సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సవరించుకుందాం
సింధూ జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ) విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఒప్పందాన్ని సవరించుకుందామంటూ పాకిస్థాన్‌కు భారత్ నోటీసు జారీ చేసింది.
పాక్‌కు భారత్ నోటీసు
ఐడబ్ల్యూటీలో కీలక పరిణామం
దిల్లీ: సింధూ జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ) విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఒప్పందాన్ని సవరించుకుందామంటూ పాకిస్థాన్‌కు భారత్ నోటీసు జారీ చేసింది. ఈ ఒప్పంద విషయంలో భారత్, దాయాది దేశమైన పాకిస్థాన్ మధ్య గత కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో జరిగిన ఒప్పందానికి సంబంధించిన విషయంలో పాకిస్థాన్ మొండిగా వ్యవహరిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో సింధూ జలాల కమిషనర్ల ద్వారా జనవరి 25న నోటీసు జారీ చేసినట్లు భారత్ అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ‘‘సింధూ నదీ జలాల ఒప్పందాన్ని అమలు చేసే విషయంలో భారత్ ఎప్పుడూ బాధ్యతతోనే ఉంది. పాక్ మాత్రం ఒప్పందంలోని నిబంధనలు ఉల్లంఘిస్తూ అమలుకు ఆటంకం కలిగిస్తోంది. దీంతో ఒప్పందం సవరించుకునేందుకు నోటీసు జారీ చేయాల్సి వచ్చింది. ఈ నోటీసుతో 90 రోజుల్లోగా భారత్, పాక్ మధ్య చర్చలు జరగాల్సి ఉంటుంది. గత 62 ఏళ్ల కాలంలో నేర్చుకున్న పాఠాలతో ఈ ఒప్పందాన్ని సమీక్షిస్తాం.’’ అని వివరించాయి. ఈ నోటీసుపై పాక్ స్పందించింది. ‘ఐడబ్ల్యూటీ నిబంధనలకు అనుగుణంగానే మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఏర్పాటు అయింది. ఇలాంటి నోటీసుల ద్వారా కిషన్ గంగా, రాటిల్ ప్రాజెక్టులపై జరిగే విచారణ నుంచి కోర్టు దృష్టిని మరల్చలేరు.’ అని వ్యాఖ్యానించింది.
ఆ రెండు ప్రాజెక్టులపై పాక్ పేచీ
కిషన్ గంగా, రాటిల్ ప్రాజెక్టులపై గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన పాకిస్థాన్.. వాటి పరిశీలనకు తటస్థ నిపుణులు కావాలని 2015లో అభ్యర్థించింది. తర్వాతి ఏడాదే ఆ అభ్యర్థనను వెనక్కి తీసుకుని మధ్యవర్తిత్వ న్యాయస్థానం తమ అభ్యంతరాలను పరిష్కరించాలని ప్రతిపాదించింది. పాక్ చర్యను వ్యతిరేకించిన భారత్.. ఈ వ్యవహారాన్ని తటస్థ నిపుణులకు అప్పగించాలని ప్రపంచ బ్యాంకుకు విజ్ఞప్తి చేసింది. దీంతో 2016లో స్పందించిన ప్రపంచ బ్యాంకు రెండు దేశాల అభ్యర్థనలను నిలిపివేస్తూ.. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని అన్వేషించాలని భారత్, పాక్‌కు సూచించింది. అనంతరం పాక్ ఒత్తిడి మేరకు.. ప్రపంచ బ్యాంకు ఇటీవల రెండు ప్రక్రియలను (తటస్థ నిపుణుడి అభ్యర్థన, మధ్యవర్తిత్వ కోర్టు) ప్రారంభించింది. దీనిపై భారత్ స్పందించి.. ఒకే అంశంపై రెండు సమాంతర చర్యలు చేపట్టడం ఐడబ్ల్యూటీను ఉల్లంఘించడమే అని ఆరోపించింది.
అసలేంటీ ఒప్పందం..
సింధూ నదీ జలాల వివాదానికి పరిష్కరించుకునేందుకు భారత్, పాక్ మధ్య 1960, సెప్టెంబరు 19న ఈ ఒప్పందం (ఐడబ్ల్యూటీ) జరిగింది. భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపకాలు జరిగాయి. సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్ ఎకరాల అడుగులు (ఎమ్‌ఏఎఫ్)గా ఉన్న రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్‌కు.. 135 ఎమ్‌ఏఎఫ్ సామర్థ్యం ఉన్న సింధు, జీలం, చీనాబ్ నదులు పాక్‌కు దక్కాయి. పాక్‌కు కేటాయించిన నదుల నుంచి తాగునీటికి తప్ప ఇతర ఏ అవసరాలకూ నీటిని వినియోగించుకోకుండా భారత్‌కు పరిమితులు ఉన్నాయి. ఈ విషయంలో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు ‘శాశ్వత సింధు కమిషన్ (పీఐసీ)’ను ఏర్పాటు చేశారు. దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
నిఖత్‌కు మహీంద్రా థార్
-
Politics News
వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే చేతులు నరుక్కున్నట్లే!: మంత్రి ధర్మాన
-
World News
Russia: చిన్నారి ‘చిత్రం’పై రష్యా కన్నెర్ర.. తండ్రిని బంధించి..బాలికను దూరం చేసి!
-
India News
ChatGPT: భారత్ వెర్షన్ చాట్‌జీపీటీ ఎప్పుడంటే..? మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిదే..!
-
Sports News
Labuschagne:ఐపీఎల్లో నా ఫేవరెట్ టీమ్ అదే.. అశ్విన్ బెస్ట్ స్పిన్నర్: లబుషేన్
-
Movies News
Social Look: బీచ్‌లో వేదిక.. షాపులో శాన్వి.. ఆరెంజ్ దుస్తుల్లో ప్రియ!