తపాలా బిల్లుకు రాజ్యసభ ఆమోదం

దేశంలోని తపాలా కార్యాలయాలకు సంబంధించిన 125 ఏళ్ల నాటి ఇండియన్‌ పోస్ట్టా ఫీస్‌ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకురాదలచిన బిల్లుకు రాజ్యసభ సోమవారం ఆమోదం తెలిపింది.

Published : 05 Dec 2023 04:14 IST

దిల్లీ: దేశంలోని తపాలా కార్యాలయాలకు సంబంధించిన 125 ఏళ్ల నాటి ఇండియన్‌ పోస్ట్టా ఫీస్‌ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకురాదలచిన బిల్లుకు రాజ్యసభ సోమవారం ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత శాసనం ప్రకారం...ఏ వస్తువునైనా అడ్డుకోవడానికి, తనిఖీ చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా ఏ అధికారినైనా అనుమతించవచ్చు. శాంతిభద్రతలు,  విదేశాలతో స్నేహ సంబంధాల పరిరక్షణతో పాటు దేశంలో అమలులో ఉన్న చట్టాల నిబంధనల ఉల్లంఘనను అడ్డుకొనే అధికారాన్ని కొత్త చట్టం ప్రభుత్వానికి కల్పిస్తుంది. ప్రతిపాదిత పోస్ట్టాఫీస్‌ బిల్లు-2023లోని నిబంధనలను కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎగువసభ సభ్యులకు వివరించారు. తపాలా కార్యాలయాల ద్వారా అందించే సేవలకు సంబంధించిన నియమ నిబంధనల ఖరారుకు, ఆ సేవల రుసుములను నిర్ణయించడానికి పోస్టల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌కు ఈ బిల్లు అధికారం కల్పిస్తుంది. వర్షాకాల సమావేశాల సమయంలో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

లోక్‌సభలో న్యాయవాద వృత్తి నియంత్రణ బిల్లు

న్యాయస్థానాల్లో దళారుల ప్రమేయాన్ని నిరోధించేందుకు, న్యాయవాద వృత్తి నియంత్రణకు ఉద్దేశించిన బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. అంతకు ముందు సభలో బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ ప్రవేశపెట్టారు. ‘న్యాయవాద వృత్తి పవిత్రమైనది. మారిన పరిస్థితులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానాల ప్రాంగణాల్లో దళారులకు తావివ్వరాదనే ఉద్దేశంతో సవరణలను ప్రతిపాదిస్తున్నాం’ అని మంత్రి తెలిపారు. స్వల్ప చర్చ అనంతరం బిల్లుకు సభ సమ్మతి తెలిపింది. వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని