యూసీసీపై ఆగని రగడ

ఉమ్మడి పౌరస్మృతిపై (యూసీసీ) వివాదం కొనసాగుతూనే ఉంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో భాజపా ప్రభుత్వం యూసీసీ బిల్లు పెట్టనున్న నేపథ్యంలో పలువురు స్పందిస్తున్నారు.

Updated : 05 Jul 2023 05:23 IST

పలు ప్రశ్నలను లేవనెత్తిన పంజాబ్‌ సీఎం మాన్‌
అది రాజ్యాంగ నిర్మాతల స్వప్నం: ధన్‌ఖడ్‌
ఉత్తరాఖండ్‌లో అమలుకు సిద్ధం: సీఎం

చండీగఢ్‌, గువాహటి: ఉమ్మడి పౌరస్మృతిపై (యూసీసీ) వివాదం కొనసాగుతూనే ఉంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో భాజపా ప్రభుత్వం యూసీసీ బిల్లు పెట్టనున్న నేపథ్యంలో పలువురు స్పందిస్తున్నారు. కొందరు వ్యతిరేకిస్తుండగా మరి కొందరు సమర్థిస్తున్నారు. యూసీసీని అమలు చేస్తామని భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కొక్కరుగా ప్రకటిస్తున్నారు.

ఎక్కువ మందిపై ప్రభావం

యూసీసీ అధిక శాతం మంది ప్రజలపై ప్రభావం చూపనుందని రాజకీయ నేతగా మారిన మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ స్పష్టం చేశారు. ‘దాని పరిణామాలు మంచైనా చెడైనా అయోధ్య, ఆర్టికల్‌ 370 కంటే మరింత విస్తృతమైనవని అభిప్రాయపడ్డారు. బిహార్‌లోని సమస్తిపుర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

సామాజిక సమానత్వం ఉంటేనే సాధ్యం: మాన్‌

అసలు రాజ్యాంగంలో అలాంటి ఆలోచన ఏదైనా ఉందా అని భాజపాను పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ప్రశ్నించారు. సామాజిక సమానత్వం ఉంటేనే యూసీసీ అమలు సాధ్యమని అభిప్రాయపడ్డారు. యూసీసీ బిల్లుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ సూత్రప్రాయంగా మద్దతు తెలిపిన నేపథ్యంలో మంగళవారం చండీగఢ్‌లో మాన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికలొచ్చినప్పుడల్లా భాజపా మతతత్వ ఎజెండాను బయటకు తీస్తుందని విమర్శించారు.

అమలయ్యే రోజు వచ్చింది

రాజ్యాంగ నిర్మాతలు ఆశించినట్లుగా దేశమంతటా యూసీసీ అమలయ్యే రోజు వచ్చేసిందని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ పేర్కొన్నారు. మంగళవారం గువాహటిలోని ఐఐటీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. యూసీసీని కొన్ని వర్గాలు రాజకీయ కారణాలతో వ్యతిరేకించడం దిగ్భ్రాంతికరమని వ్యాఖ్యానించారు. యూసీసీలో అన్ని వ్యక్తిగత చట్టాలు, వారసత్వం, దత్తత చట్టాలు కలిసిపోతాయని వెల్లడించారు.

ఉత్తరాఖండ్‌లో అమలు చేస్తాం

ఉత్తరాఖండ్‌లో త్వరలోనే యూసీసీని అమలు చేస్తామని ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ ప్రకటించారు. మంగళవారం దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను యూసీసీ గురించి ప్రధానితో మాట్లాడలేదని, అయితే దానిని దేశమంతటా అమలు చేయాలన్నది ప్రధాని ఆలోచనని చెప్పారు. 

మైనారిటీలకు వ్యతిరేకం: జోరాంతంగ

మైనారిటీలకు యూసీసీ వ్యతిరేకమని మిజోరం ముఖ్యమంత్రి జోరాంతంగ స్పష్టం చేశారు. ఈ మేరకు జాతీయ లా కమిషన్‌కు ఆయన లేఖ రాశారు. మిజోల మత, సామాజిక పరిస్థితులపై యూసీసీ తీవ్ర ప్రభావం చూపనుందని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని