ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది?

చట్టసభ సభ్యులపై అనర్హత వేటు తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో లక్షద్వీప్‌కు చెందిన ఎన్‌సీపీ నేత, మాజీ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ దాఖలు చేసిన కేసు విచారణ మంగళవారం సుప్రీంకోర్టులో ప్రారంభమైంది.

Published : 29 Mar 2023 05:59 IST

లోక్‌సభ సభ్యత్వ అనర్హత కేసులో మహమ్మద్‌ ఫైజల్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

దిల్లీ: చట్టసభ సభ్యులపై అనర్హత వేటు తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో లక్షద్వీప్‌కు చెందిన ఎన్‌సీపీ నేత, మాజీ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ దాఖలు చేసిన కేసు విచారణ మంగళవారం సుప్రీంకోర్టులో ప్రారంభమైంది. హత్యాయత్నం కేసులో ఫైజల్‌ను దిగువ న్యాయస్థానం దోషిగా తేల్చడంపై హైకోర్టు స్టే విధించినా..లోక్‌సభ సచివాలయం ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించకపోవడంతో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారణను ప్రారంభిస్తూ... ఏ ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లిందని ప్రశ్నించింది. ‘ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే హక్కును లాగేసుకున్నారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం’ అని ఫైజల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి సమాధానమిచ్చారు. అయితే, ఈ విషయంలో హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఇప్పటికే సంబంధిత కేసును విచారించినందున.. మళ్లీ సర్వోన్నత న్యాయస్థానంలోనే వ్యాజ్యం వేసినట్లు న్యాయవాది సింఘ్వి వివరించారు. ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ కొనసాగించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో ఈ కేసు విచారణకు రావడం ఆసక్తికరంగా మారింది.

2009లో కాంగ్రెస్‌ నాయకుడు మహ్మద్‌ సలీహ్‌పై దాడి చేశారన్న కేసులో ఈ ఏడాది జనవరి 10న లక్షద్వీప్‌ ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌ను కవరత్తీ సెషన్స్‌ కోర్టు దోషిగా తేల్చింది. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. తీర్పు వెలువడిన మూడు రోజుల తర్వాత (జనవరి 13న) లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేస్తూ ప్రకటన జారీ చేసింది. ఫైజల్‌ కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో... సెషన్స్‌ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో ఆయనపై పడిన అనర్హత వేటు చెల్లుబాటు కాకుండా పోయింది. అయినప్పటికీ.. ఫైజల్‌ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించలేదు. దీన్ని సవాల్‌ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని