తమిళనాడులో వర్షాలకు 12మంది మృతి

తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 12మంది మృతిచెందారు. ఇందులో చెన్నైనగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో 11 మంది చనిపోయినట్లు యంత్రాంగం చెబుతోంది.

Published : 06 Dec 2023 05:13 IST

ఈనాడు, చెన్నై: తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 12మంది మృతిచెందారు. ఇందులో చెన్నైనగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో 11 మంది చనిపోయినట్లు యంత్రాంగం చెబుతోంది. వీరంతా వరదల్లో చిక్కుకుని, భవనం కూలిపోయి, గోడ, చెట్లు మీదపడి, మరికొందరు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు చెన్నైతో పాటు పరిసర పలు జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. చెన్నైలోని చాలా ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి.  మరోవైపు నగరంలోని వరద బాధిత ప్రాంతాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పర్యటించి పరిస్థితి తెలుసుకున్నారు.

చెన్నై వరదల్లో చిక్కుకున్న నటుడు ఆమిర్‌ఖాన్‌

చెన్నై, న్యూస్‌టుడే: చెన్నై వరదల్లో చిక్కుకున్న బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ను సహాయక బృందం కాపాడింది. తుపాను కారణంగా చెన్నై శివారులోని కారపాక్కంలో వరదనీరు ముంచెత్తింది. తాను, గుత్తా జ్వాల వరద ముంపులో చిక్కుకున్నట్టు అక్కడ నివాసమున్న నటుడు విష్ణువిశాల్‌..వెల్లడించారు. బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ కూడా అదే ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్నట్లు తెలిసింది. స్పందించిన సహాయక బృందం వారిని బోట్‌ ద్వారా వరద ముంపు నుంచి బయటకు తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ, ఆమిర్‌ఖాన్‌తో కలిసి బోటులో ఉన్న ఫొటోను ‘ఎక్స్‌’ పేజీలో విష్ణువిశాల్‌ పోస్టు చేశారు. ఆమిర్‌ఖాన్‌ తన తల్లికి వైద్యచికిత్స కోసం కొన్ని నెలల కిందట చెన్నైలో ఇల్లు తీసుకుని ఉంటున్నారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని