36 మీటర్లు పూర్తయిన తవ్వకం

ఉత్తరాఖండ్‌ సొరంగంలో చిక్కుకున్న 41 మందిని రక్షించడానికి కొండ పైభాగం నుంచి చేపట్టిన 86 మీటర్ల డ్రిల్లింగ్‌ పనిలో సోమవారం రాత్రికి 36 మీటర్లు పూర్తయింది.

Published : 28 Nov 2023 04:35 IST

సహాయక చర్యల్లో బొగ్గుగని కార్మికులు
ప్రధాని ముఖ్య కార్యదర్శి మిశ్ర సమీక్ష

ఉత్తర్‌కాశీ: ఉత్తరాఖండ్‌ సొరంగంలో చిక్కుకున్న 41 మందిని రక్షించడానికి కొండ పైభాగం నుంచి చేపట్టిన 86 మీటర్ల డ్రిల్లింగ్‌ పనిలో సోమవారం రాత్రికి 36 మీటర్లు పూర్తయింది. కూలీలను బయటకు తెచ్చేందుకు 1.20 మీటర్ల వెడల్పైన గొట్టాలను వీటిద్వారా ప్రవేశపెడుతున్నారు. కొండలో ఎక్కడెక్కడ మట్టి స్వభావం ఎలా ఉందో తెలుసుకునేందుకు మొదట చేపట్టిన పనుల్లో భాగంగా 200 మి.మీ. వ్యాసం ఉన్న పైపులను 75 మీటర్ల వరకు పంపించగలిగారు. అంటే అక్కడివరకు ఆటంకాలు లేనట్లే. మరోపక్క- 12 మంది ‘ర్యాట్‌ హోల్‌ మైనర్లు’ (బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణత ఉన్నవారు) ఈ సొరంగ మార్గం వద్దకు చేరుకున్నారు. నేలకు సమాంతరంగా తొలుత చేపట్టిన పనులు ఆగిపోయినచోట కూలీల ద్వారా తవ్వకాన్ని వారి సహకారంతో ప్రారంభించారు. ఇంకా 10-12 మీటర్లే తవ్వాల్సి ఉండడంతో వీరిని పంపడం మేలేనని యంత్రాంగం నిర్ణయించింది. 800 మి.మీ. వ్యాసం ఉన్న పైపులను నెమ్మదిగా సొరంగంలో ప్రవేశపెడతామని భారత సైన్యం విశ్రాంత ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ హర్‌పాల్‌ సింగ్‌ తెలిపారు. అవరోధాలు ఎదురుకాకపోతే 24-36 గంటల వ్యవధిలో 10 మీటర్ల వరకు ముందుకు వెళ్లగలమని అంచనావేశారు. 

కూలీలతో మాట్లాడిన ఉన్నతాధికారులు

ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్ర, హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా, ఉత్తరాఖండ్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌.సంధు సోమవారం సిల్‌క్యారాకు చేరుకున్నారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మిశ్రతో గబ్బర్‌సింగ్‌ అనే కూలీ మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా బయటకు తీసుకువచ్చేందుకు అనేక సంస్థలు రంగంలో దిగినందున కాస్త ఓర్పుతో ఉండాలని మిశ్ర సూచించారు. 

సొరంగ నిర్మాణ పనితో మాకు సంబంధం లేదు: అదానీ గ్రూపు

సొరంగం నిర్మాణ పనులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా తమకెలాంటి సంబంధం లేదని అదానీ గ్రూపు స్పష్టంచేసింది. నిర్మాణ కంపెనీలో తమకు, అనుబంధ సంస్థలకు ఎలాంటి వాటా లేదని అదానీ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు.


రంగంలోకి రోబోలు!

కార్మికుల మానసిక పరిస్థితిని పరిశీలించేందుకు స్వదేశీ రోబోలను సైతం రంగంలోకి దింపనున్నారు. ‘ఈ రోబోలు కార్మికుల ఆరోగ్య పర్యవేక్షణతో పాటు ఇంటర్నెట్‌ సేవల్ని అందిస్తాయి. సొరంగంలో మీథేన్‌లాంటి హానికర వాయువులు ఉన్నాయో లేదో తనిఖీ చేస్తాయి. లఖ్‌నవూలో భవనం కూలి 14 మంది చిక్కుకున్న ప్రమాదంలో వారందరినీ కాపాడాం. అదే వ్యవస్థను ఇప్పుడు వీలైనంత త్వరగా సిద్ధంచేసి పనులను ప్రారంభిస్తాం’ అని రోబోటిక్‌ నిపుణుడు మిలింద్‌ రాజ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని