Delhi - Chennai Distance: దిల్లీ - చెన్నైల మధ్య 300 కి.మీ.తగ్గనున్న దూరం

కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ హైవేకి అనుబంధంగా సూరత్‌ నుంచి చెన్నై వరకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కారణంగా దిల్లీ-చెన్నైల మధ్య రోడ్డు మార్గం 300 కిలోమీటర్ల మేర తగ్గనుందని కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

Updated : 28 Jun 2023 16:56 IST

సూరత్‌ - సోలాపుర్‌ - కర్నూలు - చెన్నై రహదారి నిర్మాణంతో సాధ్యం
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ హైవేకి అనుబంధంగా సూరత్‌ నుంచి చెన్నై వరకు నిర్మించే గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కారణంగా దిల్లీ-చెన్నైల మధ్య రోడ్డు మార్గం 300 కిలోమీటర్ల మేర తగ్గనుందని కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో 9 ఏళ్లలో తమ మంత్రిత్వశాఖ చేపట్టిన పనులను, ఫలితాలను వెల్లడించారు.

‘సూరత్‌-నాసిక్‌-అహ్మద్‌నగర్‌-సోలాపుర్‌-కర్నూలు నుంచి హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై, కన్యాకుమారి, తిరువనంతపురం, కొచ్చి వరకు పలు రహదారులు నిర్మిస్తున్నాం. సూరత్‌ నుంచి సోలాపుర్‌ వరకు రూ.25 వేల కోట్లతో నిర్మిస్తున్న 719 కి.మీ. రహదారి నిర్మాణం 11% పూర్తయింది. అలాగే సోలాపుర్‌-కర్నూలు-చెన్నైమధ్య రూ.11వేల కోట్లతో నిర్మిస్తున్న 340 కి.మీ రహదారి పనులు 13% పూర్తయ్యాయి.

  • రాయపూర్‌-విశాఖపట్నం మధ్య రూ.17వేల కోట్లతో నిర్మిస్తున్న 465 కి.మీ. రహదారి నిర్మాణం 34% పూర్తయింది. ఇందోర్‌-హైదరాబాద్‌ మధ్య 525 కి.మీ. రహదారి నిర్మాణ పనులు 68% పూర్తయ్యాయి.
  • నాగ్‌పుర్‌-విజయవాడ రహదారి నిర్మాణం 21% పూర్తి చేశాం. రూ.4,754కోట్లతో చిత్తూరు నుంచి థాచర్‌ వరకు తలపెట్టిన 116 కి.మీ. రహదారి నిర్మాణ పనులు 3% అయ్యాయి. హైదరాబాద్‌-రాయ్‌పుర్‌ రహదారి నిర్మాణం ఇంకా ప్రారంభంకాలేదు.

మోదీ ప్రభుత్వం రహదారుల నిర్మాణంలో 7 ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. ప్రపంచంలో అమెరికా తరవాత అతిపెద్ద రోడ్‌ నెట్‌వర్క్‌ ఉన్న దేశంగా భారత్‌ అవతరించింది. మేం అధికారంలోకి వచ్చేప్పటికి రోడ్‌ నెట్‌వర్క్‌ 91,287 కి.మీ. మేర ఉండేది. అందులో నాలుగు వరసల రహదారులు 18,371 కి.మీ (20%)ఉండేవి. ఇప్పుడు అది 46,657 కి.మీ.కు చేరింది. దానివల్ల ట్రాఫిక్‌ రద్దీ తగ్గింది. 2013-14లో టోల్‌ ట్యాక్స్‌ రూ.4,770 కోట్లు వచ్చేది. ఇప్పుడు అది రూ.41,342 కోట్లకు చేరింది. 2030నాటికి టోల్‌ వసూలు రూ.1.30 లక్షల కోట్లకు పెరుగుతుంది.

ఆగస్టులో ఫ్లెక్స్‌ ఇంజిన్లు

ఆగస్టులో ఫ్లెక్స్‌ ఇంజిన్‌ వాహనాలు రానున్నాయి. బజాజ్‌, టీవీఎస్‌, హీరో సంస్థలు ఫ్లెక్స్‌ ఇంజిన్‌ స్కూటర్‌, ఆటోరిక్షాలు తయారుచేశాయి. టయోటా, సుజుకి నుంచి ఫ్లెక్స్‌ ఇంజిన్‌ వాహనాలు రానున్నాయి. ఇందులో 100% ఇథనాల్‌ వాడవచ్చు. దీనివల్ల సగటు పెట్రోల్‌ ధర రూ.15కి సమానమవుతుంది. త్వరలో హైడ్రోజన్‌ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి’ అని గడ్కరీ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని