అటవీ భూముల లీజుకు కొత్త నిబంధనలు

అటవీభూముల లీజుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అటవీ భూములను లీజుకు ఇచ్చేటప్పుడు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేసింది.

Updated : 02 Dec 2023 05:34 IST

ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందే

ఈనాడు, దిల్లీ: అటవీభూముల లీజుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీచేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అటవీ భూములను లీజుకు ఇచ్చేటప్పుడు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేసింది. వీటి ప్రకారం.. అటవీ భూములను ఉపయోగించుకోవాలనుకున్న సంస్థలు.. లీజుకోసం ‘పరివేష్‌ పోర్టల్‌’ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా ఏ అటవీభూమినీ లీజుకు ఇవ్వడానికి వీల్లేదు. ఒకవేళ మైనింగ్‌ లీజు మీద అటవీభూమిని అప్పగిస్తే సంబంధిత ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల తవ్వకాలు చేపట్టకూడదు.

మైనింగ్‌యేతర కార్యకలాపాల కోసం లీజుకు ఇచ్చినప్పుడు మాత్రం మొక్కలు నాటడం, తాత్కాలిక నిర్మాణాల కోసం పరిమిత స్థాయిలో తవ్వకాలకు అనుమతిస్తారు. నిబంధనల ప్రకారం అటవీ భూమి మళ్లింపు కింద అనుమతులు తీసుకున్నాకే అక్కడ మైనింగ్‌ చేపట్టాలి. అలాగే సంబంధిత అథీకృత సంస్థలు ఆమోదించిన మైనింగ్‌ ప్రణాళికను సమర్పించాలి. అక్కడ గనుల తవ్వకాలు చేపట్టడానికి ముందు, చేపట్టిన తర్వాత ఎంతమేరకు భూమి ఉపయోగించేదీ చెప్పాలి. గని మూసివేత ప్రణాళికనూ సమర్పించాలి. మైనింగ్‌ కార్యకలాపాలు కాకుండా మిగతా ఏయే కార్యకలాపాలు చేపట్టబోయేదీ వివరిస్తూ డీపీఆర్‌ ఇవ్వాలి.

  • ఈ చట్టంలోని నిబంధనల కింద అటవీభూముల లీజుకు ఆమోదముద్ర వేసినా అనుమతులు పొందిన సంస్థకు ఆ భూమిపై ఎలాంటి హక్కులూ ఉండవు.
  • కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా 2015 ఏప్రిల్‌ 1కి ముందే అటవీ భూముల్లో మైనింగ్‌ కార్యకలాపాలు చేపట్టిన సంస్థలు వెంటనే అనుమతులు తీసుకోవాలి. ఆ గని పరిధిలో ఎంత అటవీభూమి ఉంటే దానంతటికీ కొత్తగా అనుమతులు తీసుకొనేంతవరకూ తవ్వకాలు జరపడానికి వీల్లేదు. సదరు మైనింగ్‌ లీజు పరిధిలోకివచ్చే అటవీభూమి ప్రస్తుత నికర విలువను సదరు సంస్థ నుంచి రాబట్టాలి.
  • అటవీ భూములను వినియోగించే సంస్థల నుంచి వసూలుచేసే పరిహారాన్ని ‘స్టేట్‌ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ’ ఖాతాలో జమచేయాలి.
  • అటవీ భూముల లీజులు మైనింగ్‌ లీజుల కాలపరిమితితో పాటే ముగుస్తాయి.
  • మైనింగ్‌యేతర కార్యకలాపాలకోసం అటవీ భూములను లీజుకు ఇచ్చేట్లయితే భూవినియోగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ, మైనింగ్‌ లీజు ఒప్పందాలపై సంతకాలుచేసి.. ఆ ఒప్పంద పత్రాలను, లీజ్‌ రెంట్‌ వివరాలతో సహా సమర్పించాలి.
  • ఒకవేళ ఏ అటవీభూమికి సంబంధించిన ప్రతిపాదనలైనా న్యాయ వివాదాల్లో ఉంటే వాటిపై కోర్టులు, ట్రైబ్యునళ్లు ఇచ్చిన తీర్పుల ఆధారంగా చర్యలు తీసుకోవాలి.
  • అటవీయేతర కార్యకలాపాలకోసం లీజుకు ఇచ్చిన అటవీభూముల్లో జరుగుతున్న కార్యకలాపాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదిలో కనీసం ఒక్కసారైనా పరిశీలించి, అందుకు సంబంధించిన నివేదికను పరివేష్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. లీజుకు తీసుకున్న సంస్థలు నిబంధనలు పాటించడంలేదని గుర్తిస్తే ఆ వివరాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నిబంధనలకు అనుగుణంగా దిద్దుబాటు చర్యలు చేపట్టేలా చూడాలి.
  • రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ భూములను లీజుకు ఇచ్చేటప్పుడు ‘షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ అండ్‌ అదర్‌ ట్రెడిషినల్‌ ఫారెస్ట్‌ డ్వెల్లర్స్‌ (రికగ్నిషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌) యాక్ట్‌- 2006తోపాటు, ఈ అంశంతో ముడిపడిన ఇతర చట్టాల్లోని నిబంధనలన్నీ అనుసరించాలి.
  • లీజుకు ఇచ్చే అటవీభూమి చట్టబద్ధమైన హోదాలో ఎప్పటికీ మార్పుచేయకూడదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని