రోజుకు సగటున 78 హత్యలు

దేశంలో 2022లో 28,522 హత్యకేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 78 హత్యలు జరిగాయి. 2021లో నమోదైన మొత్తం హత్య కేసులతో(29,272) పోల్చితే 2022లో 2.6 శాతం తగ్గుదల నమోదైంది.

Published : 05 Dec 2023 04:17 IST

2022లో దేశవ్యాప్తంగా 28,522 కేసులు
సాధారణ నేరాల్లో తగ్గుదల
మహిళలు, చిన్నారులపై మాత్రం పెరిగాయి
జాతీయ నేర గణాంకాలు-2022లో వెల్లడి

ఈనాడు, దిల్లీ: దేశంలో 2022లో 28,522 హత్యకేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 78 హత్యలు జరిగాయి. 2021లో నమోదైన మొత్తం హత్య కేసులతో(29,272) పోల్చితే 2022లో 2.6 శాతం తగ్గుదల నమోదైంది. వివాదాలే హత్యలకు ప్రధాన కారణాలు. ఆ తర్వాత ప్రధాన కారణాలుగా వ్యక్తిగత ప్రతీకారం, శతృత్వం, వ్యక్తిగత ప్రయోజనం ఉన్నాయి. ఇక సాధారణ నేరాలు 2022లో తగ్గాయి. మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీలు, వయోవృద్ధులపై మాత్రం పెరిగాయి. సోమవారం విడుదలైన జాతీయ నేరగణాంకాలు-2022 ఈ విషయాన్ని వెల్లడించాయి. 2021తో పోలిస్తే 2022లో సాధారణ నేరాల సంఖ్య 4.5% మేర తగ్గింది. అదే సమయంలో మహిళలపై 4%, చిన్నారులపై    8.7% పెరిగాయి. కిడ్నాప్‌లు 5.8%, వృద్ధులపై వేధింపులు 9.3%, ఎస్సీలపై వేధింపులు 13.1%, ఎస్టీలపై నేరాలకు సంబంధించి  14.3% మేర కేసులు ఎక్కువయ్యాయి. ఆర్థిక నేరాలు 11.1%, అవినీతి కేసులు 10.5%, సైబర్‌నేరాలు 24.4% వృద్ధి చెందాయి. మనుషుల అక్రమ రవాణా 2.8% ఎక్కువైంది. ఇందులో మిస్సింగ్‌ కేసులు 13.5% పెరగ్గా, ఆచూకీ తెలియని చిన్నారుల కేసులు 7.5% వృద్ధి చెందాయి. ఆస్తి సంబంధ నేరాలూ 10.1% పెరిగాయి.

 •  2022లో గుర్తించదగ్గ నేరాలు మొత్తం 58,24,946 నమోదయ్యాయి. ఇందులో ఐపీసీ కింద 35,61,379, ఇతర ప్రత్యేక, స్థానిక చట్టాల కింద 22,63,567 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది నమోదైన 60,96,310 కేసులతో పోలిస్తే 2022లో 2,71,364 (4.5%) మేర తగ్గుదల నమోదైంది.
 • క్రైం రేట్‌ (ప్రతి లక్ష మంది జనాభాకు) 445.9 నుంచి 422.2కు దిగివచ్చింది.
 • దేశవ్యాప్తంగా 2022లో 1,07,588 కిడ్నాప్‌ కేసులు నమోదయ్యాయి. ఇది క్రితం సంవత్సరం కంటే (1,01,707) 5.8% ఎక్కువ. ఇందులో మహిళలు (88,861) అత్యధికంగా ఉన్నారు. 2021తో పోలిస్తే ఐపీసీ కింద నమోదైన కేసులు 2.8%, ప్రత్యేక, స్థానిక చట్టాల కింద నమోదైన కేసులు 7% తగ్గాయి. సామాజిక ప్రశాంతతను దెబ్బతీసే కేసులు 63,391 నుంచి 57,082 (10%)కి తగ్గాయి.
 • మహిళలపై కేసులు 4,28,278 నుంచి 4,45,256కు (4%) పెరిగాయి. ఇందులో భర్త, బంధువుల హింస (31.4%)కు సంబంధించినవే అత్యధికం ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో కిడ్నాప్‌ (19.2%), లైంగికదాడి (18.7%), అత్యాచారం (7.1%) కేసులు ఉన్నాయి. ప్రతి లక్ష మందిపై నమోదైన నేరాలు 2021లో 64.5 మేర ఉండగా, 2022లో ఆ సంఖ్య 66.4కి పెరిగింది.
 • చిన్నారులపై నేరాలు 1,49,404 నుంచి 1,62,449కి (8.7%) పెరిగాయి. ఇందులో అత్యధికం కిడ్నాప్‌ (45.7%), అత్యాచారంతోసహా పోక్సో చట్టం కింద నమోదైన కేసులు (39.7%) ఉన్నాయి. చిన్నారులపై క్రైం రేట్‌ 33.6 నుంచి 36.6కు పెరిగింది.
 • జువెనైల్‌ కేసులు 31,170 నుంచి 30,555 (2%)కు తగ్గాయి. 30,555 కేసుల్లో 37,780 మంది బాలలను అరెస్టు చేశారు. ఇందులో 78.6% మంది 16 నుంచి 18 ఏళ్లలోపువారే.
 • సీనియర్‌ సిటిజన్లపై కేసులు 26,110 నుంచి 28,545(9.3%)కు పెరిగాయి. ఇందులో 27.3% సాధారణ దాడులకు సంబంధించినవికాగా, దొంగతనాలకు సంబంధించినవి 13.8%, ఫోర్జరీ, చీటింగ్‌, ఫ్రాడ్‌కు సంబంధించనవి 11.2% మేర ఉన్నాయి.
 • ఎస్సీ అట్రాసిటీ కింద కేసులు 50,900 నుంచి 57,572 (13.1%)కి పెరిగాయి. వీరిపై క్రైమ్‌రేట్‌ ఏడాది కాలంలో 25.3 నుంచి 28.6కు పెరిగింది.
 • ఎస్టీ అట్రాసిటీ కేసులు 8,802 నుంచి 10,064 (14.3)కి పెరిగాయి. వీరిపై క్రైమ్‌రేట్‌ 8.4 నుంచి 9.6కి పెరిగింది.
 • ఆర్థిక నేరాల కేసులు 1,74,013 నుంచి 1,93,385 (11.1%) పెరిగాయి. ఇందులో విశ్వాసఘాతుకం, ఫోర్జరీ, చీటింగ్‌, దొంగనోట్ల కేసులు అత్యధికం ఉన్నాయి.
 • రాష్ట్రాల అనిశాలు నమోదుచేసిన అవినీతి కేసులు 3,745 నుంచి 4,139 (10.5%)పెరిగాయి. ఇందులో 69.7% వలపన్ని పట్టుకున్నవే. ఈ కేసుల్లో 4,994 మందిని అరెస్ట్‌ చేయగా, అందులో 852 మందికి శిక్షపడింది.
 • సైబర్‌నేరాలు ఏడాది కాలంలో 52,974 నుంచి 65,893 (24.4%)కు పెరిగాయి. ఈ విభాగంలో క్రైమ్‌ రేట్‌ 3.9 నుంచి 4.8కి పెరిగింది. ఇందులో 64.8% కేసులకు ప్రధాన కారణం మోసం. అక్రమ వసూళ్ల కింద 5.5%, లైంగిక దోపిడీ కింద 5.2% కేసులు నమోదయ్యాయి.
 • రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నమోదైన కేసులు 5,164 నుంచి 5,610 (8.6%)కి పెరిగాయి. ఇందులో 78.5% కేసులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేసిన కారణంగా, 17.9% కేసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదయ్యాయి.
 • విదేశీయులకు వ్యతిరేకంగా జరిగిన నేరాలకు సంబంధించిన కేసులు 150 నుంచి 192కి పెరిగాయి. ఇందులో 28% వృద్ధి నమోదైంది. ఇందులో 34 దొంగతనాలు, 28 అత్యాచారాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. 192 కేసుల్లో 222 మంది బాధితులు ఉండగా, అందులో 56.8% మంది ఆసియా, 18% మంది ఆఫ్రికన్‌ ఖండాలకు చెందినవారు ఉన్నారు.
 • విదేశీయులకు వ్యతిరేకంగా నమోదైన కేసుల సంఖ్య 2,585 నుంచి 2,100కి (18.8%) తగ్గిపోయింది.
 • మనుషుల అక్రమ రవాణా కేసులు 2,189 నుంచి 2,250 (2.8%)కి పెరిగాయి. అక్రమరవాణాకు గురైన వారిలో 2,878 మంది చిన్నారులు ఉండగా, 3,158 మంది పెద్దలు ఉన్నారు.
 • 2022లో 4,42,572 మంది వ్యక్తులు తప్పిపోయారు. అంతకుముందు సంవత్సరంకంటే ఇది 13.5% అధికం. ఇందులో 1,49,008 మంది పురుషులు, 2,93,500 మంది మహిళలు, 64 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 2022లో తప్పిపోయినవారిలో మొత్తం 4,01,077 మందిని గుర్తించారు.
 • తప్పిపోయిన చిన్నారుల సంఖ్య ఏడాదిలో 77,535 నుంచి 83,350కి పెరిగింది. ఇందులో 20,380 మంది బాలురు, 62,946 మంది బాలికలు, 24 ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.
 • ఆస్తి గొడవలకు సంబంధించిన 7,62,368 నుంచి 8,39,252 (10.1%)కి పెరిగాయి. ఇందులో 77.8% దొంగతనం, 12.8% దోపిడీకి సంబంధించినవి. ఈ ఏడాదిలో రూ.5,223.3 కోట్ల విలువైన ఆస్తులు చోరీకి గురయ్యాయి. అందులో రూ.1,882.5 కోట్ల ఆస్తులు రికవరీ అయ్యాయి.
 • 2,79,185 ఆస్తి తగాదాలు నివాస ప్రాంగణాల్లో జరగ్గా, 16,014 దోపిడీలు జాతీయ రహదారులు, ఇతర రహదారుల్లో చోటుచేసుకున్నాయి.
 • రూ.382.66 కోట్ల విలువైన 42,10,406 నకిలీ నోట్లను పట్టుకున్నారు.
 • శిక్షలు అత్యారం కేసుల్లో అతితక్కువగా 27.4%మాత్రమే పడ్డాయి. హత్య కేసుల్లో 43.8%, కిడ్నాప్‌ కేసుల్లో 33.9%, దాడుల కేసుల్లో 35.9%, కలహాల కేసుల్లో 24.9% మాత్రమే శిక్షలు పడ్డాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని