‘అపోలో కిడ్నీ రాకెట్‌’పై విచారణకు కేంద్రం ఆదేశం

దేశ రాజధాని నగరంలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిపై వచ్చిన  కిడ్నీ విక్రయ కుంభకోణ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్‌వోటీటీవో) ఆదేశాలు జారీ చేసిందని మంగళవారం అధికారవర్గాలు తెలిపాయి.

Updated : 06 Dec 2023 06:07 IST

మీడియా కథనంపై నివేదిక కోరిన ఆరోగ్య మంత్రిత్వశాఖ

దిల్లీ: దేశ రాజధాని నగరంలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిపై వచ్చిన  కిడ్నీ విక్రయ కుంభకోణ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్‌వోటీటీవో) ఆదేశాలు జారీ చేసిందని మంగళవారం అధికారవర్గాలు తెలిపాయి. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వంలోని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి సంస్థ సంచాలకులు డాక్టర్‌ అనిల్‌కుమార్‌ లేఖ రాశారు. పరిశీలన అనంతరం 1994 నాటి మానవ అవయవాలు, కణజాల మార్పిడి చట్టం (టీహెచ్‌వోటీఏ) కింద తగిన చర్యలు తీసుకొని వారం రోజుల్లోగా కార్యాచరణ నివేదికను సమర్పించాలని లేఖలో కోరారు. దిల్లీ అపోలో ఆసుపత్రితోపాటు          డాక్టర్‌ సందీప్‌ గులేరియా ప్రమేయంతో నడుపుతున్న కిడ్నీ రాకెట్‌లో మయన్మార్‌కు చెందిన పేదలు తమ మూత్రపిండాలు అమ్ముకొనేలా ప్రలోభపెడుతున్నట్లుగా వచ్చిన  అంతర్జాతీయ మీడియా కథనాన్ని డాక్టర్‌ అనిల్‌కుమార్‌ లేఖకు జత చేశారు. ఇటువంటి కార్యకలాపాలు బాధిత పేదల ఆరోగ్యానికి, సంక్షేమానికి తీవ్ర ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

చట్ట ప్రకారం, నైతిక నిబద్ధతతోనే చేస్తున్నాం

అపోలో ఆసుపత్రుల సమూహానికి చెందిన ‘ది ఇంద్రప్రస్థ మెడికల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’  (ఐఎంసీఎల్‌) తమపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. ‘‘చట్టప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, నైతిక నిబద్ధతను పాటిస్తున్నాం. విదేశీ అవయవదాతల విషయంలో దాత, గ్రహీత ముందుగా ఓ అవగాహనతో ఉన్నట్లుగా ఆయా ప్రభుత్వాల ధ్రువపత్రాలు సమర్పించాలని కోరుతున్నాం. ఈ మేరకు ప్రతి దాత వారి దేశాల్లో సంబంధిత మంత్రిత్వశాఖ నోటరీ చేసిన ఫారం 21 అందించాల్సి ఉంటుంది. ఈ పత్రాలను ఆయా దేశాల రాయబార కార్యాలయాల ద్వారా మళ్లీ మేము ధ్రువీకరించుకొంటాం’’ అని  ఐఎంసీఎల్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రభుత్వం నియమించిన అధికారిక కమిటీ ప్రతి కేసులోనూ ఐఎంసీల్‌లోని ఆయా ధ్రువపత్రాలను పరిశీలించి, దాత - గ్రహీతలతో మాట్లాడుతున్నట్లుగా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని