ఎల్ల ఫౌండేషన్‌- విస్కాన్‌సన్‌ ఆధ్వర్యంలో.. వన్‌ హెల్త్‌ సెంటర్‌

వ్యవసాయం, పశుసంపద, మానవ ఆరోగ్య రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ముందే పసిగట్టి..పరిష్కారాలపై పరిశోధనలను ప్రోత్సహించేందుకు వీలుగా బెంగళూరులో ‘వన్‌ హెల్త్‌ సెంటర్‌’ ఏర్పాటుచేయాలని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సన్‌-మాడిసన్‌ ఆధ్వర్యంలోని గ్లోబల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఎల్ల ఫౌండేషన్‌ నిర్ణయించాయి.

Published : 06 Feb 2023 05:58 IST

వ్యవసాయం, పశు, మానవ ఆరోగ్యంపై పరిశోధనలకు అంగీకారం
దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఎంఓయూ

ఈనాడు, దిల్లీ: వ్యవసాయం, పశుసంపద, మానవ ఆరోగ్య రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ముందే పసిగట్టి..పరిష్కారాలపై పరిశోధనలను ప్రోత్సహించేందుకు వీలుగా బెంగళూరులో ‘వన్‌ హెల్త్‌ సెంటర్‌’ ఏర్పాటుచేయాలని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సన్‌-మాడిసన్‌ ఆధ్వర్యంలోని గ్లోబల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఎల్ల ఫౌండేషన్‌ నిర్ణయించాయి. ఇందుకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై గ్లోబల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ జె.ఒసోరియో, ఎల్ల ఫౌండేషన్‌ వ్యవస్థాపకులైన భారత్‌ బయోటెక్‌ అధిపతులు కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల ఆదివారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో సంతకాలు చేశారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్‌, వ్యవసాయ పరిశోధన, విద్యాశాఖ కార్యదర్శి హిమాంశుపాఠక్‌, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రాజేష్‌ సుధీర్‌ గోఖలేల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఏడాది చివరిలో ప్రారంభంకానున్న ‘వన్‌ హెల్త్‌ సెంటర్‌’ భారత్‌లో కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీకి ప్రోత్సాహం అందిస్తుంది. భారతీయ విద్యార్థులు, పరిశోధకులు విస్కాన్‌సన్‌ యూనివర్సిటీలోని నైపుణ్యం, పరిశోధన, శిక్షణ సౌకర్యాలు ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది.

ఆరోగ్య సమస్యల పరిష్కారమే లక్ష్యం

ఈ సందర్భంగా కృష్ణ ఎల్ల మాట్లాడుతూ ‘విస్కాన్‌సన్‌ యూనివర్సిటీలో చదవడం, అక్కడి ప్రొఫెసర్లతో మంచి పరిచయం ఉండటం, వారి బలాబలాలు ఏంటన్నది బాగా తెలుసు కాబట్టి ఈ ఒప్పందం కుదర్చుకున్నాం. భారత్‌లో మొత్తం వైరాలజిస్టుల సంఖ్య 100మందిలోపే ఉంటే ఆ వర్సిటీ క్యాంపస్‌లోనే వెయ్యిమంది వైరాలజిస్టులు ఉన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అన్నిరకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కనుగొనే ఉద్దేశంతో వన్‌ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులను ఎలా నియంత్రించాలన్న అంశంపై ఈ ఫౌండేషన్‌ ద్వారా పరిశోధనలు చేస్తాం. మా ఫౌండేషన్‌కు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సన్‌ సాంకేతికపరమైన సాయం అందిస్తుంది. సమస్య వచ్చినప్పుడు వ్యాక్సిన్లకు అవసరమైన సాంకేతికత కోసం విదేశాల వద్దకు వెళ్లకుండా ముందే సమస్యను పసిగట్టి దాన్ని నిలువరించే సాంకేతికతను అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తాం. ఈ ఫౌండేషన్‌కు మేం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం కోరడం లేదు. మానవజాతి మేలు కోసం చేసే ఈ కార్యక్రమానికి మేమే నిధులు సమకూరుస్తున్నాం. కొవిడ్‌ నివారణ కోసం ఇటీవల అభివృద్ధి చేసిన నాసికావ్యాక్సిన్‌ను ఆసుపత్రులకు సరఫరా చేశాం. మధుమేహం, హృద్రోగం, స్థూలకాయంతో ఉన్నవారికి ఈ నాసికా వ్యాక్సిన్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గన్యా, జికా, ఫ్లూ వ్యాక్సిన్లపైనా పనిచేస్తున్నాం. ఆఫ్రికాలో కోళ్ల నుంచి మనుషులకు సంక్రమించే నాన్‌టైఫాయిడ్‌ సాల్వలైజ్‌కు వ్యాక్సిన్‌ కనుక్కోవడంపైనా కసరత్తు చేస్తున్నాం. వన్‌ హెల్త్‌ సెంటర్‌ ద్వారా కేవలం వ్యాక్సిన్‌లపై మాత్రమే దృష్టిసారించకుండా వ్యవసాయం, మానవ, పశుసంపద రంగాల్లో ఏయే సమస్యలున్నాయన్నది పరిశీలిస్తాం. ఉదాహరణకు ప్రధానమంత్రి ప్రోత్సహిస్తున్న చిరుధాన్యాలకు విలువను జోడించి వాటిని మరింత మంది స్వీకరించేలా ఏం చేయాలన్నదానిపైనా విస్కాన్‌సన్‌ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తాం’ అని వివరించారు. సుచిత్ర ఎల్ల మాట్లాడుతూ తమ ఫౌండేషన్‌ లాభాపాక్షలేకుండా విభిన్న అంశాలపై పరిశోధనలు చేస్తోందని, ప్రపంచస్థాయి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే లక్ష్యంతోనే ఈ ప్రయత్నం మొదలుపెట్టామని పేర్కొన్నారు. గ్లోబల్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ఒసోరియో మాట్లాడుతూ భారత్‌లో ఆరోగ్య సమస్యలకు ప్రభావశీలమైన పరిష్కారం చూపేందుకే తాము ఎల్ల ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని