ఆంగ్ల భాష, అధిక ఫీజులే సమ న్యాయానికి అడ్డంకి

అత్యున్నత న్యాయ వ్యవస్థలో అధిక ఫీజులు, ఆంగ్ల భాషే సమ న్యాయానికి అడ్డంకిగా నిలుస్తున్నాయని, వాటిని అధిగమించాల్సి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు.

Updated : 29 Nov 2023 06:39 IST

ఈ సమస్యలను అధిగమించాలి
రాష్ట్రపతి ముర్ము పిలుపు
ముగిసిన దక్షిణార్ధ గోళ ప్రాంతీయ న్యాయ సదస్సు

దిల్లీ: అత్యున్నత న్యాయ వ్యవస్థలో అధిక ఫీజులు, ఆంగ్ల భాషే సమ న్యాయానికి అడ్డంకిగా నిలుస్తున్నాయని, వాటిని అధిగమించాల్సి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు, సామాజికంగా అట్టడుగున ఉన్నవారికి ప్రత్యేకంగా చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని, వారు తమ హక్కులను తెలుసుకుని, న్యాయ సహాయం పొందేలా సహకరించాలని సూచించారు. సమ న్యాయం అనేది న్యాయ వ్యవస్థకు పునాదే కాదని, అది ప్రజలకు ఆవశ్యకమైన వ్యవహారమని పేర్కొన్నారు. ‘న్యాయ సహాయ హక్కు’పై సత్వర చర్యలకు పలు దేశాలు అంగీకరించాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తెలిపారు. అరెస్టుకు ముందూ ఈ సహాయం పొందే హక్కుకు సమ్మతి తెలిపాయని వివరించారు. ‘అట్టడుగున ఉన్న వారికి నాణ్యమైన న్యాయ సహాయానికి హామీ.. దక్షిణార్ధ గోళంలోని సవాళ్లు, అవకాశాలు’ అన్న అంశంపై దిల్లీలో జరిగిన తొలి ప్రాంతీయ సదస్సు ముగింపు సమావేశంలో వారు ప్రసంగించారు. ‘అందరూ సమానమేనని ఈ ప్రపంచం ఎంతో కాలంగా చెబుతూ వస్తోంది. కానీ సమ న్యాయం అమలవుతోందా.. అన్న విషయంలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వాస్తవానికి పలు కారణాలవల్ల కొంత మంది ప్రజలు తమ సమస్యలకు పరిష్కారాలను పొందలేకపోతున్నారు. ఇందులో ప్రధాన అడ్డంకి న్యాయ వ్యవస్థలో అధిక ఫీజుల భారమే. అందరికీ న్యాయం అందాలన్నది నా మనసుకు దగ్గరగా ఉండే అంశం. ఆర్థికంగా అట్టడుగున్న ఉన్న వారి కోసం న్యాయ సంస్థలు దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ఇటువంటి సాయంలో జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చర్యలన్నింటి లక్ష్యం సులభంగా న్యాయం అందడమే. ప్రజలు తమ హక్కులను తెలుసుకునేలా గ్రామీణ ప్రాంతాల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

ప్రజలనూ చైతన్య పరచాలి: సీజేఐ

విద్యార్థులనూ కాకుండా సాధారణ ప్రజలనూ న్యాయమూర్తులు చైతన్య పరచాలని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సూచించారు. ‘సదస్సులో చర్చల అనంతరం దక్షిణార్ధ గోళంలోని ప్రజలందరికీ సమ న్యాయం అందించే హామీకి కట్టుబడి ఉండాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా న్యాయ ప్రాతినిధ్యం, న్యాయ సహాయం, అందుబాటులో ఫీజుల వ్యవస్థ, న్యాయ విద్య, చైతన్యంపై గట్టిగా కృషి చేయనున్నాం. సమ న్యాయంలో న్యాయమూర్తులదే కీలక పాత్ర అనే నిర్ణయానికి వచ్చాం’ అని తెలిపారు.  ఈ సదస్సులో 69 ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్‌ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని