Gated community: గేటెడ్‌ కమ్యూనిటీ రోడ్లపై ఎవరైనా వెళ్లవచ్చు!

గేటెడ్‌ కమ్యూనిటీల్లోని రహదారులపై బయటి వారు కూడా రాకపోకలు సాగించవచ్చని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Updated : 01 Dec 2023 08:31 IST

స్పష్టం చేసిన కర్ణాటక హైకోర్టు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: గేటెడ్‌ కమ్యూనిటీల్లోని(Gated community) రహదారులపై బయటి వారు కూడా రాకపోకలు సాగించవచ్చని కర్ణాటక ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బెంగళూరు ఆనుకొని ఉండే బెళ్లందూరులోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర టవర్స్‌ గేటెడ్‌ కమ్యూనిటీలోని రహదారుల మీదుగా.. పక్కనే ఉండే తమ ఇళ్లలోకి వెళ్లేందుకు అనుమతించాలని ఉపకార్‌ రెసిడెన్సీస్‌కి చెందినవారు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ఏకసభ్య ధర్మాసనం.. సముదాయంలోని రోడ్లు, ఇతర సదుపాయాలకు స్థానిక సంస్థలు ఆమోదం తెలిపిన అనంతరం అక్కడి నివాసాల యజమానులు, లేఅవుట్ను అభివృద్ధి చేసిన వారికి వాటిపై ఎటువంటి హక్కు ఉండదని గతేడాది నవంబరు 29న తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర టవర్స్‌ గేటెడ్‌ కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తి హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ ప్రసన్న బాలచంద్ర వరాళె, జస్టిస్‌ కృష్ణ ఎస్‌ దీక్షిత్‌ల పీఠం.. గతంలో ఏకసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పును సమర్థించింది. ఒకసారి స్థానిక సంస్థల నుంచి అనుమతులు లభించిన తర్వాత గేటెడ్‌ కమ్యూనిటీల్లోని రహదారులు, ఇతర సదుపాయాలు కేవలం అక్కడ నివసిస్తున్న వారికి మాత్రమే పరిమితమై ఉండవని  గురువారం మరోసారి స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని