కొత్త పార్లమెంటుపై పిల్‌ కొట్టివేత

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది.

Published : 27 May 2023 05:56 IST

అధికరణం 79కి, ప్రారంభోత్సవానికి సంబంధమేంటి?
పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలన్న సుప్రీంకోర్టు

ఈనాడు, దిల్లీ: నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జరిగేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌ ఎందుకు దాఖలు చేశారో న్యాయస్థానం అర్థం చేసుకోగలమని, రాజ్యాంగంలోని అధికరణం 32 కింద ఈ పిటిషన్‌ను తీసుకోవడానికి తాము సుముఖంగా లేమని జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం తెలిపింది. పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాది సీఆర్‌ జయా సుకిన్‌ తన వాదనలు వినిపిస్తూ.. పార్లమెంటులో రాష్ట్రపతి, రెండు సభలూ భాగమని చెప్పే అధికరణం 79ని ప్రస్తావించారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రముఖమైన వ్యక్తి అని, కార్యనిర్వాహక వ్యవస్థకు అధిపతి అని.. ఆమే ప్రారంభించాలని పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం ద్వారా రాష్ట్రపతిని కేంద్రం, లోక్‌సభ సచివాలయం అవమానానికి గురిచేసిందని పిటిషన్‌లో సుకియా తెలిపారు. పార్లమెంటు సమావేశాలు కూడా రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం కావాలన్న అధికరణం 87ను కూడా ఉటంకించారు. అయితే ప్రారంభోత్సవానికి, అధికరణం 79,87లకు సంబంధమేంటని జస్టిస్‌ జేకే మహేశ్వరి ప్రశ్నించారు. విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేశారు. దీంతో ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని సుకిన్‌ కోరారు. దీనిపై కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపసంహరణకు అనుమతిస్తే.. హైకోర్టులో దాఖలు చేస్తారని తెలిపారు. అయితే తాను దాఖలు చేయనని సుకియా పేర్కొనడంతో ధర్మాసనం ఉపసంహరణకు అనుమతిస్తూ.. పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని