నేవీకి మరో స్వదేశీ విమానవాహక నౌక!

హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళానికి సరికొత్త బలం లభించబోతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రెండో విమానవాహక నౌకను నిర్మించాలన్న నేవీ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించబోతోంది.

Published : 29 Nov 2023 03:59 IST

దిల్లీ: హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళానికి సరికొత్త బలం లభించబోతోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రెండో విమానవాహక నౌకను నిర్మించాలన్న నేవీ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించబోతోంది. దాదాపు రూ.40వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు రక్షణ కొనుగోళ్ల బోర్డు (డీపీబీ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనడానికి ఇది నిదర్శనమని వివరించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో గురువారం జరిగే రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) సమావేశంలో ఈ అంశం పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీనికితోడు రూ.1.15 లక్షల కోట్లతో 97 తేజస్‌ మార్క్‌-1ఏ యుద్ధవిమానాల కొనుగోలు కోసం భారత వైమానిక దళం తెచ్చిన ప్రతిపాదనపైనా డీఏసీలో చర్చ జరిగే వీలుందని తెలిపాయి. 

ప్రతిపాదిత రెండో స్వదేశీ విమానవాహక నౌక (ఐఏసీ-2) బరువు 45వేల టన్నులు ఉండొచ్చు. దీన్ని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ నిర్మించనుంది. అది కూడా విక్రాంత్‌ తరహాలోనే ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 97 తేజస్‌ మార్క్‌-1ఏ యుద్ధవిమానాల కొనుగోలుకు ఆమోదం లభిస్తే భారత వాయుసేన అమ్ములపొదిలో ఈ జెట్‌ల సంఖ్య 180కి పెరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని