81.35 కోట్ల మందికి అయిదేళ్లపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు

వ్యవసాయానికి మహిళా సంఘాల ద్వారా డ్రోన్ల సాయం.. ప్రధాన మంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ ద్వారా గిరిజనుల అభివృద్ధి.. 81.35 కోట్ల మందికి ఐదేళ్లపాటు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ.. వంటి కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

Published : 30 Nov 2023 05:22 IST

సాగుకు డ్రోన్ల సాయం
మహిళా సంఘాలకు రూ.1,261 కోట్ల వ్యయంతో పరికరాల పంపిణీ
 గిరిజనుల అభివృద్ధికి రూ.24,104 కోట్లతో పథకం
కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు

ఈనాడు, దిల్లీ: వ్యవసాయానికి మహిళా సంఘాల ద్వారా డ్రోన్ల సాయం.. ప్రధాన మంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ ద్వారా గిరిజనుల అభివృద్ధి.. 81.35 కోట్ల మందికి ఐదేళ్లపాటు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ.. వంటి కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. మంగళవారం రాత్రి దిల్లీలో జరిగిన కేబినెట్‌ భేటీ నిర్ణయాలను బుధవారం కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ మీడియాకు వెల్లడించారు.

  • వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించి రెండేళ్లపాటు అమలయ్యేలా రూ.1,261 కోట్లతో మహిళా సంఘాలకు 15,000 డ్రోన్లను కేంద్రం అందజేయనుంది. వాటిని వ్యవసాయంలో వినియోగించుకునేందుకు వీలుగా రైతులకు అద్దెకు ఇస్తారు. ఆర్థిక పరంగా రైతులు భరించగలిగే ప్రాంతాల్లోని క్రియాశీల మహిళా సంఘాలకు వాటిని అందజేస్తారు. ఇందులో 80% అంటే రూ.8లక్షలను కేంద్రం ఇస్తుంది. మిగిలిన 20%మహిళా సంఘాలు భరించాల్సి ఉంటుంది. దీనినీ 3శాతం వడ్డీకి రుణంగా జాతీయ వ్యవసాయ మౌలిక వసతుల ఆర్థిక సంస్థ ద్వారా అందిస్తారు. డ్రోన్ల వినియోగానికి వెయ్యి హెక్టార్ల వ్యవసాయ భూమి అందుబాటులో ఉండే 10, 15 గ్రామాలను ఒక క్లస్టర్‌గా రూపొందిస్తారు. డ్రోన్లు నడిపేందుకు 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలను డ్రోన్‌ పైలట్లుగా నియమిస్తారు. వెయ్యి హెక్టార్లలో డ్రోన్‌ ద్వారా ఎరువులు, పురుగు మందుల పిచికారీవల్ల ఏటా రూ.9.60 లక్షల ఆదాయం వస్తుంది. మహిళా డ్రోన్‌ పైలట్‌కు ప్రతి నెలా రూ.15వేలు, సహాయకురాలికి రూ.10వేల వేతనం అందిస్తారు. డ్రోన్‌ నిర్వహణ, మరమ్మతుకోసం మరో మహిళకు శిక్షణనిచ్చి ప్రతినెలా రూ.5వేల వేతనం చెల్లిస్తారు.
  • ఆదివాసీల కోసం రూ.24,104 కోట్లతో ప్రధాన మంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ పథకానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఇందులో కేంద్ర వాటా రూ.15,336 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.8,768 కోట్లు. ఈ పథకం కింద 18 రాష్ట్రాల్లోని అత్యంత వెనుకబడిన గిరిజన గ్రూపులుగా గుర్తించిన 75 తెగలకు చెందిన 18.16 లక్షల మందికి ఇళ్లు, రోడ్లు, కొళాయి నీరు, మొబైల్‌ మెడికల్‌ యూనిట్లు, వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి, అంగన్‌వాడీ కేంద్రాలు, బహుళ ఉపయోగ కేంద్రాలు, సోలార్‌ పవర్‌ గ్రిడ్‌, సోలార్‌ వీధి దీపాలు, మొబైల్‌ టవర్లు ఏర్పాటు చేస్తారు. ఈ గిరిజన వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు 9 కేంద్ర ప్రభుత్వశాఖల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తారు.
  • ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద పేదలకు ఉచితంగా అందిస్తున్న ఆహార ధాన్యాల పథకాన్ని మరో అయిదేళ్లు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2024 జనవరి నుంచి అయిదేళ్లపాటు ఈ పథకం కొనసాగుతుంది. ప్రతి నెలా 81.35 కోట్ల మందికి 5 కేజీల ఉచిత ఆహార ధాన్యాలను అందిస్తారు. అంత్యోదయ కుటుంబాలకు 35 కేజీలు అందిస్తారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.11.80 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది.  
  • లైంగిక వేధింపుల కేసులను విచారించే ఫాస్ట్‌ట్రాక్‌ ప్రత్యేక కోర్టులను మరో మూడేళ్లపాటు కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2018లో 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 1,023 కోర్టులను కేంద్రం కేటాయించింది. వాటిలో 761 కోర్టులు 2019 నుంచి పని చేస్తున్నాయి. వీటిని మరో మూడేళ్లపాటు పొడిగిస్తూ మిగిలిన కోర్టులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలకు నిధులను అందజేయనుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని