DRDO Young Scientist Laboratory: బ్రహ్మాస్త్రంపైకి ‘పిచ్చుకలు..!’

తక్కువ ఖర్చుతో శత్రువుకు ఎక్కువ నష్టం కలిగించే అసిమెట్రిక్‌ టెక్నాలజీతో సరికొత్త ఆయుధాలను రూపొందిస్తున్నారు.

Updated : 02 Jul 2023 08:39 IST

శత్రువు మీద అసిమెట్రీ తంత్రం
చౌకైన, చిన్నపాటి అస్త్రాలతో శక్తిమంతమైన ఆయుధాల ధ్వంసం
అధునాతన పరిజ్ఞానాలను సిద్ధం చేస్తున్న యంగ్‌ సైంటిస్ట్‌ ల్యాబ్‌
కంభంపాటి సురేష్‌
ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

ఎంత పెద్ద బెలూన్‌ అయినా చిన్నపాటి గుండుసూదికి లోకువే!

ఎంత పెద్ద వెన్నముద్ద అయినా చిన్న సెగకు నీరుగారాల్సిందే!

... సరిగ్గా అదే సూత్రాన్ని పాటిస్తున్నారు భారత యువ పరిశోధకులు!

పెద్దపెద్ద శత్రు ఆయుధాలను సైతం ‘చిన్న కర్ర’తో కొట్టబోతున్నారు!

పిచ్చుకపైకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించకూడదన్నది సామెత..!

అయితే ఇక్కడ పిచ్చుకలను ప్రయోగించి.. బ్రహ్మాస్త్రం లాంటి శక్తిమంతమైన ఆయుధాన్ని నేలకూల్చుతున్నారు.!!


క్కువ ఖర్చుతో శత్రువుకు ఎక్కువ నష్టం కలిగించే అసిమెట్రిక్‌ టెక్నాలజీతో సరికొత్త ఆయుధాలను రూపొందిస్తున్నారు. సూక్ష్మంలో మోక్షంలాంటి ఈ మహత్తర పరిశోధనకు మన హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన యంగ్‌ సైంటిస్ట్‌ ల్యాబ్‌ వేదికవటం, దానికి మన తెలుగుతేజం పర్వతనేని శివప్రసాద్‌ సారథ్యం వహిస్తుండటం విశేషం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచన మేరకు స్టార్టప్‌ తరహాలో ఏర్పడి... భవిష్యత్‌తరం ఆయుధ వ్యవస్థల్ని రూపొందిస్తున్న ఈ యంగ్‌ సైంటిస్ట్‌ ల్యాబ్‌లో అడుగుపెట్టడానికి ‘ఈనాడు’కు ప్రత్యేక అనుమతి లభించింది.


అదో లోహ తుమ్మెదల బారు

‘స్వార్మ్‌ డ్రోన్లు’ అన్నది వాటి పేరు.


ఏ ఝుంకారమూ చేయకుండా... ఇట్టే శత్రువుల ప్రాణాలు తీసేస్తాయవి.


మామూలు డ్రోన్స్‌ని.. ఎవరో ఒకరు.. ఏదో రకంగా ఆపరేట్‌ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ స్వార్మ్‌ డ్రోన్లు అలా కాదు. కృత్రిమ మేధ (ఏఐ)తో సమూహంలా పనిచేస్తూనే అద్భుత సమన్వయంతో ముందుకు సాగుతాయి.


ఓ సుశిక్షిత బెటాలియన్‌లా తమని తాము నియంత్రించుకుంటూ.. తమలోతాము చర్చించుకుంటూ శత్రుమూకలపై దాడి చేయగలవు.


ఒకవేళ శత్రుదాడిలో వీటిలో కొన్ని డ్రోన్లు నేలకూలాయనుకుందాం! మిగిలినవి అప్పటికప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకుని, కొత్త పొజిషన్‌లోకి వెళ్లగలవు.


చివరికి ఒక్కటే ఉన్నా సరే... ఆ విషయం తనకు తానే గ్రహించి.. అందుకు అనుగుణంగా సరికొత్త ఎత్తుగడతో శత్రువుపై యుద్ధం చేయగలదు.


అత్యంత అధునాతనమైన స్వార్మ్‌ డ్రోన్ల సామర్థ్యాలకు ఇవి మచ్చు తునకలే! ప్రపంచంలోని ఒకట్రెండు దేశాలకి మాత్రమే పరిమితమైన ఈ టెక్నాలజీని మనకూ సొంతం చేసింది ఓ యువ బృందం.


శాస్త్ర ప్రయోగశాల అనగానే... సీరియస్‌గా పరిశోధనలు చేసే దృశ్యం కళ్లముందు కదలాడుతుంది. అందులోనూ రక్షణ పరిశోధనంటే అంతా తలపండిన వారుంటారనుకుంటాం. కానీ డీఆర్‌డీవోలోని ఈ యువ బృందం పనిచేసే కార్యాలయం ఏదో కాలేజీ క్యాంటీన్‌ని తలపిస్తుంది. ‘అరె... ఇప్పుడు మనం చేసేది అసిమెట్రిక్‌ కింద వస్తుందా... రాదా తేల్చరా ముందు!’ అంటాడు అక్కడ కొత్తగా చేరిన సభ్యుడైనా సరే తన సహచరుడిని ఉద్దేశించి! అక్కడ ‘బాస్‌’కూ బేషజాలు ఉండవు. అధికార దర్పం లేకుండా అందరితో కలివిడిగా ఉంటారు. ఇక్కడ ‘చిన్నా..పెద్దా’ గొడవలేవీ ఉండవు. అందరూ సమానం. ఎప్పుడు ఏ రిస్క్‌ తీసుకోవాలన్నా వాళ్లు సిద్ధం. ఏ కాలేజీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌లోనో కనిపించే స్టార్టప్‌లాంటి ఈ యువబృందం ఉండేది.. మిలటరీ క్రమశిక్షణకీ, కట్టుబాట్లకీ ప్రసిద్ధిచెందిన డీఆర్‌డీవోలో! దేశానిక్కావాల్సిన ఆయుధ సంపత్తిపైన పరిశోధనలు సాగించే ఈ వ్యవస్థలోని మిగతా శాస్త్రవేత్తలందరిదీ ఒకదారి అయితే.. ఈ యువ తేజాలది కొత్త ఒరవడి. నిజానికి ఈ యువబృందాన్ని ఏర్పాటుచేసిన ప్రధాని మోదీ లక్ష్యం కూడా అదే. కాలేజీ విద్యార్థుల్లా స్వేచ్ఛగా ఉంటూ మేధోపరంగా కొత్త సాహసాలెన్నో చేయాలన్నదే ఆయన అంతరంగం. వీళ్ల దూకుడుతో మన దేశ శాస్త్ర సాంకేతిక రంగం ఒక్కసారిగా వెయ్యి అడుగులు ముందుకేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ ప్రయత్నంలో వీళ్లు విఫలమైనా ‘బే ఫికర్‌’ అని ప్రధాని స్వయంగా వెన్నుతడుతున్నారు.

‘డీఆర్‌డీవోలో కావొచ్చు, దేశంలో ఉన్న ఇతర పరిశోధన సంస్థల్లో కావొచ్చు... ఎక్కడైనా సీనియర్లలో రిస్కు తీసుకునే సామర్థ్యం సన్నగిల్లుతుంటుంది. సీనియారిటీ పెరిగేకొద్దీ గొప్ప నైపుణ్యం ఉంటుంది కానీ సాహసించే గుణం తగ్గుతుంది. సీనియర్ల నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూనే రిస్కు తీసుకోవడానికి ముందుండే యువసైంటిస్టులు కావాలి మనకు!’ - ప్రధాని మోదీ ఎప్పట్నుంచో రక్షణరంగ నిపుణులతో చర్చిస్తున్న విషయం ఇది. అవన్నీ ఓ కొలిక్కి వచ్చి 2020 జనవరి 2న దేశంలో తొలిసారి ఐదు యంగ్‌ సైంటిస్టు ల్యాబ్‌లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ ఐదూ డీఆర్‌డీవో పర్యవేక్షణలోనే ఉన్నా సరే... వేర్వేరు ప్రాంతాల నుంచి పనిచేస్తున్నాయి. బెంగళూరు ఐఐఎస్‌సీలో ఉన్న ల్యాబ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై, ఐఐటీ-బొంబాయిలో నెలకొల్పిన ల్యాబ్‌ క్వాంటమ్‌ టెక్నాలజీస్‌పై, ఐఐటీ-మద్రాసులో ఏర్పాటైన ల్యాబ్‌ కాగ్నిటివ్‌ టెక్నాలజీస్‌పై పనిచేస్తాయి. మిగతా రెండు యంగ్‌ ల్యాబ్‌లూ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అందులో ఒకటి- స్మార్ట్‌ మెటీరియల్స్‌ ల్యాబ్‌. ఇది ఇక్కడి డిఫెన్స్‌ మెటలర్జికల్‌ రీసర్చ్‌ ల్యాబరేటరీ(డీఎంఆర్‌ఎల్‌)లో ఉంది. ఆ రెండో యూత్‌ల్యాబ్‌ గురించే మనం చెప్పుకోబోతున్నాం. అది ‘అసిమెట్రిక్‌ టెక్నాలజీస్‌’ పై పరిశోధన చేస్తోంది. దాన్ని డీఆర్‌డీవో యంగ్‌ సైంటిస్ట్‌ ల్యాబ్‌- అసిమెట్రిక్‌ టెక్నాలజీస్‌ (డీవైఎస్‌ఎల్‌-ఏటీ)గా పిలుస్తున్నారు.


పనితీరు ఇలా

మనం చేస్తున్న ఈ ప్రాజెక్టుతో ఫలితం వస్తుందా.. రాదా..? అనే విషయాన్ని పక్కనపెట్టి ఇందులో పాల్గొనేవాళ్లనే ఎంచుకుంటున్నారు. డీఆర్‌డీవోలోని వివిధ విభాగాల నుంచి 35 ఏళ్లలోపున్నవాళ్లనే ఇందులోకి తీసుకుంటున్నారు. వాళ్లు ఆయా విభాగాల్లో పనిచేస్తే వచ్చే పదోన్నతులూ, ఇతర అభివృద్ధినీ లెక్కచేయకుండానే ఇందులోకి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే- ఈ ప్రాజెక్టుల్లో పనిచేసేవన్నీ విజయం సాధించకపోవచ్చు. ‘అయినా పర్వాలేదు..!’ అనుకుని దూకుడుగా వచ్చే యువ సైంటిస్టుల్నే ఇందులోకి తీసుకుంటున్నారు. ఓ రకంగా డీఆర్‌డీవో పరిధిలోనే ఓ స్టార్టప్‌ వ్యవస్థాపకుల్లా సాహసించేవాళ్లకే ఇందులో అవకాశం కల్పిస్తున్నారు. మిగతా ల్యాబ్‌లతో పోలిస్తే వాళ్లకి ఇక్కడ పూర్తిస్థాయి స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లా ఇక్కడ ఓ ఫైల్‌ కదలడానికి ఏళ్ళూపూళ్ళూ పట్టవు. ఈ యంగ్‌ సైంటిస్ట్‌ ల్యాబుల్లో పాలనాపరమైన వ్యవహారాలు చూసుకునేదంతా ఒకే వయసువారు అయ్యిండటం, అధికార అంచెలు(హైరార్కీ) సమస్యలు లేకపోవడం వల్ల ఇలా దేన్నయినా కొన్ని గంటల్లోనే తేల్చేస్తారు. అవసరమైతేనే... సీనియర్ల సలహాలు తీసుకుంటారు.


అసిమెట్రిక్‌ బృందం లక్ష్యాలివి...

స్థూలంగా అసిమెట్రిక్‌ అంటే.. చాలా తక్కువ ఖర్చుతో శత్రువుకు ఎక్కువ నష్టం కలిగించడమన్నమాట! ఈ సూత్రం ఆధారంగా రక్షణ రంగానికి సాయపడటం కోసం కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో పనిచేయడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఆ సాంకేతికతల ద్వారా నేల, నింగి, నీటిలో శత్రువుపై మూకుమ్మడి దాడి చేసే డ్రోన్లు, రోబోలు, సైబార్గ్‌లు, నెట్‌వర్క్‌ సెంట్రిక్‌ ఆయుధాలను రూపొందించడం. ప్రస్తుతం మనదగ్గరున్న వ్యవస్థలకన్నా పెద్ద స్థాయిలో ముందడుగు (లీప్‌ఫ్రాగింగ్‌) వేయాలన్నది వీళ్లకి నిర్దేశించిన మార్గం. కానీ ఈ యువ శాస్త్రవేత్తలు సూపర్‌సోనిక్‌ క్షిపణిలాంటివి తయారుచేసే పెద్ద ప్రాజెక్టులవైపు వెళ్లరు. అతితక్కువ సమయంలో, తక్కువ మంది చేయగల... కానీ రిస్కు ఎక్కువగా ఉన్న ప్రయోగాలవైపే దృష్టిసారిస్తారు.


ఇప్పటిదాకా...

వీళ్ల మొదటి ఆవిష్కరణ ‘డ్రోన్‌ స్వార్మ్‌’కి సంబంధించింది. స్వీయ మేధస్సు కలిగిన డ్రోన్లు పరస్పరం సమన్వయంతో ఒక దండులా శత్రువుపైకి విరుచుకుపడటం ఈ సాంకేతికతలోని ప్రధానాంశం. 2021 నవంబరులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో నిర్వహించిన ‘రాష్ట్ర రక్షా సమర్పణ్‌ పర్వ్‌’ కార్యక్రమంలో దీన్ని ప్రదర్శించి యావద్దేశాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది ఈ యువ ల్యాబ్‌.  ఇక రెండో ఉత్పత్తి... గన్‌ ఆన్‌ డ్రోన్‌. ఇది కూడా డ్రోనే కానీ దీనికి జేవీపీసీ (జాయింట్‌ వెంచర్‌ ప్రొటెక్టివ్‌ కార్బైన్‌) అనే తుపాకీని పెడతారు.

ఈ డ్రోన్‌ తన మేధస్సుతో శత్రువును గుర్తించి, గురి తప్పకుండా కాల్పులు జరుపుతుంది. ఇప్పటిదాకా ఇలాంటి సాంకేతికత మన దగ్గర లేదు. సాధారణంగా ఆకాశం నుంచి కాల్పులు జరిపేటప్పుడు మన తూటాలన్నీ లక్ష్యాన్ని తాకడం అంత సులువు కాదు. హెలికాప్టర్లపై నుంచి కాలుస్తూపోతే ఏవో కొన్ని తూటాలు మాత్రమే లక్ష్యాన్ని ఛేదిస్తుంటాయి. కానీ గన్‌ ఆన్‌ డ్రోన్‌ అలా కాదు. వందకు వందశాతం గురితప్పకుండా శత్రువుని కాల్చేస్తుంది. శత్రువు గజిబిజిగా అటూఇటూ కదలుతున్నా సరే తూటా దించేస్తుంది. శత్రువు ఎదురుతిరిగి కాలిస్తే తప్పించుకునే ‘ఎవేడింగ్‌ ట్రాజెక్టరీ’ అనే స్వీయ మేధస్సు కూడా దీనికి ఉంటుంది. దీంతోపాటూ గుట్టుచప్పుడు కాకుండా నీటి అడుగున సంచరిస్తూ ప్రత్యర్థిపై విరుచుకుపడే అండర్‌వాటర్‌ అటానమస్‌ వెహికల్‌నీ అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ‘ర్యాట్‌ సైబార్గ్‌’నూ రూపొందిస్తున్నారు. ఇందులో ఎలుక మెదడును నియంత్రిస్తూ.. దాన్ని నేలపై సంచరించే ఒక నిఘా సాధనంలా ఉపయోగించుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని