నిషేధించిన పనే ఆదుకుంది

ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌.. ఉత్తర్‌కాశీ సొరంగ ప్రమాద ఉదంతంతో రెండ్రోజులుగా ప్రాచుర్యంలోకి వచ్చిన పని ఇది. ఇంతవరకు ఈశాన్య రాష్ట్రాలకు, ప్రధానంగా మేఘాలయకు పరిమితమైన ఈ ప్రక్రియే చార్‌ధామ్‌ రహదారి పనుల్లో భాగంగా చిక్కుకుపోయిన కూలీలను బయటకు తెచ్చేందుకు ఉపయోగపడింది.

Published : 29 Nov 2023 03:53 IST

దిల్లీ: ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌.. ఉత్తర్‌కాశీ సొరంగ ప్రమాద ఉదంతంతో రెండ్రోజులుగా ప్రాచుర్యంలోకి వచ్చిన పని ఇది. ఇంతవరకు ఈశాన్య రాష్ట్రాలకు, ప్రధానంగా మేఘాలయకు పరిమితమైన ఈ ప్రక్రియే చార్‌ధామ్‌ రహదారి పనుల్లో భాగంగా చిక్కుకుపోయిన కూలీలను బయటకు తెచ్చేందుకు ఉపయోగపడింది. 25 టన్నుల అధునాతమైన విదేశీ యంత్రాలు చివర్లో చేయలేని పనిని బొగ్గు తవ్వకపు కార్మికులు చేయగలగడం విశేషం. ‘ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌ అక్రమం కావచ్చు. కానీ మైనింగ్‌ చేసినవారి ప్రతిభ, నైపుణ్యం, అనుభవం బాగా ఉపయోగపడ్డాయి’ అని ఎన్డీఎంయే సభ్యుడు సయ్యద్‌ అటా హస్నైన్‌ వ్యాఖ్యానించారు. దిల్లీ, ఝాన్సీ తదితర ప్రాంతాల నుంచి 12 మందిని ఉత్తరాఖండ్‌కు పిలిపించి పనులు చేయించారు.

ఎలా తవ్వుతారంటే..

మేఘాలయలో బొగ్గును వెలికితీయడానికి ఎక్కువగా ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌పై ఆధారపడతారు. నాలుగు అడుగుల కంటే తక్కువ లోతున గోతులు తవ్వి, అక్కడ బొగ్గుపొరలు కనిపిస్తే దానిని బయటకు తెచ్చేందుకు పక్కన సన్నని మార్గాలను ఈ పని తెలిసిన కార్మికులు సిద్ధం చేస్తారు. ఒకరు తవ్వుతుంటే, మరొకరు దానిని అందుకుని పైకి తీసుకువచ్చి కుప్పగా పోస్తారు. తర్వాత జాతీయ రహదారుల మీదుగా తరలించుకువెళ్తారు. చిన్నచిన్న గోతుల్లోకి దిగి, చేతి పనిముట్లతో తవ్వుతూ పని పూర్తి చేయడంలో వీరు అనుభవజ్ఞులు. ఇది అశాస్త్రీయంగా ఉండడం, సురక్షితం కాకపోవడంతో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) 2014లోనే నిషేధం విధించింది. తక్కువ స్థాయిలో లభ్యమయ్యే బొగ్గును ఇతరత్రా మార్గాల్లో తవ్వి తీసుకురావడం ఆర్థికంగా లాభదాయకం కాకపోవడంతో అనధికారికంగా పని కొనసాగుతూ వస్తోంది. ఇరుకైన దారుల్లో వెళ్లడానికి పిల్లలైతే సరిపోతారని వారినే అక్రమంగా వాడుతున్నారు. సరైన ఉపాధి లేని అనేకమంది పేదలు ఈ ప్రమాదకరమైన పనినే ఎంచుకుంటున్నారు. కొంతమంది పిల్లలు తాము పెద్దవాళ్లమని తప్పుడు పత్రాలు సమర్పించి మరీ పనుల్లోకి వెళ్తుంటారు.


తవ్వకాల్లో ప్రాణనష్టం తక్కువేం కాదు

సురక్షితం కాని తవ్వకాల వల్ల మేఘాలయలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉదాహరణకు 2018లో అక్రమ తవ్వకపు ఘటనలో వరదనీటిలో 15 మంది చిక్కుకుపోయారు. రెండు నెలలు అన్వేషించినా వారిలో ఇద్దరి మృతదేహాలే దొరికాయి. ఆ తర్వాత 2021లో మరో అక్రమ గనిలో వరద నీరు చేరి అయిదుగురు చిక్కుకున్నారు. మూడు మృతదేహాలే దొరికాయి. నెల రోజుల అన్వేషణ తర్వాత సహాయక చర్యలు నిలిపివేశారు. ఉత్తరాఖండ్‌లో తాజాగా పనులు చేసినవారు కార్మికులు కాదని, ఈ రంగంలో నిపుణత ఉన్నవారని రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు