సంపూర్ణ సురక్షితంగా పాక్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దులు

పాక్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దులను రానున్న రెండేళ్లలో చొరబాట్లకు వీల్లేని విధంగా పటిష్ఠంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు.

Published : 02 Dec 2023 03:47 IST

రెండేళ్లలో ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో కంచె నిర్మాణం
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా

హజారీబాగ్‌: పాక్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దులను రానున్న రెండేళ్లలో చొరబాట్లకు వీల్లేని విధంగా పటిష్ఠంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఈ సరిహద్దుల్లో ఖాళీగా ఉన్న 60 కిలోమీటర్ల మేర కంచెను నిర్మిస్తామని వెల్లడించారు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) 59వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం  ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్‌ షా ప్రసంగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో భారత్‌-పాక్‌, భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో 560 కిలోమీటర్ల మేర ఖాళీ ప్రాంతాల్లో కంచె నిర్మించిందని చెప్పారు. మిగిలిపోయిన 60 కిలోమీటర్ల మేర ఖాళీల్లో వచ్చే రెండేళ్లలో కంచె నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. ‘‘సరిహద్దులు సురక్షితంగా లేకపోతే ఏ దేశం కూడా అభివృద్ధి చెందదు. అదే సమయంలో కేవలం కంచెలు మాత్రమే దేశాన్ని రక్షించలేవు. మన వీర బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఆ పని చేస్తున్నారు’’ అని చెప్పారు. ‘‘సరిహద్దుల్లో వాణిజ్యంతోపాటు రైలు, రోడ్డు, జలమార్గాలు, టెలిఫోన్‌ కమ్యూనికేషన్‌ అనుసంధానతను బలోపేతం చేశాం. 452 కొత్త సరిహద్దు పోస్టులను, 510 పర్యవేక్షణ టవర్లను ఏర్పాటు చేశాం. 637 సరిహద్దు పోస్టులకు విద్యుత్తు సౌకర్యం, 500 పోస్టులకు నీటి సదుపాయం కల్పించాం’’ అని వెల్లడించారు.

నక్సలిజం నిర్మూలన దశకు చేరాం

మావోయిస్టుల సాయుధ, హింసాత్మక ఉద్యమం నిర్మూలన దశకు దేశం చేరువలో ఉందని అమిత్‌ షా తెలిపారు. గత పదేళ్లలో నక్సల్స్‌ హింసాత్మక ఘటనలు 52 శాతం తగ్గాయని చెప్పారు. మావోయిస్టుల దాడుల కారణంగా సంభవించే మరణాల సంఖ్య 70 శాతం, వామపక్ష ప్రభావిత జిల్లాల సంఖ్య 96 నుంచి 45కు, పోలీస్‌స్టేషన్ల సంఖ్య 495 నుంచి 175కు తగ్గిందన్నారు. 2019 నుంచి వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలకు సంబంధించిన 199 కొత్త శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అమిత్‌ షా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని