ఆ మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించండి

మణిపుర్‌లోని మార్చురీలలో భద్రపరిచి ఉన్న మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన తొమ్మిది స్థలాల్లో ఎక్కడైనా సరే మృతుల ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఆ క్రతువును నిర్వహించాలని మంగళవారం స్పష్టం చేసింది.

Published : 29 Nov 2023 06:14 IST

మణిపుర్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

దిల్లీ: మణిపుర్‌లోని మార్చురీలలో భద్రపరిచి ఉన్న మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన తొమ్మిది స్థలాల్లో ఎక్కడైనా సరే మృతుల ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఆ క్రతువును నిర్వహించాలని మంగళవారం స్పష్టం చేసింది. మార్చురీలలో మృతదేహాలను నిరవధికంగా ఉంచడాన్ని అనుమతించలేమని పేర్కొంది. జాతుల మధ్య ఘర్షణల నేపథ్యంలో వివిధ మార్చురీలలో ఉన్న 175 మృతదేహాల్లో 94కు సంబంధించి వారి బంధుమిత్రులెవరూ రాలేదని, 81 మృతదేహాలను తమకు అప్పగించాలంటూ మృతుల సమీప బంధువులు వచ్చారని హైకోర్టు మాజీ జడ్జీలతో కూడిన కమిటీ నివేదిక సమర్పించింది. దీనిని పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం తాజా ఆదేశాలిచ్చింది. గుర్తించిన మృతదేహాలను బంధువులకు అప్పగించి ఎలాంటి ఆటంకం కలగకుండా అంత్యక్రియలు జరిగేలా చూడాలని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. మిగిలిన మృతదేహాల కోసం బంధుమిత్రులెవరూ ముందుకు రాని పక్షంలో వారం రోజుల గడువునిచ్చి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే గౌరవప్రదంగా అంత్యక్రియలు చేపట్టాలని తెలిపింది. డిసెంబరు 4వ తేదీ కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేసి తమకు నివేదించాలని స్పష్టం చేసింది.

బోధనా ప్రణాళికలో సీపీఆర్‌ను చేర్చాలన్న పిటిషన్‌ తిరస్కరణ

గుండెపోటుకు గురైన వ్యక్తి గుండె తిరిగి కొట్టుకునేలా చేసేందుకు నిర్వహించే సీపీఆర్‌ ప్రక్రియపై విద్యార్థులకు శిక్షణనివ్వడం కోసం దానిని పాఠశాల బోధనా ప్రణాళికలో చేర్చేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇది పూర్తిగా విద్యా విధానానికి సంబంధించినదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. చిన్నారులు ఏ అంశాలు నేర్చుకోవాలనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయని, బోధనా ప్రణాళిక ఎలా ఉండాలో ప్రభుత్వానికి న్యాయస్థానం నిర్దేశించలేదని పేర్కొంది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర సభ్యులుగా ఉన్నారు.

ప్రభుత్వ విజయాలను ప్రజలకు తెలియజేయాలంటూ అధికారులకు కేంద్ర సర్కారుకు చెందిన రెండు విభాగాలు జారీ చేసిన ఆఫీస్‌ మెమోరాండంను సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపేందుకు తిరస్కరించింది. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు అధికార పార్టీ ప్రభుత్వ సిబ్బందిని వినియోగించుకుంటోందని ఆరోపిస్తూ ఈఏఎస్‌ శర్మ, జగదీప్‌ ఎస్‌ చోకర్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.


సంకుచిత మనస్తత్వం తగదు

పాకిస్థాన్‌ నటీ నటులను నిషేధించాలన్న పిటిషన్‌పై సుప్రీం వ్యాఖ్యలు

భారతీయ సినిమాల్లో పాకిస్థాన్‌ నటీనటులు, ఇతర సాంకేతిక సిబ్బంది పనిచేయకుండా పూర్తిగా నిషేధం విధించాలన్న పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో బాంబే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. పాక్‌ నటీనటులు, సంగీత దర్శకులు, గీత రచయితలు, సాంకేతిక సిబ్బంది భారతీయ సినిమాలకు పనిచేయకుండా నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ముంబయికి చెందిన ఫైజ్‌ అన్వర్‌ ఖురేషి గతంలో బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు.. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తీర్పు వెలువరించింది. దీనిని సవాలు చేస్తూ ఆ పిటిషనర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్‌లతో కూడిన ధర్మాసనం బాంబే హైకోర్టు తీర్పును సమర్థించింది. సంకుచిత మనస్తత్వం తగదని పేర్కొంటూ అన్వర్‌ ఖురేషి పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు