Uttarakhand Tunnel: మృత్యుంజయులు

అందరి ప్రార్థనలు ఫలించాయి. దృఢ సంకల్పంతో దీక్షగా చేపట్టిన సహాయక చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. నేడు, రేపు అంటూ 17 రోజులుగా సొరంగంలోనే గడిపిన 41 మంది ఎట్టకేలకు సురక్షితంగా బయటకు రాగలిగారు.

Updated : 29 Nov 2023 07:51 IST

17 రోజుల తర్వాత సొరంగం నుంచి సురక్షితంగా బయటకొచ్చిన 41 మంది కూలీలు
చివరి క్షణంలో అడ్డంకుల్ని తొలగించిన ర్యాట్‌ హోల్‌ మైనర్లు
ఉత్తరాఖండ్‌ సొరంగం కథ సుఖాంతం.. సర్వత్రా హర్షం

ఉత్తర్‌కాశీ: అందరి ప్రార్థనలు ఫలించాయి. దృఢ సంకల్పంతో దీక్షగా చేపట్టిన సహాయక చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. నేడు, రేపు అంటూ 17 రోజులుగా సొరంగంలోనే(Uttarakhand Tunnel) గడిపిన 41 మంది ఎట్టకేలకు సురక్షితంగా బయటకు రాగలిగారు. ఒక దశలో భారీ యంత్రాలు మొరాయించాయి, సాంకేతిక నిపుణుల వ్యూహాలు ఫలించలేదు. చివరికి రంగంలోకి దిగిన నిపుణులైన కూలీలు తమ చేతులతో, చిన్నపాటి పనిముట్లతో ఆ పనిని పూర్తిచేశారు. నానా తిప్పలు పెట్టిన చిట్టచివరి భాగాన్ని వారు నేర్పుగా తొలుచుకుంటూ వెళ్లడం, ఆ మేరకు వెడల్పైన పైపుగొట్టాలను ప్రవేశపెట్టి నిష్క్రమణ మార్గాన్ని సిద్ధం చేయడంతో మంగళవారం రాత్రి ఒక్కొక్కరుగా కూలీలంతా బయటి ప్రపంచంలోకి వచ్చారు. అలుపెరగకుండా తమ కోసం పనిచేసిన యంత్రాంగాన్ని, అధికారుల్ని, క్షేమ సమాచారం కోసం కళ్లుకాయలు కాసేలా నిరీక్షిస్తున్న కుటుంబసభ్యుల్ని చూసి వారు ఉద్వేగానికి లోనయ్యారు. ఘటనాస్థలంలో ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ, కేంద్ర మంత్రి వి.కె.సింగ్‌, ఇతర ఉన్నతాధికారులు తమకు పూలమాలలు వేసి, భుజం తట్టి క్షేమ సమాచారాన్ని ఆరా తీసినప్పుడు కొందరు కార్మికులు భావోద్వేగానికి గురయ్యారు. వారికి పాదాభివందనం చేసి చెమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఞత చాటుకున్నారు. సహాయకచర్యలు విజయవంతం కావడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు హర్షం వ్యక్తంచేశారు.

నిజంగా భగీరథ యత్నం

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సిల్‌క్యారా వద్ద సొరంగం తవ్వే పనిలో నిమగ్నమైన కార్మికుల్లో 41 మంది ఈ నెల 12న అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. యావద్దేశాన్ని కదిలించిన ఈ ఘటనలో ఆ కార్మికులను ఆదుకునేందుకు భారీ యంత్రాలతో, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు అవిశ్రాంతంగా పనిచేశాయి. సొరంగానికి ఒకపక్క పని పూర్తికాకపోవడం, రెండోవైపు నుంచి రావాలంటే దాదాపు 60 మీటర్ల పొడవునా శిథిలాలు అడ్డుగా ఉండడంతో ఎలా ముందడుగు వేయాలనేది యంత్రాంగానికి పెనుసవాల్‌గా మారింది. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, బీఆర్‌వో, సైన్యంలోని ఇంజినీరింగ్‌ విభాగం, జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ వంటివి అనేకం రంగంలో దిగి వేర్వేరు ప్రత్యామ్నాయాలను పరిశీలించాయి. భూమికి సమాంతరంగా సొరంగంలో గొట్టపుమార్గం వేయాలని నిర్ణయించి పనులు చేపట్టాక చివర్లో చిక్కుముడి ఎదురైంది. దాదాపు 12 మీటర్ల మేర ఇంకా తవ్వాల్సి ఉండగా 25 టన్నుల డ్రిల్లింగ్‌ యంత్రం విరిగి ముక్కలై ఆశలపై నీళ్లు జల్లింది. నానా తంటాలు పడి దానిని తొలగించినా పనులకు మళ్లీ అడ్డంకులు ఎదురై సహనాన్ని పరీక్షించాయి.

ఆ చేతులు సుసాధ్యం చేశాయి

సన్నని మార్గం ద్వారా బొగ్గును బయటకు తీసుకువచ్చే నైపుణ్యం ఉన్న కార్మికులు రంగంలో దిగాక పరిస్థితి ఒక్కసారిగా సానుకూలంగా మారింది. చిక్కుకుపోయిన కూలీలను బయటకు తెచ్చే గొట్టపు మార్గం నిర్మాణానికి అడ్డంగా ఉన్నవాటిని వారు విజయవంతంగా తొలగించగలిగారు. వీరు కొన్ని చిన్నచిన్న పనిముట్ల సాయంతో సోమవారం నుంచి తవ్వకం ప్రారంభించిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రానికి ఒక దశలో మరో రెండుమీటర్ల పని మాత్రమే మిగిలి ఉండడంతో అటు సహాయక బృందాల్లో, ఇటు కూలీల కుటుంబికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ముందస్తు సంబరాలు మొదలయ్యాయి. కాసేపట్లోనే.. అటు నుంచి తవ్వుతున్న శబ్దం తమకు వినిపించడంతో లోపలున్న కూలీలు తమ చెవుల్ని తామే నమ్మలేకపోయారు. లోపలకు వచ్చిన కార్మికులను చూసి వారు సంబరపడి తమ వద్దనున్న ఎండుఫలాలు అందించి ఆనందం పంచుకున్నారు. మరికాసేపట్లోనే గొట్టపు మార్గం సిద్ధం కావడం, దాని నుంచి ఒక్కొక్కరు పాకుతూ బయటకు రావడం సజావుగా సాగిపోయింది. సొరంగం వద్ద ఒకరినొకరు అభినందించుకున్నారు. కూలీలను వెంటనే వైద్య చికిత్సకు తరలించారు. రోజుల తరబడి సొరంగంలోనే ఉన్న కూలీల ఆరోగ్య పరిస్థితిని 2-3 రోజులపాటు క్షుణ్నంగా పరిశీలించి, వారు అన్నివిధాలా బాగున్నారని తేలిన తర్వాతే స్వస్థలాలకు పంపించనున్నారు. ఎవరి పరిస్థితీ ప్రమాదకరంగా లేదని సీఎం ధామీ ధ్రువీకరించారు. అందరిలో అత్యంత చిన్న వయసు వ్యక్తిని మొదటగా బయటకు తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూలీలతో ఫోన్లో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్నారు.


మాన్యువల్‌గానే శీఘ్ర పురోగతి

చిన్నచిన్న పరికరాల సాయంతో కార్మికులతో తవ్వించే పనులు (మాన్యువల్‌ డ్రిల్లింగ్‌) మొదలయ్యాక శీఘ్ర పురోగతి కనిపించింది. క్రిస్మస్‌ వరకు వీరు బయటకు రాలేకపోవచ్చని అంతర్జాతీయ నిపుణుడు ఒక దశలో చెప్పడంతో అలముకున్న నైరాశ్యం ఒక్కసారిగా వీడిపోయింది. కూలీలు 24 గంటల్లోపే 10 మీటర్లు తవ్వడం విశేషం. మిగిలిన రెండు మీటర్ల పనిని ఆ తర్వాత మరింత జాగ్రత్తలు తీసుకుని రాత్రి 7 గంటలకు పూర్తిచేశారు. మొదట బయటకు వచ్చిన కూలీని తీసుకుని అంబులెన్సు బయల్దేరే సరికి రాత్రి ఎనిమిదైంది. అంబులెన్సులు వెళ్లేందుకు వీలుగా అప్పటికే మార్గం సిద్ధంచేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని వాయుమార్గంలో తరలించేందుకు చినూక్‌ హెలికాప్టర్లను అందుబాటులో ఉంచారు. కొండను పైనుంచి డ్రిల్లింగ్‌ చేసే పనుల్ని నిలిపివేశారు.


క్షేమంగా ఉన్నా చివరి వరకు ఆందోళన

చిక్కుకుపోయిన చోట సొరంగంలో తిరుగాడడానికి రెండు కి.మీ. మేర ప్రాంతం ఉండడం, బయటి నుంచి తాగునీరు, ఆహారం, ఔషధాలు వంటివన్నీ అందుకునే వెసులుబాటును కల్పించడంతో కూలీలు క్షేమంగానే ఉన్నా, పూర్తిగా బయటపడేవరకు ఆందోళనతో కుటుంబ సభ్యులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. అందుకే కూలీలు బయటకు వస్తున్నప్పుడు అక్కడంతా ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకుంటూ, ‘హరహర మహాదేవ్‌’.. ‘భారత్‌ మాతాకీ జై’ అని నినాదాలు చేశారు. ప్రధాని మోదీ వల్లనే ఈ విజయం సాధ్యమైందని మరికొందరు నినదించారు. సొరంగం బయట ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడి వద్ద స్థానికులు పూజలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని