పదేళ్లలో 101 శాతం పెరిగిన తలసరి అప్పు

కేంద్ర ప్రభుత్వం చేసిన తలసరి అప్పు గత పదేళ్లలో 101 శాతం పెరిగింది. ఇదే సమయంలో తలసరి ఆదాయం మాత్రం 62.59 శాతం మాత్రమే వృద్ధి చెందింది.

Published : 06 Dec 2023 04:07 IST

లోక్‌సభలో కేంద్రం వెల్లడి

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేసిన తలసరి అప్పు గత పదేళ్లలో 101 శాతం పెరిగింది. ఇదే సమయంలో తలసరి ఆదాయం మాత్రం 62.59 శాతం మాత్రమే వృద్ధి చెందింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు డెరెక్‌ ఒబ్రియెన్‌ మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌ చౌధరి ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2011-12 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ తలసరి అప్పు రూ.29,127 ఉండగా, 2022-23 మార్చి నాటికి అది రూ.58,709కి చేరినట్లు మంత్రి తెలిపారు. ఇందులో దేశీయ తలసరి అప్పు రూ.26,481 నుంచి రూ.55,528కి, విదేశీ తలసరి అప్పు రూ.2,647 నుంచి రూ.3,181కి పెరిగినట్లు వెల్లడించారు.

పీఎం కిసాన్‌ మొత్తాన్ని పెంచే యోచనలేదు

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకం కింద రైతులకు ఏటా అందించే రూ. ఆరు వేల మొత్తాన్ని పెంచే యోచనేమీ ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మంగళవారం లోక్‌సభలో తెలిపారు.

‘ఒకే పతాకం, ఒకే ప్రధాని, ఒకే రాజ్యాంగం’.. నినాదం కాదు : అమిత్‌ షా

‘ఒకే పతాకం, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాజ్యాంగం’ అనే భావన రాజకీయ నినాదం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పునరుద్ఘాటించారు. ఆ భావనను భాజపా పూర్తిగా విశ్వసిస్తుందన్నారు. ఆ క్రమంలోనే జమ్మూకశ్మీర్‌లో ఆ విధానాన్ని అమలు చేశామన్నారు. ఒకే పతాకం, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాజ్యాంగం అనేది రాజకీయ నినాదం అంటూ టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్‌ లోక్‌సభలో విమర్శించారు. దీనిపై అమిత్‌ షా స్పందిస్తూ పై మేరకు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని