అమృత కాలం.. అభివృద్ధి భారతం
కేంద్రంలో ఉన్న సుస్థిర, నిర్ణయాత్మక, నిర్భీతి సర్కారుతో రాబోయే పాతికేళ్ల అమృత కాలంలో దేశం అన్ని రంగాల్లో వికసిస్తుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు.
పాతికేళ్లలో అన్ని రంగాల్లో వికాసం
వివక్ష లేని పాలన.. వికాసమే ఆలంబన
పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటన
బహిష్కరించిన భారాస, ఆప్
ఈనాడు, దిల్లీ: కేంద్రంలో ఉన్న సుస్థిర, నిర్ణయాత్మక, నిర్భీతి సర్కారుతో రాబోయే పాతికేళ్ల అమృత కాలంలో దేశం అన్ని రంగాల్లో వికసిస్తుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్’ నినాద స్ఫూర్తితో ఏ వర్గంపైనా ఎలాంటి వివక్షలేకుండా ప్రభుత్వం పాలిస్తోందని తెలిపారు. బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని మంగళవారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. రాష్ట్రపతి హోదాలో సెంట్రల్‌హాల్లో ఇలాంటి సమావేశంలో ముర్ము ప్రసంగించడం ఇదే తొలిసారి. దాదాపు 70 నిమిషాలసేపు కొనసాగిన ప్రసంగంలో.. కేంద్ర ప్రభుత్వ విజయాలు, భవిష్యత్ లక్ష్యాలను ఆమె సవివరంగా ఆవిష్కరించారు.
పంచ లక్ష్యాలు స్ఫూర్తి
‘‘స్వాతంత్య్ర అమృతకాలంలో దేశం పంచలక్ష్యాల స్ఫూర్తితో ముందడుగు వేస్తోంది. బానిస మనస్తత్వ ఛాయలన్నింటినీ తుడిచేసి పాతికేళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టేందుకు అహరహం ప్రయత్నిస్తోంది. వందేళ్ల స్వాతంత్య్ర ఆకాంక్షల సాధనకు, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి వచ్చే పాతికేళ్లు ఎంతో కీలకం. రాజకీయంగా, వ్యూహాత్మకంగా బలంగా ఉన్నప్పుడే శాంతి శాశ్వతంగా ఉంటుందన్నది ప్రభుత్వ విశ్వాసం. అందుకే మనం సైన్యాన్ని ఆధునికీకరించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాం.
ప్రజాస్వామ్య హృదయం పార్లమెంటు
ప్రజాస్వామ్యానికి హృదయంలాంటి పార్లమెంటులో సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి కృషిచేయాలి. కర్తవ్యపథంలో నడిచి రాజ్యాంగ ప్రమాణాన్ని నెరవేరుద్దాం. ప్రపంచం మొత్తం ఎన్నో ఆశలతో భారత్ వైపు చూస్తోంది. ప్రభావశీలమైన జి-20 కూటమి నాయకత్వ బాధ్యతలను మనదేశం ఈ ఏడాది చేపడుతోంది. ప్రపంచ సవాళ్లకు అందరితో కలిసి పరిష్కారాలు చూపే ప్రయత్నం చేస్తోంది. దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూనే మన పాత్రను విస్తరించాం.
ముందు తరం దూతలుగా యువత
మనకున్న భవ్యమైన గతాన్ని స్వీకరిస్తూనే 2047నాటికల్లా అత్యాధునిక కోణం ఉన్న బంగారు భారతావనిని నిర్మించాలి. పేదరికం లేని, మధ్యతరగతి ప్రజలు కూడా పరిఢవిల్లే భారత్‌ను నిర్మించాలి. యువత, మహిళలు ముందడుగు వేసి సమాజానికి, దేశానికి మార్గనిర్దేశం చేసే భారత్ సాకారం కావాలి. ముందుతరం దూతలుగా మన యువత ఎదగాలి. గత తొమ్మిదేళ్ల కాలంలో దేశ ప్రజలు గతంలో ఎన్నడూలేని విధంగా ఎన్నో సానుకూల అంశాలు చవిచూశారు. భారతీయుల ఆత్మవిశ్వాసం ఇదివరకు ఎన్నడూలేనంత ఉన్నతస్థాయిలో ఉండటం అన్నింటికంటే ముఖ్యమైన మార్పు.
మనపట్ల ప్రపంచ దృక్పథం మారింది
భారత్‌పట్ల ప్రపంచ దృక్పథంలో కూడా పూర్తిమార్పు వచ్చింది. ఒకప్పుడు సమస్యలకు నెలవుగా కనిపించిన భారత్ ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కర్తగా మారింది. భారీ కుంభకోణాలు, ప్రభుత్వ పథకాల్లో అవినీతి నుంచి విముక్తి కలగాలన్న ప్రజల కోరిక ఇప్పుడు నెరవేరుతోంది. దార్శనిక నిర్ణయాలతో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఎదిగింది. వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిర్మించేందుకు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే పునాది ఇదే’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆమె ప్రసంగం.. మన దేశంలో వేర్వేరు రంగాల్లో సమూల మార్పులకు అద్దం పట్టిందని ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.
ప్రసంగాన్ని బహిష్కరించిన భారాస, ఆప్
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖఢ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాలు రాష్ట్రపతికి పార్లమెంటు వద్ద స్వాగతం పలికారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ.. రాష్ట్రపతి ప్రసంగాన్ని భారాస, ఆప్ బహిష్కరించాయి. రాష్ట్రపతిని, ప్రజాస్వామ్య నిబంధనల్ని ఆ పార్టీలు అవమానించాయని భాజపా వ్యాఖ్యానించింది. విమాన రాకపోకలు స్తంభించిపోయి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా సీనియర్ నేతలు శ్రీనగర్ నుంచి రాలేకపోవడంతో ఆ పార్టీ తరఫున సోనియాగాంధీ మాత్రమే పార్లమెంటుకు హాజరయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు భాజపా మేనిఫెస్టోలో తొలి అధ్యాయంలా రాష్ట్రపతి ప్రసంగం ఉందని విపక్షాలు విమర్శించాయి.
ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో ఆశాకిరణం
కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని ఆశాభావం
దిల్లీ: ప్రపంచ దేశాల్లో ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో భారత బడ్జెట్ సామాన్య పౌరుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నంలా ఓ ఆశాకిరణంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంటు ఆవరణలో మీడియాతో మోదీ మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక నిపుణుల నుంచి సానుకూల సందేశాలు వస్తున్నాయన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం సమర్పించనున్న బడ్జెట్.. భారత్‌పై ప్రపంచ దేశాలు పెట్టుకున్న నమ్మకాన్ని పెంపొందించేలా కూడా కృషి చేస్తుందన్న భరోసా తనకుందని తెలిపారు. రాష్ట్రపతి మొదటిసారిగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగం భారత రాజ్యాంగానికి, పార్లమెంటరీ వ్యవస్థకు, మహిళలకు గర్వకారణమన్నారు. దేశంలోని గొప్ప గిరిజన సంప్రదాయాలను గౌరవించేందుకు ఇది ఒక అవకాశమని మోదీ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు
-
India News
CBIకి కొత్త చట్టం అవసరం.. పార్లమెంటరీ కమిటీ సూచన
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీకి జైలు శిక్ష.. ఎంపీగా అనర్హుడవుతారా..?
-
Movies News
Vishwak Sen: ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ తీస్తాను: విష్వక్ సేన్
-
Politics News
MLC Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం
-
General News
TSRTC ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో ‘డైనమిక్ ప్రైసింగ్’!