IIT Madras: ఐఐటీ మద్రాస్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌

ఐఐటీ మద్రాస్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎలక్ట్రానిక్స్‌) పేరుతో నాలుగేళ్ల ఆన్‌లైన్‌ కోర్సును ఈ ఏడాది ప్రారంభించింది. ఇందులో ఏడాది, రెండున్నరేళ్ల కోర్సు (డిప్లొమా)లు కూడా చేయొచ్చు.  

Updated : 16 Jun 2023 07:04 IST

 నాలుగేళ్ల ఆన్‌లైన్‌ కోర్సు  ఈ ఏడాది నుంచి ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌:  ఐఐటీ మద్రాస్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎలక్ట్రానిక్స్‌) పేరుతో నాలుగేళ్ల ఆన్‌లైన్‌ కోర్సును ఈ ఏడాది ప్రారంభించింది. ఇందులో ఏడాది, రెండున్నరేళ్ల కోర్సు (డిప్లొమా)లు కూడా చేయొచ్చు.  ఐఐటీ ప్రొఫెసర్లు రాధాకృష్ణ గంటి, అనిరుద్ధన్‌లు గురువారం హైదరాబాద్‌లో ఈ వివరాలు వెల్లడించారు. ‘ఎలక్ట్రానిక్స్‌ రంగంలో అపార అవకాశాలున్నాయి. ఆ రంగంలో ఇంజినీర్ల కొరతను తగ్గించేందుకు ఈ కొత్త కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. ఇంటర్‌లో భౌతికశాస్త్రం, గణిత శాస్త్రాలు చదివిన విద్యార్థులతోపాటు, ఆ రెండు సబ్జెక్టులు చదివి.. ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఈ కోర్సులో ప్రవేశించేందుకు అర్హులే. ఆసక్తి ఉన్నవారు మద్రాస్‌ ఐఐటీ వెబ్‌సైట్‌లో ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశం పొందేందుకు గరిష్ఠ వయోపరిమితి లేదు. సీట్లకూ పరిమితి లేదు. ప్రవేశం పొందిన వారికి నెల తర్వాత ఓ పరీక్ష నిర్వహిస్తాం. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి కోర్సుల్లో శిక్షణ మొదలవుతుంది. ఉత్తీర్ణత సాధించని పక్షంలో మరోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది.  ప్రాక్టికల్స్‌, సెమిస్టర్‌ పరీక్షలు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో రాయాల్సి ఉంటుంది. ప్రతి సెమిస్టర్‌లో రెండు వారాలపాటు మద్రాస్‌ ఐఐటీలోని ప్రయోగశాలలో ప్రయోగాలకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఫీజు రూ.5.40 లక్షలు.. నాలుగేళ్ల కోర్సుకు రూ.5.40 లక్షలు ఫీజుగా నిర్ణయించాం. ఏడాది కోర్సుకు రూ.80 వేలు, డిప్లొమా పూర్తిచేయాలనుకొనేవారు రూ.2.48 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులో రాయితీలు, ఉపకారవేతనాలు ఉంటాయి’’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని