం నుంచి పూలు వెదజల్లాయి. ఈసారి సంప్రదాయ గన్‌ సెల్యూట్‌కు ఉపయోగించే పురాతన బ్రిటిష్‌ పౌండర్‌ గన్స్‌ స్థానంలో భారత్‌లో తయారైన 105 ఎంఎం లైట్‌ ఫీల్డ్‌ గన్లను ఉపయోగించారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి కర్తవ్యపథ్‌లో ద్రౌపదీ ముర్ము త్రివర్ణ పతకానికి వందనం సమర్పించారు.

ప్రత్యేక ఆకర్షణగా ట్యాంకులు, క్షిపణులు

విజయ్‌ చౌక్‌ నుంచి ఎర్రకోట వరకు సాగిన పరేడ్‌లో త్రివిధ దళాలు తమ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పాయి. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ను ప్రతిబింబించేలా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను ఇందులో ప్రదర్శించారు. ప్రధాన యుద్ధ ట్యాంక్‌ అర్జున్‌, నాగ్‌ క్షిపణి వ్యవస్థ, కే-9 వజ్రా టీ గన్‌ సిస్టమ్‌, బ్రహ్మోస్‌ క్షిపణులు, బీఎంపీ-2 సాయుధ శకటం, క్విక్‌ రియాక్షన్‌ ఫైటింగ్‌ హెవీ వెహికల్‌ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రఫేల్‌, మిగ్‌-29, సుఖోయ్‌ 30, సుఖోయ్‌ 30 ఎమ్‌కేఐ జాగ్వార్‌, సి-130, సి-17, డోర్నియర్‌, డకోటా, ఎల్‌సీహెచ్‌ ప్రచండ్‌, అపాచీ వంటి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో గర్జించాయి. రిపబ్లిక్‌ డే ఫ్లై ఫాస్ట్‌లో మొత్తం 50 విమానాలు విన్యాసాలు చేశాయి. అయితే పొగమంచు కారణంగా అవి ఆహూతులను అలరించలేకపోయాయి.

సామాజిక, ఆర్థిక పురోగతికి అద్దం పట్టేలా శకటాలు

దేశ సాంస్కృతిక భిన్నత్వం, వారసత్వం, ఆర్థిక, సామాజిక పురోగతికి అద్దంపట్టేలా సాగిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 23 శకటాలు ఇందులో పాల్గొన్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, త్రిపుర శకటాలు నారీశక్తి, మహిళా సాధికారతను ప్రతిబింబించాయి.

ప్రదర్శన విశేషాలు

* గతేడాది వరకూ పరేడ్‌ నిర్వహించే మార్గాన్ని రాజ్‌పథ్‌గా పిలిచేవారు.. కేంద్ర సర్కారు చేపట్టిన సెంట్రల్‌ విస్టా పునర్నిర్మాణంలో భాగంగా కొన్ని మార్పులు చేసిన ఈ మార్గం పేరును కర్తవ్య పథ్‌గా మార్చారు. ఆ తరువాత రిపబ్లిక్‌ డే ప్రదర్శనను నిర్వహించడం ఇదే తొలిసారి.

* కర్తవ్యపథ్‌ పరేడ్‌లో నౌకాదళం, వైమానిక దళం శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 861 బ్రహ్మోస్‌ రెజిమెంట్‌ డిటాచ్‌మెంట్‌ ఈ కవాతులో పాల్గొంది. ఒంటెలతో కూడిన బీఎస్‌ఎఫ్‌ బృందం ఆకట్టుకుంది.

* నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో శకటాన్ని ప్రదర్శించడం విశేషం.

* కొత్తగా సైన్యంలో చేరిన అగ్నివీరులు(ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు) పరేడ్‌లో భాగమయ్యారు.

నారీశక్తి నేతృత్వంలో..

* సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌కు చెందిన మహిళా బృందం ఈసారి వేడుకలకు ప్రధాన ఆకర్షణ. దీనికి అసిస్టెంట్‌ కమాండెంట్‌ పూనమ్‌ గుప్తా నేతృత్వం వహించారు.

* 29 ఏళ్ల దిశా అమృత్‌ 144 మంది యువ సైలర్లున్న నౌకాదళ కవాతు బృందానికి, లెఫ్టినెంట్‌ చేతనాశర్మ ఆకాశ్‌ గగనతల రక్షణ వ్యవస్థకు, వాయుసేన కవాతు బృందానికి స్క్వాడ్రన్‌ లీడర్‌ సింధూ రెడ్డి నాయకత్వం వహించారు.

* దిల్లీ మహిళా పోలీసు బ్యాండ్‌ తొలిసారిగా గణతంత్య్ర దిన పరేడ్‌లో పాల్గొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు