‘రైతుబిడ్డ..’ ఏడాదికి రూ.కోటి టర్నోవర్‌

ఆధునిక పద్ధతిలో సేద్యం చేస్తూ ఏడాదికి రూ.కోటికి పైగా టర్నోవరును సాధించిన రైతు రమేశ్‌ నాయక్‌ ‘బిలియనీర్‌ ఫార్మర్‌’ అవార్డును దక్కించుకున్నారు.

Published : 06 Dec 2023 05:23 IST

రేపు ప్రధాని చేతులమీదుగా ‘బిలియనీర్‌ ఫార్మర్‌’ అవార్డు

ఉడుపి, న్యూస్‌టుడే: ఆధునిక పద్ధతిలో సేద్యం చేస్తూ ఏడాదికి రూ.కోటికి పైగా టర్నోవరును సాధించిన రైతు రమేశ్‌ నాయక్‌ ‘బిలియనీర్‌ ఫార్మర్‌’ అవార్డును దక్కించుకున్నారు. దిల్లీలో గురువారం నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని అందిస్తారు. కర్ణాటక రాష్ట్రం కుందాపుర సమీపంలోని తెక్కట్టెకు చెందిన రమేశ్‌నాయక్‌కు 13 ఎకరాల సాగుభూమి ఉంది. అందులో 11 జాతులకు చెందిన 1,634 పండ్ల చెట్లు పెంచుతున్నారు. వ్యవసాయం ద్వారా ఏటా రూ.కోటి సంపాదిస్తున్నారు. దీంతోపాటు వారసత్వంగా వచ్చిన బియ్యం మిల్లును నడిపిస్తున్నారు. ‘మా నాన్న 1968లో బియ్యం మిల్లును ప్రారంభించారు. నేను 1979 నుంచి అందులో పనిచేస్తున్నాను. తర్వాత మా 13 ఎకరాల పొలంలో ఆధునిక పద్ధతుల్లో సేద్యాన్ని ప్రారంభించా. ఒక పండ్ల పరిశ్రమలను ఏర్పాటుచేశా. ఇలా మా వ్యాపారం రూ.10 కోట్లకు పెరిగింది. ఇందులో సేద్యం ద్వారా రూ.కోటి వస్తుంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని బెంగళూరులోని గాంధీ కృషివిజ్ఞాన కేంద్రం నన్ను ఈ పురస్కారానికి సిఫార్సు చేసింది’ అని వివరించారు. సేద్యంలో నష్టం వస్తుందని చాలామంది భావిస్తుంటారని, శాస్త్రీయంగా, ఆధునిక విధానాలలో సాగుచేస్తే, నష్టాలు లేకుండా వ్యవసాయం చేయవచ్చని రమేశ్‌ నాయక్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని