పాక్‌ అమ్మాయి.. భారత్‌ అబ్బాయి.. కొవిడ్‌ కష్టాలు దాటి కల్యాణం

అయిదేళ్లుగా ప్రేమించుకొంటున్న ఈ జంట కొవిడ్‌ సహా పలు ఆటంకాలు అధిగమించి, దేశాల సరిహద్దులు దాటి కొత్త సంవత్సర ప్రారంభంలో ఒకటి కానుంది.

Updated : 06 Dec 2023 10:32 IST

అయిదేళ్లుగా ప్రేమించుకొంటున్న ఈ జంట కొవిడ్‌ సహా పలు ఆటంకాలు అధిగమించి, దేశాల సరిహద్దులు దాటి కొత్త సంవత్సర ప్రారంభంలో ఒకటి కానుంది. అతడి కోసం మంగళవారం వాఘా - అటారీ అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి అడుగుపెట్టిన పాక్‌ యువతికి బాజా భజంత్రీలతో యువకుడి కుటుంబం ఘనస్వాగతం పలికింది. ఈ ప్రేమకథ 2018లో మొదలైంది. కోల్‌కతాకు చెందిన సమీర్‌ఖాన్‌ జర్మనీలో చదువుకున్నాడు. అయిదేళ్ల కిందట భారత్‌కు వచ్చినప్పుడు తన తల్లి ఫోనులో కరాచీకి చెందిన జావెరియా ఖానుమ్‌ ఫొటో చూసి మనసు పారేసుకున్నాడు. పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని పట్టుబట్టాడు. పెద్దలు అంగీకరించినా వీరి పెళ్లికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. భారత్‌కు వచ్చేందుకు రెండుసార్లు జావెరియా ప్రయత్నించగా ఆమె వీసా తిరస్కరణకు గురైంది. మధ్యలో కొవిడ్‌ కష్టాలు వచ్చిపడ్డాయి. మొత్తం అయిదేళ్లు అలా గడిచిపోయాయి. ఎట్టకేలకు 45 రోజుల గడువుతో జావెరియాకు ఇపుడు భారత్‌ వీసా దక్కింది. అమృత్‌సర్‌ నుంచి కోల్‌కతాకు ఈ జంట విమానంలో చేరుకుంది. జావెరియాకు వీసా మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి సమీర్‌ఖాన్‌ కృతజ్ఞతలు తెలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని