సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్‌లో అసంబద్ధ విధానాలు

సుప్రీంకోర్టులో ఒక ధర్మాసనం ముందు విచారణకు లిస్టైన కేసులను అనూహ్యంగా మరో బెంచ్‌కు మారుస్తున్నట్లు సీనియర్‌ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు దుష్యంత్‌ దవే ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 07 Dec 2023 05:38 IST

వెంటనే చర్యలు తీసుకోండి
సీజేఐకి సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే లేఖ

దిల్లీ: సుప్రీంకోర్టులో ఒక ధర్మాసనం ముందు విచారణకు లిస్టైన కేసులను అనూహ్యంగా మరో బెంచ్‌కు మారుస్తున్నట్లు సీనియర్‌ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు దుష్యంత్‌ దవే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఆయన భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌కు బహిరంగ లేఖ రాశారు. సీజేఐని వ్యక్తిగతంగా కలిసేందుకు కొందరు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో తాను బహిరంగ లేఖ రాయాల్సి వచ్చిందని తెలిపారు. ‘‘కేసుల లిస్టింగ్‌ విషయంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అవలంబిస్తున్న కొన్ని విధానాలతో తీవ్ర ఆవేదన కలుగుతోంది. ఫస్ట్‌ కోరమ్‌ ఉన్న బెంచ్‌ ముందు లిస్టయిన కొన్ని కేసులను అనూహ్యంగా సెకండ్‌ కోరమ్‌ ఉన్న బెంచ్‌కు మారుస్తున్నారు. వీటిలో మానవ హక్కులు, వాక్‌ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగ సంస్థల పనితీరుకు సంబంధించిన అత్యంత సున్నితమైన కేసులు కూడా ఉన్నాయి. ఇది కచ్చితంగా నిబంధనల ఉల్లంఘనే. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి’’ అని దవే లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తుల పదోన్నతులు, బదిలీలపై కొలీజియం సిఫార్సులకు ఆమోదం తెలపడంలో కేంద్రం జాప్యాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన కేసులను విచారణ జాబితా నుంచి తొలగించడంపై జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ ఆశ్చర్యం వ్యక్తంచేసిన మరుసటి రోజే దవే ఈ లేఖ రాయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని