భారత్‌లో అసాధారణ వాతావరణం

భారత్‌లో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో సుమారు ప్రతిరోజు అసాధారణ వాతావరణ పరిణామాలు చోటుచేసుకున్నాయని బుధవారం తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. 

Published : 30 Nov 2023 05:09 IST

గత తొమ్మిది నెలల్లో రోజూ ఇదే పరిస్థితి
సీఎస్‌ఈ నివేదిక వెల్లడి

దిల్లీ: భారత్‌లో ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో సుమారు ప్రతిరోజు అసాధారణ వాతావరణ పరిణామాలు చోటుచేసుకున్నాయని బుధవారం తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది. ఆ కారణంగా వేలాది మరణాలు సంభవించాయని విశ్లేషించింది. ఈ మేరకు ఓ నివేదికను సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) విడుదల చేసింది. ‘‘జనవరి నుంచి సెప్టెంబరు వరకూ పరిశీలిస్తే 86 శాతం రోజుల్లో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 2,923 మంది మృత్యువాత పడగా 20 లక్షల హెక్టార్లలోని పంట తుడిచిపెట్టుకుపోయింది. 80 వేల గృహాలు ధ్వంసమయ్యాయి. 92 వేల జంతువులు మరణించాయి. వాస్తవంలో ఈ గణాంకాలు ఇంకా ఎక్కువగా కూడా ఉండి ఉండవచ్చు. ఎందుకంటే మొత్తం సమాచారాన్ని ఇంకా సమీకరించకపోవడమే కారణం’’అని నివేదిక వివరించింది.

 122 ఏళ్లలో లేనంతగా ఫిబ్రవరిలో ఉష్ణోగ్రత

2023 భారతదేశం పాలిట అత్యంత ప్రతికూల వాతావరణ సంవత్సరమని సీఎస్‌ఈ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 122 ఏళ్లలో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 138 రోజులపాటు ప్రకృతి ప్రకోపాలు సంభవించగా, అత్యధిక మరణాలు బిహార్‌ (642), హిమాచల్‌ప్రదేశ్‌ (365), ఉత్తర్‌ ప్రదేశ్‌ (341)లలో నమోదయ్యాయి.

తెలంగాణలో 62 వేల హెక్టార్లలో పంట నష్టం

వాతావరణ వైపరీత్యాల వల్ల అత్యధిక పశు మరణాలు పంజాబ్‌లోనూ, అత్యధిక ఇళ్లు దెబ్బతినడం హిమాచల్‌ప్రదేశ్‌లోనూ సంభవించాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 113 రోజుల్లో వాతావరణ వైపరీత్యాలు నమోదయ్యాయి. తూర్పు భారతంలో అస్సాం అత్యధికంగా 102 రోజులపాటు ప్రకృతి ప్రకోపాలను చవిచూసింది. దక్షిణ భారతంలో అత్యధికంగా 67 వాతావరణ వైపరీత్య ఘటనలు, 60 మరణాలు కేరళలో నమోదయ్యాయి. తెలంగాణలో అత్యధిక పంట నష్టం (62,000 హెక్టార్లు) సంభవించింది. 645 పశువులు మరణించాయి. కర్ణాటకలో 11,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని