పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మనదే

కశ్మీర్‌ దుస్థితికి భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన రెండు అతి పెద్ద తప్పిదాలే కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆరోపించారు.

Updated : 07 Dec 2023 08:25 IST

నెహ్రూ తప్పిదాలతోనే కశ్మీర్‌కు ఈ దుస్థితి: అమిత్‌ షా
కశ్మీర్‌ అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
పీవోకేకు 24 స్థానాలు రిజర్వు

దిల్లీ: కశ్మీర్‌ దుస్థితికి భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేసిన రెండు అతి పెద్ద తప్పిదాలే కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. మొత్తం కశ్మీర్‌ను గెలుచుకోకుండా కాల్పుల విరమణను ప్రకటించడం, అక్కడి ప్రజల బాధలను ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లకపోవడం ఆ తప్పిదాలని పేర్కొన్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) మన దేశంలో భాగమేనని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లు, జమ్మూ కశ్మీర్‌ రీఆర్గనైజేషన్‌ (సవరణ) బిల్లులను కేంద్రం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వాటిని సభ ఆమోదించింది. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడారు. ‘నెహ్రూ సరైన చర్యలు తీసుకుని ఉంటే కశ్మీర్‌లోని పెద్ద భూభాగం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌గా ఉండేది కాదు. అది మన దేశంలో భాగంగా ఉండేది.  అప్పటి ఆయన చర్యలవల్లే ఇప్పటికీ కశ్మీర్‌ ఇబ్బందులు పడుతోంది. సైన్యం యుద్ధంలో గెలిచి పంజాబ్‌ను చేరుకోగానే కాల్పుల విరమణను నెహ్రూ ప్రకటించారు. దీంతో పీవోకే ఏర్పడింది. ఆ కాల్పుల విరమణను మూడు రోజుల తర్వాత ప్రకటించి ఉంటే పీవోకే భారత్‌లో భాగమయ్యేది’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. మన దేశానికి చెందిన ఎంతో భూభాగాన్ని కోల్పోయామని, ఇది చారిత్రక తప్పిదమని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పొరపాటు జరిగిందని నెహ్రూ అంగీకరించారని, కానీ అది పొరపాటు కాదని, అతి పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. ఆయన ఈ విమర్శలు చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. వాకౌట్‌ చేశాయి. ఆ తర్వాత తిరిగి వచ్చాయి. హిమాలయన్‌ బ్లండర్‌ గురించీ అమిత్‌ షా మాట్లాడాలని బిజూ జనతాదళ్‌ ఎంపీ భర్తృహరి మెహతాబ్‌ కోరారు. నెహ్రూ చర్యలవల్ల 1962లో చైనాతో యుద్ధానికి దారితీసిన పరిస్థితులే హిమాలయన్‌ బ్లండర్‌ అని తెలిపారు. అమిత్‌ షా వ్యాఖ్యలు ఎవరినో కించపరచడానికి కాదని, సందర్భాన్ని బట్టి చేసినవని స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన్నారు.

2024లో మళ్లీ మోదీయే

ఆర్టికల్‌ 370 తాత్కాలికంగా తీసుకొచ్చిందని, దాని రద్దు నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లేది లేదని, ప్రధాని మోదీ ఈ విషయంలో ధైర్యం ప్రదర్శించారని అమిత్‌ షా తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాదం వల్ల 45,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, 2026కల్లా తీవ్రవాద ఘటనలను సున్నా స్థాయికి తీసుకొస్తామని చెప్పారు. 2024లోనూ మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్సే

బీసీలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్సేనని అమిత్‌ షా స్పష్టం చేశారు. మోదీ పేద కుటుంబంలో పుట్టారని, బీసీల కష్టాలన్నీ ఆయన అనుభవించారని, ఇప్పుడు ప్రధాని అయ్యారని పేర్కొన్నారు. అందుకే బీసీల సంక్షేమం కోసం పని చేస్తున్నారని తెలిపారు. మండల్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేసినప్పుడూ  మోదీ హయాంలో బీసీలకు కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను కల్పించామని తెలిపారు.

కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల పెంపు

గతంలో జమ్మూ కశ్మీర్‌లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 83 ఉండగా.. తాజా బిల్లులో 90కి పెంచారు. ఇంతకు ముందు కశ్మీర్‌ డివిజన్‌లో 46, జమ్ము డివిజన్‌లో 37 స్థానాలు ఉండేవి. తాజా బిల్లులో కశ్మీర్‌ డివిజన్‌లో 47కు, జమ్ము డివిజన్‌లో 43కు పెంచినట్లు అమిత్‌ షా వెల్లడించారు. ఇక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు 24 స్థానాలను రిజర్వు చేసినట్లు ప్రకటించారు. దీంతో మొత్తం స్థానాల సంఖ్య 114గా ఉంటుంది. ఇక కశ్మీర్‌లో రెండు స్థానాలను అక్కడి నుంచి వలస వెళ్లినవారికి, ఒక స్థానాన్ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వచ్చి స్థిరపడిన వారికి రిజర్వు చేసినట్లు అమిత్‌ షా తెలిపారు. తొలిసారిగా ఎస్సీ/ఎస్టీ వర్గాలకు 9 స్థానాలను కేటాయించినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని