చాట్‌ జీపీటీ కంటెంటును పసిగట్టేస్తున్న ఏఐ డిటెక్షన్‌ టూల్స్‌

కృత్రిమ మేథ(ఏఐ) సాయంతో పనిచేసే గత అప్లికేషన్‌లతో పోలిస్తే చాట్‌ జీపీటీ మరింత ఉన్నతమైంది అయినప్పటికీ అది సృష్టించే అకడమిక్‌ సమాచారాన్ని ఏఐ డిటెక్షన్‌ టూల్స్‌ పసిగట్టేస్తున్నాయని ఓ నివేదిక వెల్లడించింది.

Published : 26 Mar 2023 04:52 IST

సమాచారం పడికట్టు విధానంలో ఉండటంతోనే సమస్య
విశ్వవిద్యాలయాల్లో అనుమతించాలని సూచించిన అధ్యయనం

దిల్లీ: కృత్రిమ మేథ(ఏఐ) సాయంతో పనిచేసే గత అప్లికేషన్‌లతో పోలిస్తే చాట్‌ జీపీటీ మరింత ఉన్నతమైంది అయినప్పటికీ అది సృష్టించే అకడమిక్‌ సమాచారాన్ని ఏఐ డిటెక్షన్‌ టూల్స్‌ పసిగట్టేస్తున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. పడికట్టు విధానంలో సమాచారాన్ని అందించడమే దీనికి కారణమని పేర్కొంది. అదే విధంగా కృత్రిమ మేథను విశ్వవిద్యాలయాలు ఒక పరిధి మేరకు అనుమతించాలని ఈ నివేదిక సూచించింది. పరిశోధన, విద్యా రంగాల్లో చాట్‌ జీపీటీ సమూల మార్పులను తేగలదని భావిస్తున్నప్పటికీ దీని ద్వారా కంటెంట్‌ను సృష్టించి తమదిగా చెప్పుకొనే అకడమిక్‌ మోసాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యా రంగంలో కృత్రిమ మేథను ఎంత వరకు అనుమతించొచ్చనే కోణంలో ప్లిమాత్‌ మార్‌జాన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ప్లిమాత్‌, యూకే పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చాట్‌ జీపీటీకి పరిశోధకులు కొన్ని ప్రశ్నలు ఇచ్చి కంటెంట్‌ రాసి ఇవ్వాలని అడిగారు. అది ఇచ్చిన సమాచారానికి వారు తమ సొంత కంటెంటును జత చేసి చేతి రాతతో రాసుకున్నారు. అదే వరస క్రమంలో రాస్తే ఏఐ డిటెక్షన్‌ టూల్స్‌లో దొరికిపోతారు కాబట్టి వరస క్రమాన్ని మార్చేసి ఎడ్యుకేషన్‌ అండ్‌ టీచింగ్‌ ఇంటర్నేషనల్‌ జర్నల్‌లో తమ సొంత పరిశోధనగా ప్రచురించారు. అయితే జర్నల్‌ చర్చా కాలమ్‌లో మాత్రం మొత్తం అధ్యయనం గురించి సవివరంగా ప్రస్తావించారు. కృత్రిమ మేథను ఒక సమస్యగా కాకుండా విద్యార్థులకు ఏది నేర్పాలి, వారికేది అవసరమనే కోణంలో ఆలోచించాలని నివేదికను రూపొందించిన పీటర్‌ కాటన్‌ అభిప్రాయపడ్డారు. ‘మనం విశ్వవిద్యాలయాల్లో చేసే కొన్ని పనుల్ని ఏఐ సాయంతో చక్కబెట్టేసుకుంటే.. ఆ మిగిలిన సమయాన్ని విద్యార్థులతో గడపొచ్చు. న్యూయార్క్‌ పాఠశాలల్లో చేసినట్లు చాట్‌ జీపీటీని నిషేధించడం స్వల్పకాలిక ఉపాయం మాత్రమే. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి సంస్థలు సైతం తమ సెర్చ్‌ ఇంజిన్‌లు, ఆఫీస్‌ స్టడీలలో దీనిని ఉపయోగిస్తున్నాయి. కాబట్టి విశ్వవిద్యాలయాలు సైతం ఒక పరిధి వరకు కృత్రిమ మేథను ఉపయోగించేందుకు అనుమతించాలి. ఎందుకంటే దీని వాడుక ఇప్పటికే సర్వసాధారణమైపోయింది’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని