కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) నియామకం విషయంలో కేంద్రంతో నెలకొన్న వివాదంలో దిల్లీలోని కేజ్రీవాల్‌ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది.

Published : 30 Nov 2023 06:30 IST

 సీఎస్‌ పదవీ కాలం పొడిగింపునకు సుప్రీం సమర్థన

దిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) నియామకం విషయంలో కేంద్రంతో నెలకొన్న వివాదంలో దిల్లీలోని కేజ్రీవాల్‌ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. దిల్లీ ప్రస్తుత సీఎస్‌ నరేశ్‌ కుమార్‌ పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కేంద్రం నిర్ణయాన్ని చట్టపరమైన ఉల్లంఘనగా చూడలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సీఎస్‌ నరేశ్‌ కుమార్‌ ఈ నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన స్థానంలో కొత్త సీఎస్‌ను నియమించే విషయమై కేంద్రం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) తమను సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కేజ్రీవాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నరేశ్‌ కుమార్‌ పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని తాము నిర్ణయించినట్లు కేంద్రం తెలియజేయగా ఆ అధికారం ఎలా సంక్రమించింది, అందుకు గల కారణాలు తెలిపాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో కేంద్రం బుధవారం తన వివరణను సమర్పించింది. దిల్లీ సీఎస్‌ నియామకం, పదవీ కాలం పొడిగింపు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తోందని తెలిపింది. దిల్లీలో పరిపాలన సేవలపై నియంత్రణను ఎల్జీకి అప్పగిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం పరిధిలో ఈ అంశం లేదని వివరించింది. ఈ చట్టాన్ని ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా దీనిపై విచారణ పెండింగ్‌లో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు