విద్వేష ప్రసంగాలపై చర్యలకు ప్రత్యేక పాలనా యంత్రాంగం

దేశవ్యాప్తంగా విద్వేష ప్రసంగాల కట్టడికి పాలనా యంత్రాంగాన్ని నెలకొల్పే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం వెల్లడించింది.

Published : 30 Nov 2023 04:43 IST

దేశవ్యాప్తంగా ఏర్పాటుపై పరిశీలిస్తున్నాం: సుప్రీంకోర్టు

 దిల్లీ: దేశవ్యాప్తంగా విద్వేష ప్రసంగాల కట్టడికి పాలనా యంత్రాంగాన్ని నెలకొల్పే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం వెల్లడించింది. విడివిడిగా కేసులను చేపడుతూ వెళ్తే అవి వరదలా పోటెత్తే అవకాశం ఉందని, వాటన్నింటిపైనా విచారణ జరపలేమని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. విద్వేష ప్రసంగాల నిర్వచనాన్ని కోర్టు వివరించిందని, దానిని అర్థం చేసుకుని వర్తింపజేయడం, అమలు చేయటమనేదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న అని పేర్కొంది. ‘విడివిడిగా ఒక్కో కేసును స్వీకరిస్తూ ఉంటే అవి పోటెత్తే అవకాశం ఉన్నందున విద్వేష ప్రసంగాల కట్టడికి  ప్రత్యేక పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయదలిచాం. అక్కడ ఏదైనా విఘాతం కలిగితే హైకోర్టును ఆశ్రయించవచ్చు’ అని ధర్మాసనం వివరించింది. విద్వేష ప్రసంగం చేస్తే ప్రభుత్వం చర్య తీసుకుంటుందనే దృఢమైన విశ్వాసం సమాజానికి కలగాలని అభిప్రాయపడింది. నోడల్‌ అధికారులను నియమించకపోవడంపై తమిళనాడు, కేరళ, నాగాలాండ్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై ఫిర్యాదులు వచ్చే వరకూ ఆగకుండా తక్షణమే కేసులు నమోదు చేయాలని గత ఏడాది అక్టోబరు 21న ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని