రాష్ట్రపతికి బిల్లులను ఎప్పుడు పంపించాలి?

శాసనసభ ఆమోదించిన బిల్లులను రెండేళ్ల పాటు కేరళ గవర్నర్‌ తన వద్దే నిలిపి ఉంచడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి సమ్మతి కోసం గవర్నర్లు ఎప్పుడు బిల్లులను పంపించాలనే అంశంపై మార్గదర్శకాలను రూపొందించే విషయాన్ని పరిశీలించనున్నట్లు బుధవారం తెలిపింది.

Published : 30 Nov 2023 04:40 IST

గవర్నర్లకు మార్గదర్శకాల జారీ విషయాన్ని పరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు
  కేరళ గవర్నర్‌ తీరుపై అసంతృప్తి

దిల్లీ: శాసనసభ ఆమోదించిన బిల్లులను రెండేళ్ల పాటు కేరళ గవర్నర్‌ తన వద్దే నిలిపి ఉంచడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి సమ్మతి కోసం గవర్నర్లు ఎప్పుడు బిల్లులను పంపించాలనే అంశంపై మార్గదర్శకాలను రూపొందించే విషయాన్ని పరిశీలించనున్నట్లు బుధవారం తెలిపింది. అంతకుముందు...అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి... మొత్తం 8 బిల్లులకు గాను ఏడింటిని రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వులో ఉంచారని, మరో బిల్లుకు గవర్నర్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆమోదం తెలిపారని వివరించారు. ఈ విషయాన్ని నోట్‌ చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం...‘బిల్లుల విషయమై గత రెండేళ్లుగా గవర్నర్‌ ఏమి చేస్తున్నార’ని ప్రశ్నించింది. దీనికి అటార్నీ జనరల్‌ బదులిస్తూ...అనేక సందేహాలను లేవనెత్తే ఆ వివరాల్లోకి వెళ్లదలచుకోలేదన్నారు. ప్రజలకు, రాజ్యాంగానికి జవాబుదారీ అయిన తమకు ఆ వివరాలు అవసరమేనని జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర సభ్యులుగా ఉన్న ధర్మాసనం స్పష్టం చేసింది. కేరళ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది కె.కె.వేణుగోపాల్‌ జోక్యం చేసుకుంటూ....రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లులను ఎప్పుడు పంపించాలనే అంశంలోనూ మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. దీంతో విచారణను ముగిద్దామనుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం వివాదంపై విచారణను పెండింగ్‌లో ఉంచుతున్నట్లు వెల్లడించింది. ఇదో సజీవ సమస్య అని పేర్కొంది. కేరళ ప్రభుత్వ పిటిషన్‌లో మార్పులు చేసేందుకు అనుమతించింది. బిల్లుపై సందేహాలు ఉంటే ముఖ్యమంత్రి, మంత్రితో గవర్నర్‌ చర్చిస్తారని భావిస్తూ ఆ విషయాన్ని నోట్‌ చేసుకుంటున్నామని ధర్మాసనం పేర్కొంది. రాజకీయ వివేకంతో నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలిపింది. అలా జరగని పక్షంలో రాజ్యాంగం అప్పగించిన విధులను నిర్వర్తించడానికి, చట్టబద్ధమైన విధానాల ఖరారుకు తాము సిద్ధంగా ఉంటామని విస్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని