సంక్షిప్త వార్తలు(15)

కర్ణాటకలోని ప్రఖ్యాత శ్రవణబెళగొళ జైన మఠాధిపతి చారుకీర్తి భట్టారక స్వామి (75) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Updated : 24 Mar 2023 05:55 IST

జైన మఠాధిపతి చారుకీర్తి భట్టారక స్వామి కన్నుమూత

హాసన, న్యూస్‌టుడే: కర్ణాటకలోని ప్రఖ్యాత శ్రవణబెళగొళ జైన మఠాధిపతి చారుకీర్తి భట్టారక స్వామి (75) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మఠంలో వేకువజామున నడుస్తూ కిందపడటంతో ఆయన తలకు గాయమైంది. చికిత్స కోసం మండ్య జిల్లా బెళ్లూరు క్రాస్‌లోని బీజీఎస్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించిన కొంత సమయానికే ఆయన కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు. భక్తుల సందర్శనార్థం జైన మఠం ఆవరణలో చారుకీర్తి భౌతికకాయాన్ని సాయంత్రం వరకు ఉంచారు. బాహుబలి విగ్రహం ఉన్న చంద్రగిరి పర్వత సానువుల్లో జైన దిగంబర సంప్రదాయాలకు అనుగుణంగా ప్రభుత్వ లాంఛనాలతో గురువారం సాయంత్రం అంత్యక్రియలను నిర్వహించారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తదితరులు సంతాపం ప్రకటించారు.


ఐఫోన్‌ కోసం ఆర్డర్‌ చేస్తే సబ్బు వచ్చింది..!

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ కోసం ఆర్డర్‌ చేస్తే విద్యార్థి హర్షకు సబ్బు వచ్చింది. సదరు సంస్థకు ఫోన్‌ చేసి తనకు న్యాయం చేయాలని కోరగా, అటువైపు నుంచి సరైన సమాధానం రాలేదు. పరిహారాన్ని కోరుతూ హర్ష వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఫోన్‌ కోసం చెల్లించిన రూ.48,999తోపాటు రూ.25 వేలు పరిహారంగా చెల్లించాలని కర్ణాటకలోని కొప్పళ జిల్లా వినియోగదారుల న్యాయస్థానం ఫ్లిప్‌కార్ట్‌ను ఆదేశించింది. తాను ఐఫోన్‌ 11 గ్రీన్‌ 65 జీబీ ఫోన్‌ కోసం 2021లో ఆర్డర్‌ చేస్తే 140 గ్రాముల డిటర్జెంట్ సబ్బు వచ్చిందని హర్ష తెలిపారు. వినియోగదారుల న్యాయస్థానంలో అధ్యక్షుడు ఏజీ మాల్దార్‌, ఇద్దరు సభ్యులు విచారణ నిర్వహించి ఎనిమిది వారాల్లోగా హర్షకు పరిహారాన్ని, ఫోన్‌ కోసం చెల్లించిన మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు.


హార్మోన్‌ ఆధారిత గర్భనిరోధక మాత్రలతో ఇబ్బందే

స్వల్పంగా పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్‌ ముప్పు

దిల్లీ: హార్మోన్‌ ఆధారిత గర్భనిరోధక మాత్రల వినియోగం వల్ల రొమ్ము క్యాన్సర్‌ ముప్పు స్వల్పంగా పెరుగుతున్నట్లు బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. ప్రొజెస్టోజెన్‌ హార్మోన్‌ మాత్రమే ఉన్న మాత్రలను వాడుతున్నారా లేక ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టోజెన్‌ రెండూ ఉన్నవాటిని వినియోగిస్తున్నారా అనేది ఈ ముప్పు హెచ్చుతగ్గులలో పెద్దగా ప్రభావం చూపడం లేదని వారు పేర్కొన్నారు. రెండు రకాల మాత్రలతోనూ రొమ్ము క్యాన్సర్‌ ముప్పు 20%-30% మేర అధికమవుతున్నట్లు తెలిపారు. బ్రిటన్‌లో 1996-2017 మధ్య రొమ్ము క్యాన్సర్‌ బారిన పడ్డ 9,498 మంది మహిళలపై (వీరందరి వయసు 50 ఏళ్ల లోపే) అధ్యయనం జరపడం ద్వారా పరిశోధకులు ఈ అంశాన్ని గుర్తించారు.


సుదూర గ్రహంపై ఇసుక మబ్బులు

దిల్లీ: భూమి నుంచి సుమారు 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ‘వీహెచ్‌ఎస్‌ 1256 బి’ అనే గ్రహంపై సుడులు తిరుగుతున్న ఇసుక మబ్బులను ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసాకు చెందిన ప్రతిష్ఠాత్మక జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ (జేడబ్ల్యూఎస్‌టీ) అందించిన డేటాను విశ్లేషించడం ద్వారా వాటిని కనుగొన్నారు. సౌర వ్యవస్థ ఆవల ఓ గ్రహంపై ఒకేసారి ఇంతటి అధిక స్థాయిలో అణువులను గుర్తించడం ఇదే తొలిసారి అని వారు పేర్కొన్నారు. ‘వీహెచ్‌ఎస్‌ 1256 బి’పై నీరు, మీథేన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ల ఉనికి కూడా జేడబ్ల్యూఎస్‌టీ డేటాతో బయటపడిందని చెప్పారు. ఈ గ్రహం తన చుట్టూ తాను ఒక భ్రమణాన్ని పూర్తిచేసుకునేందుకు 22 గంటలు పడుతున్నట్లు తెలిపారు.


మూత్రపిండ వ్యాధులకు ఇక మెరుగైన చికిత్సలు

దిల్లీ: మూత్రపిండ సంబంధిత వ్యాధులకు మెరుగైన చికిత్సలను అభివృద్ధి చేసే దిశగా అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. నికోటినమైడ్‌ అడినైన్‌ డైన్యూక్లియోటైడ్‌ (ఎన్‌ఏడీ) అనే ఎంజైమ్‌ స్థాయులను నియంత్రించడం ద్వారా కిడ్నీల వైఫల్యాన్ని అడ్డుకోవచ్చునని వారు గుర్తించారు. ఎన్‌ఏడీ స్థాయులు తక్కువగా ఉంటే.. మూత్రనాళికల్లోని మైటోకాండ్రియాలు దెబ్బతింటున్నాయని, ఫలితంగా మూత్రపిండ సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతోందని తేల్చారు. నికోటినమైడ్‌ రైబోసైడ్‌ లేదా నికోటినమైడ్‌ మోనోన్యూక్లియోటైడ్‌ వంటివాటిని అందించడం ద్వారా ఆ ఎంజైమ్‌ స్థాయులను పెంచొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. తద్వారా మైటోకాండ్రియాలకు రక్షణ కల్పించి- మూత్రపిండ వైఫల్యం, ఇతర వ్యాధులను నివారించొచ్చని వివరించారు. ఎన్‌ఏడీ సంబంధిత జీవక్రియ మార్పులను గుర్తించడం ద్వారా కిడ్నీ వ్యాధులను ముందుగానే పసిగట్టొచ్చని పేర్కొన్నారు.


బహుభార్యత్వం, నిఖా హలాలా పిటిషన్లపై త్వరలో కొత్త రాజ్యాంగ ధర్మాసనం

దిల్లీ: బహుభార్యత్వం, ముస్లింల్లోని నిఖా హలాలా సంప్రదాయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై కొత్త రాజ్యాంగ ధర్మాసనాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను చివరిసారిగా గతేడాది ఆగస్టు 30న జస్టిస్‌ ఇందిరాబెనర్జీ, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, జస్టిస్‌ సుధాంశు ధులియాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. ఇందులోని జస్టిస్‌ బెనర్జీ, జస్టిస్‌ గుప్తా పదవీ విరమణ చేశారు. ఈ నేపథ్యంలో సరైన దశలో కొత్త పేర్లతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేస్తామని సీజేఐ పేర్కొన్నారు. పిటిషన్‌ను న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ దాఖలు చేశారు. బహుభార్యత్వం, నిఖా హలాలా తదితర అంశాలను అనుమతిస్తున్న భారతీయ నేర శిక్షాస్మృతిలోని 494 సెక్షన్‌ను కొట్టివేయాలని ఇందులో కోరారు.


ప్రపంచానికి పాక్‌ పాఠాలు అక్కర్లేదు

ఐరాస మానవహక్కుల మండలిలో భారత్‌ ఘాటు వ్యాఖ్య

జెనీవా: ప్రజాస్వామ్యం, మానవహక్కులపై పాకిస్థాన్‌ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ప్రపంచానికి ఎంతమాత్రమూ లేదని భారత్‌ వ్యాఖ్యానించింది. మరే దేశమూ చేయనంతగా పాక్‌ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందంటూ మండిపడింది. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల మండలి ఏర్పాటుచేసిన సమావేశంలో దాయాది దేశ ప్రతినిధి విమర్శలకు భారత అండర్‌ సెక్రటరీ పి.ఆర్‌.తులసీదాస్‌ గురువారం ఘాటుగా బదులిచ్చారు. ఉగ్రవాదులు స్వేచ్ఛగా రోడ్లపై సంచరించే దేశం నుంచి ప్రజాస్వామ్యం, మానవహక్కులపై పాఠాలు వినాల్సిన అవసరం ప్రపంచానికి లేదని పేర్కొన్నారు. భారత్‌లో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించడాన్ని మానుకొని.. దేశ భద్రత, మైనార్టీల సంక్షేమంపై తొలుత దృష్టిపెట్టాలంటూ పొరుగు దేశానికి చురకలంటించారు.


బెల్‌తో రక్షణశాఖ రూ.3,750 కోట్ల ఒప్పందం

దిల్లీ: వైమానిక దళ(ఐఏఎఫ్‌) నిర్వహణ సామర్థ్యాల పెంపులో భాగంగా రక్షణశాఖ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌)తో రూ.3,750 కోట్ల విలువైన రక్షణ పరికరాల సరఫరా ఒప్పందాలు రెండింటిని గురువారం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రూ.2,800 కోట్ల విలువ చేసే మీడియం పవర్‌ ఆరుద్ర రాడార్లు ఐఏఎఫ్‌కు అందుతాయి. అలాగే రూ.950 కోట్ల విలువైన 129 డీఆర్‌-118 రాడార్‌ హెచ్చరిక రిసీవర్లు సరఫరా అవుతాయి.


గ్వాలియర్‌ ఎక్స్‌ప్రెస్‌లో పేలుడు పదార్థాలు!
సివాన్‌: బిహార్‌ రాష్ట్రంలోని సివాన్‌ రైల్వేస్టేషనులో బుధవారం రాత్రి గ్వాలియర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో గుర్తించిన పేలుడు పదార్థాలను భద్రతా సిబ్బంది నిర్వీర్యం చేయడంతో పెనుప్రమాదం తప్పింది. రైలులో మద్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన రైల్వే భద్రతా సిబ్బంది (ఆర్పీఎఫ్‌) 4 సంచుల్లో ఉన్న పేలుడు పదార్థాలను గుర్తించినట్లు రైల్వే పోలీస్‌స్టేషన్‌ చీఫ్‌ సుధీర్‌కుమార్‌ తెలిపారు. రైలు నిలిపివేయడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. పట్నా నుంచి వచ్చిన ప్రత్యేకబృందం పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసింది.


తగ్గనున్న సింధూ, గంగ, బ్రహ్మపుత్ర ప్రవాహాలు

హిమానీనదులు క్షీణిస్తుండటమే కారణం

హెచ్చరించిన ఐరాస సెక్రటరీ జనరల్‌ గుటెరస్‌

ఐరాస: భారత్‌కు అత్యంత కీలకమైన సింధూ, గంగ, బ్రహ్మపుత్ర నదుల ప్రవాహం రానున్న కొన్ని దశాబ్దాల్లో తగ్గిపోయే ముప్పుందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ హెచ్చరించారు. భూతాపం కారణంగా హిమానీనదులు, మంచు పలకలు క్షీణిస్తుండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ హిమానీనదుల సంరక్షణ సంవత్సరం’ సందర్భంగా బుధవారం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి గుటెరస్‌ ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచంలో 10% మేర హిమానీనదులు విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు. మానవ కార్యకలాపాల వల్ల పుడమిపై ఉష్ణోగ్రతలు కొత్త ప్రమాదకర స్థాయులకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంటార్కిటికా ఏటా సగటున 15 వేల కోట్ల టన్నుల మంచును కోల్పోతోందని తెలిపారు. గ్రీన్‌లాండ్‌లో ఇంకా ఎక్కువగా ప్రతి సంవత్సరం 27 వేల కోట్ల టన్నుల హిమం కరిగిపోతోందని చెప్పారు. ఆసియాలో హిమాలయ ప్రాంతంలో పుట్టే 10 ప్రధాన నదుల ద్వారా 130 కోట్ల మందికి తాగునీరు అందుతుంటుందని అన్నారు. రాబోయే కొన్ని దశాబ్దాల్లో హిమానీనదులు, మంచు పలకలు కరిగిపోనుండటంతో.. గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదుల ప్రవాహం తగ్గిపోనుందంటూ వివరించారు.


గూగుల్‌ సర్వర్లలో సాంకేతిక లోపం

దిల్లీ: గూగుల్‌ సర్వర్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో జీమెయిల్‌, యూట్యూబ్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అనేక దేశాల్లోని నెటిజన్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గూగుల్‌ వర్క్‌స్పేస్‌లోకి లాగిన్‌ కాలేకపోతున్నామని వేర్వేరు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫిర్యాదులు చేశారు. యూట్యూబ్‌లోనూ వీడియోలు చూడటంలో ఇబ్బందులు ఎదురైనట్లు వాపోయారు. జీమెయిల్‌, యూట్యూబ్‌.. రెండూ గూగుల్‌లో భాగమే. సమస్యకు కారణం ఏంటనే విషయంపై గూగుల్‌ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.


దేశంలో 13లక్షల విద్యుత్‌ వాహనాలు

దిల్లీ: దేశంలో 2021 చివరికి 3,29,08గా ఉన్న విద్యుత్‌ వాహనాలు 2022 చివరి నాటికి 10,20,679కి చేరాయని కేంద్ర రోడ్డు,రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. 2023లో ఇప్పటి వరకూ 2.78 లక్షల విద్యుత్‌ వాహనాలు కొత్తగా నమోదయ్యాయని లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.


సిద్ధూ భార్యకు క్యాన్సర్‌

చండీగఢ్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ భార్య నవ్‌జ్యోత్‌ కౌర్‌ క్యాన్సర్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని ట్విటర్‌లో స్వయంగా వెల్లడించిన ఆమె.. తన భర్త కోసం ఎంతో వేచి చూస్తున్నానని పేర్కొన్నారు. జైల్లో ఉన్న సిద్ధూ కంటే బయట ఉన్న తానే ఎక్కువ బాధను అనుభవిస్తున్నానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


రూ.400 కోట్ల విలువైన మాదకద్రవ్యాల స్వాధీనం

ఐజోల్‌, కరీంగంజ్‌: మిజోరం, అస్సాం రాష్ట్రాల్లో రూ.400 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మిజోరంలో మయన్మార్‌ సరిహద్దుల్లో ఉన్న చమ్ఫాయీ పట్టణంలోని ఒక ఇంటి నుంచి 39 లక్షల డీకంజెస్టంట్‌, యాంటిహిస్టమైన్‌ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీటి విలువ రూ.390 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు అస్సాంలోని కరీంగంజ్‌ జిల్లాలో రూ.12 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను ఓ కారులో గుర్తించినట్లు వెల్లడించారు.


మూడు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

నాగ్‌పుర్‌: ‘గజ్వా-ఏ-హింద్‌’ కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) గురువారం మూడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, గుజరాత్‌లోని వల్సాడ్‌, సూరత్‌, బోటాద్‌ జిల్లాల్లోని 8 మంది అనుమానితుల ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిందితులకు చెందిన మొబైల్‌ ఫోన్లు, ఇతర డిజిటల్‌ పరికరాలు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ‘గజ్వా-ఏ-హింద్‌’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో గ్రూపులు ఏర్పాటు చేసి భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యవహారం గత జులైలో బిహార్‌లో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పట్నా పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు.


చిత్ర వార్తలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని