వీసాలతో సిక్కు యువతకు ఎర

ఖలిస్థాన్‌కు అనుకూలంగా కెనడా నుంచి కార్యకలాపాలు నడిపేందుకు అమాయక సిక్కు యువతను వీసాలతో ప్రలోభపెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి.

Published : 28 Sep 2023 05:50 IST

చిరుద్యోగాల ముసుగులో తీసుకువచ్చి ఉద్యమ విస్తరణ
కెనడాలో ఖలిస్థాన్‌ అనుకూలుర తీరు
గురుద్వారాలపై నియంత్రణ.. వాటిలోనే ఆశ్రయం

దిల్లీ: ఖలిస్థాన్‌కు అనుకూలంగా కెనడా నుంచి కార్యకలాపాలు నడిపేందుకు అమాయక సిక్కు యువతను వీసాలతో ప్రలోభపెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వీసాలను స్పాన్సర్‌ చేయడం ద్వారా వారిని కెనడాకు రప్పిస్తున్నా దాని వెనుక ఏకైక లక్ష్యం మాత్రం ఖలిస్థాన్‌ ఎజండాను అమలు చేయడమేనని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఇటీవల హత్యకు గురైన ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ మాత్రమే కాకుండా మణీందర్‌ సింగ్‌ బుయాల్‌, పర్మీందర్‌ పంగ్లీ, భగత్‌సింగ్‌ బ్రార్‌ వంటి ఇతర నేతలు కూడా ఇదేపని చేసేవారని తెలిపాయి. ప్లంబర్లు, ట్రక్కు డ్రైవర్లు, గురుద్వారాల్లో మతపరమైన పనిచేసే సేవాదార్‌ వంటి ఉద్యోగాల పేరుతో యువతను రప్పించి, వారి వీసాలను స్పాన్సర్‌ చేయించే కొత్త ఆలోచనకు ఖలిస్థాన్‌ ఉద్యమనేతలు తెరతీశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడం, మతపరమైన విప్లవవాద సమావేశాల నిర్వహణ వంటి పనులకు వీరిని వాడుకునేవారు. చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటూ, ఆశ్రయం కోసం ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, ఇతర భారతీయ యువతకు చేయూత ఇస్తున్నట్లుగా కనిపిస్తూ, చివరకు ఉద్యమ విస్తరణ కార్యకలాపాలకు వాడుకునేవారు. దీనికోసం గురుద్వారా వనరుల్నీ వినియోగించుకునేవారు. పొందిన సాయానికి బదులుగా ఇష్టంగానో, అయిష్టంగానో వారు ఖలిస్థాన్‌ బలగాలతో కలిసి పనిచేసే పరిస్థితి వచ్చేది. పాక్‌ ఐఎస్‌ఐ మద్దతు ఉన్న ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ గ్రూపు నేతలు తమ ఉద్యమం విజయవంతం అవుతోందని భ్రమ కల్పించేందుకు ఇలాంటివారిని వాడుకునేవారు. సర్రే, బ్రాంప్టన్‌, ఎడ్మంటన్‌ వంటి చోట్ల ఉన్న దాదాపు 30 గురుద్వారాలపై వారికి నియంత్రణ ఉండడంతో ఎక్కువమందిని రప్పించే పని సులువయ్యేది.

ఒక లేఖ విలువ రూ.2 లక్షలు

పంజాబ్‌లోని గ్యాంగ్‌స్టర్లతో నిజ్జర్‌, బుయాల్‌, బ్రార్‌ వంటివారు పొత్తుపెట్టుకుని వారిని కెనడాకు రప్పించి, బదులుగా తమవారిచేత పంజాబ్‌లో ఉగ్రదాడులు చేయించేవారని బయటపడింది. భారత్‌లో మత ప్రాతిపదికన అణచివేతను ఎదుర్కొంటున్నారని చిత్రించి, కెనడాలో రాజకీయ శరణార్థులుగా ఉండేలా లేఖలు ఇచ్చేందుకు లక్ష నుంచి రూ.2 లక్షల వరకు కొందరు ఖలిస్థాన్‌ అనుకూల రాజకీయ పార్టీల నేతలు వసూలు చేయడం గమనార్హం. ఇలాంటి లేఖలతో కెనడాకు వెళ్లాక ఖలిస్థాన్‌ ఉద్యమంలో అనివార్యంగా చేరేవారు.

పన్నూపై నిషేధం విధించండి

‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ పన్నూ కెనడాలో అడుగుపెట్టకుండా నిషేధించాలని హిందూ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ మేరకు హెచ్‌ఎఫ్‌సీ ప్రతినిధి కెనడా ఇమ్మిగ్రేషన్‌ మంత్రిని కలిసి వినతి సమర్పించారు.  పన్నూపై ఇప్పటికే భారత్‌ కన్నెర్ర చేసింది. నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ప్రమేయం ఉందని కెనడా ఎంపీ జగ్మీత్‌సింగ్‌ అమెరికాలోని ఒట్టావాలో ఆరోపించారు.


పాక్‌ ఐఎస్‌ఐ హస్తం ఉందా?

నిజ్జర్‌ హత్య వెనుక పాక్‌ ఐఎస్‌ఐ హస్తం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్‌ను దోషిగా చేయాలని ఐఎస్‌ఐ ఈ కుట్ర పన్ని ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నిజ్జర్‌కు కెనడాలో పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లతో సంబంధాలున్నాయి. కెనడాకు వచ్చే తమ గ్యాంగ్‌స్టర్లకు పూర్తి మద్దతు ఇవ్వాలని ఐఎస్‌ఐ గత కొన్నేళ్లుగా నిజ్జర్‌పై ఒత్తిడి పెంచుతోంది. అతను మాత్రం ఖలిస్థానీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. కోపం పెంచుకున్న ఐఎస్‌ఐ.. నిజ్జర్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు