కొన్ని విషయాలపై మౌనమే ఉత్తమం

న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులపై కొలీజియం సిఫార్సులకు ఆమోదం తెలపకుండా కేంద్రం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Updated : 06 Dec 2023 07:22 IST

జడ్జీల నియామకం కేసు సుప్రీంకోర్టులో విచారణకు రాకపోవడంపై జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ వ్యాఖ్య

దిల్లీ: న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులపై కొలీజియం సిఫార్సులకు ఆమోదం తెలపకుండా కేంద్రం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. నవంబరు 20న ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాంశు ధూలియా ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి(డిసెంబరు 5కి) వాయిదా వేసింది. అయితే, ఈ కేసు లిస్ట్‌ కాకపోవడం, విచారణ జాబితాలోనూ కనిపించకపోవడంతో పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఒకరు తొలుత ఈ అంశాన్ని మంగళవారం ఉదయం జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆయన...‘ఈ కేసును విచారణ జాబితా నుంచి నేను తొలగించలేదు’ అని తెలిపారు. ఆ తర్వాత పిటిషనర్‌ తరఫు మరో న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కూడా ఇదే అంశాన్ని జస్టిస్‌ కిషన్‌ కౌల్‌ ముందు ప్రస్తావించగా అంతకు ముందు చెప్పిన సమాధానాన్నే పునరుద్ఘాటించారు. ధర్మాసనం ఆదేశించినా కేసు విచారణకు రాకపోవడంపై కోర్టు రిజిస్ట్రీ వివరణ కోరాలని ప్రశాంత్‌ భూషణ్‌ తెలుపగా.... ‘ప్రధాన న్యాయమూర్తికి ఈ విషయం తెలిసి ఉండొచ్చ’ని జస్టిస్‌ కౌల్‌ పేర్కొన్నారు.

వాయిదా వేసిన తేదీకి కేసు విచారణకు రాకపోవడం అసాధారణమంటూ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ‘కొన్ని విషయాలను వెల్లడించకుండా మౌనం వహించడమే ఉత్తమం’ అని జస్టిస్‌ కౌల్‌ బదులిచ్చారు. ‘కేసును విచారణ జాబితా నుంచి నేను తొలగించలేదని ఇప్పటికే స్పష్టంచేశాను. ఈ కేసును చేపట్టడానికి సుముఖంగానూ లేను’ అని ఆయన వెల్లడించారు. కొలీజియం సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వ జాప్యాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనమే చాలా కాలంగా విచారణ జరుపుతోంది. కొలీజియం పంపించిన జాబితాల నుంచి కొన్ని పేర్లను మాత్రమే ఎంపిక చేసుకుని కేంద్రం ఆమోదం తెలుపుతుండడంపై నవంబరు 20నాటి విచారణ సమయంలో ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఈ తరహా చర్యలు తప్పుడు సంకేతాలనిస్తాయని మండిపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని