సంక్షిప్త వార్తలు (6)

జాతుల మధ్య ఘర్షణల వల్ల నిరాశ్రయులైన 284 మంది మణిపుర్‌ విద్యార్థులకు రక్షణగా సుప్రీంకోర్టు చర్యలు చేపట్టింది. వారి చదువుల కొనసాగింపునకు అవకాశం కల్పించింది.

Updated : 05 Dec 2023 06:19 IST

284 మంది మణిపుర్‌ విద్యార్థుల చదువులకు రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు

దిల్లీ: జాతుల మధ్య ఘర్షణల వల్ల నిరాశ్రయులైన 284 మంది మణిపుర్‌ విద్యార్థులకు రక్షణగా సుప్రీంకోర్టు చర్యలు చేపట్టింది. వారి చదువుల కొనసాగింపునకు అవకాశం కల్పించింది. మణిపుర్‌ విశ్వవిద్యాలయం నిర్వహించే ఆన్‌లైన్‌ తరగతులకు హాజరుకావడం లేదా సిల్చార్‌లోని అస్సాం విశ్వవిద్యాలయం లేదా షిల్లాంగ్‌లోని నార్త్‌ఈస్ట్‌ హిల్‌ విశ్వవిద్యాలయంలో కానీ వారు కోరుకున్న చోట చదువుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటున్న ఆ విద్యార్థుల తరఫున దాఖలైన ఓ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువరించింది. రెండు వారాల్లోగా విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. దీనికి గాను నోడల్‌ అధికారిని నియమించాలని మణిపుర్‌ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ముగ్గురు మాజీ మహిళా జడ్జీలతో ఏర్పడిన కమిటీ ఈ విషయాలనూ పర్యవేక్షిస్తుందని విద్యార్థులకు ధర్మాసనం భరోసానిచ్చింది. ఈ కమిటీని సర్వోన్నత న్యాయస్థానం నియమించిన విషయం తెలిసిందే.


మహిళాధికారులకు పదోన్నతులపై సమాలోచనలు

సుప్రీంకోర్టుకు తెలిపిన సైన్యం

దిల్లీ: మహిళాధికారులకు కర్నల్‌ ర్యాంక్‌ నుంచి బిగ్రేడియర్‌ హోదా పదోన్నతిని కల్పించేందుకు అవసరమైన విధాన రూపకల్పనపై సమాలోచనలు జరుగుతున్నాయని భారత ఆర్మీ సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి, సీనియర్‌ న్యాయవాది ఆర్‌.బాలసుబ్రమణియన్‌ నివేదించిన ఈ విషయాన్ని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం నోట్‌ చేసుకుంది. పదోన్నతి విధాన ఖరారుకు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు గడువునిచ్చిన ధర్మాసనం తదుపరి విచారణను అదే ఏడాది ఏప్రిల్‌ మొదటి వారానికి వాయిదా వేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర సభ్యులుగా ఉన్నారు. ఆర్మీ, నేవీలలో మహిళాధికారుల పదోన్నతుల విషయంలో వివక్ష కొనసాగుతోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై 2020 ఫిబ్రవరి, మార్చి నెలల్లో రెండు చారిత్రక తీర్పులను సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే.


నిలుపుదల ఉత్తర్వుల తీర్పు సమీక్షకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు

దిల్లీ: సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో దిగువ కోర్టులు లేదా హైకోర్టులు మంజూరు చేసిన నిలుపుదల (స్టే) ఉత్తర్వులను ప్రత్యేకించి పొడిగించని పక్షంలో ఆరు నెలల తర్వాత వాటంతట అవే రద్దవుతాయంటూ 2018లో వెలువరించిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సమీక్షించనుంది. దీనికోసం ఏర్పాటు చేయదలచిన రాజ్యాంగ ధర్మాసనంలోని అయిదుగురు సభ్యుల పేర్లను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ సోమవారం వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓక్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ పంకజ్‌ మిథాల్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర సభ్యులుగా ఉంటారని పేర్కొంది.


సత్యేందర్‌ జైన్‌ మధ్యంతర బెయిల్‌ పొడిగింపు

దిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ గడువును ఈ నెల 11 వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. వైద్యపరమైన కారణాలతో మే 26న తొలుత ఆరు వారాలకు ఇచ్చిన బెయిల్‌ను న్యాయస్థానం పొడిగిస్తూ వస్తోంది.


సుప్రీంకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న సీఎఫ్‌డీ

ఎన్నికల విధుల నుంచి వాలంటీర్ల తొలగింపు వ్యాజ్యం

ఈనాడు, దిల్లీ: ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను తొలగించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) ఉపసంహరించుకుంది. జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుటకు సోమవారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. దిల్లీ హైకోర్టులో ఇటువంటి పిటిషన్‌ విచారణలో ఉండడం, గతంలో ఇటువంటి పిటిషన్‌ విచారణకు వచ్చినప్పుడు దిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో తాము పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. సానుకూలంగా స్పందించిన ధర్మాసనం.. పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతించింది.


ఏకపక్ష ఫలితాలు ఆందోళనకరం

ఇటీవలి ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో పోటీ హోరాహోరీగా ఉంటుందని భావించారు. కానీ మూడు రాష్ట్రాల్లో ఏకపక్షంగా ఒకేపార్టీకి అనుకూల ఫలితాలు రావడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల నాడిని పసిగట్టడంలో పార్టీలు ఘోరంగా విఫలమైనట్లు కనిపిస్తోంది. దీనిపై లోతుగా సమాలోచనలు జరిపి పరిష్కారాన్ని కనుగొనాలి.

మాయావతి


మా ఓట్ల శాతం ఆశాజనకం

ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పనితీరు నిరాశపరిచింది. మా అంచనాల కన్నా చాలా తక్కువ సీట్లు సాధించాం. కానీ ఓట్ల శాతం విషయంలో మాత్రం మేము భాజపాకు సమీపంలోనే ఉన్నాం. మేము మళ్లీ మెరుగైన పనితీరుతో అధికారాన్ని చేజిక్కించుకుంటామని విశ్వసిస్తున్నాం.

జైరాం రమేశ్‌


ప్రధాని మోదీ ఉత్తమ నాయకుడు

తాజా ఎన్నికల్లో భాజపా మూడు రాష్ట్రాల్లో తిరుగులేని ఫలితాలు సాధించింది. ఇది ప్రధాని మోదీకి భారత ప్రజలు ఇచ్చిన గొప్ప కానుక. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సాధించబోయే విజయానికి ఇవి నాంది పలికాయి. భారత్‌-అమెరికా సంబంధాలను మరింత మెరుగుపరచగల ఉత్తమ నాయకుడు మోదీ.

మేరీ మిల్బెన్‌ (అమెరికా గాయని)


బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలి

ప్రపంచవ్యాప్తంగా ప్రతి అయిదుగురు బాలికల్లో ఒకరికి 18 ఏళ్లు నిండక ముందే వివాహం చేస్తున్నారు. కొన్ని దేశాల్లో 40 శాతం మంది బాలికలకు ఈ పరిస్థితి ఎదురవుతోంది. బాల్య వివాహాలు కచ్చితంగా హక్కుల ఉల్లంఘనే. దీనికి అడ్డుకట్ట వేయడానికి అన్ని దేశాల ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలి.

ఐక్యరాజ్య సమితి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని