ఇసుక తవ్వకాల అనుమతులపై పునఃపరిశీలన

నదీ తీరాల్లో ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) దక్షిణాది జోన్‌ (చెన్నై) అప్రమత్తం చేసింది.

Published : 25 Mar 2023 04:54 IST

అన్ని రాష్ట్రాల్లో చేపట్టాలని కేంద్రానికి ఎన్జీటీ ఆదేశం

ఈనాడు, చెన్నై: నదీ తీరాల్లో ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) దక్షిణాది జోన్‌ (చెన్నై) అప్రమత్తం చేసింది. ఇప్పటివరకు ఇచ్చిన పర్యావరణ అనుమతులను పునఃపరిశీలించాలని ఆదేశించింది. చిత్తూరు జిల్లా అరణియార్‌ నదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఇచ్చిన తీర్పులో ఎన్జీటీ ఈ వ్యాఖ్యలు చేసింది. తవ్వకాలపై ఏపీలోని తిరుపతి జిల్లా నాగలాపురం ప్రాంతానికి చెందిన డి.హేమకుమార్‌ 2021లో ఎన్జీటీని ఆశ్రయించారు. తమిళనాడులోకి నది ప్రవేశించే ముందు కరణి, సురుత్తుపల్లి, నాగలాపురం మీదుగా ప్రవహిస్తుంది. మొత్తం 11 కి.మీ.మేర ఈ గ్రామాల పరిధిలో నదీ తీరం ఉందని, ఇక్కడ ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై కోరం సభ్యులు జస్టిస్‌ పుష్ప సత్యనారాయణ, డాక్టర్‌ సత్యగోపాల్‌ విచారణ నిర్వహించారు. తాజాగా జస్టిస్‌ పుష్ప సత్యనారాయణ తీర్పునిచ్చారు. నదీ తీరంలో అనుమతులిచ్చిన బీ2 కేటగిరీ కింద నిబంధనలు, సస్టెయినబుల్‌ శాండ్‌ మైనింగ్‌ మేనేజ్‌మెంట్ నిబంధనలు-2016ను ఇక్కడ ఉల్లంఘించారని తెలిపారు. ఈ నేపథ్యంలో పనులను ఆపేయించాలని, లేకపోతే స్టేట్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్ అథారిటీ (ఎస్‌ఈఐఏఏ) నుంచి కొత్తగా పర్యావరణ అనుమతులైనా తెచ్చుకోవాలని ఆదేశించారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయంతో సంయుక్త కమిటీని ఏర్పాటుచేయాలని తీర్పులో వెల్లడించారు. జరిగిన పర్యావరణ నష్టంపై అంచనా వేసేందుకు కమిటీకి రెండు నెలల గడువును ఎన్జీటీ ఇచ్చింది. తర్వాత కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మూడు నెలల్లో పరిహారాన్ని వసూలు చేయాలని ఆదేశించింది. ఉల్లంఘనల ఆధారంగా కనీసం రూ.18 కోట్ల మధ్యంతర జరిమానాను విధించింది. పర్యావరణ నష్టంపై అంచనాకు వేసిన కమిటీ ద్వారా పరిహారం సూచించాలని తెలిపింది. కనీస మొత్తాన్ని సీపీసీబీకి 3 నెలల్లోపు చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. నందనం, బీకే బేడు, సుబ్బనాయుడు కండ్రిగ తదితర ప్రాంతాల్లో చేసిన తవ్వకాల్లో ఎలాంటి అనుమతులున్నాయి? ఏ ఉల్లంఘనలు జరిగాయనే దానిపై విచారణ చేపట్టాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులశాఖ కార్యదర్శికి ఆదేశాలనిచ్చారు. వివిధ రాష్ట్రాల్లో ఇసుక తవ్వకాల కోసం ప్రత్యేకంగా బీ1, బీ2 కేటగిరీల్లో ఇచ్చిన అనుమతులపై పునఃపరిశీలన చేయాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని