దేశ రక్షణ లక్ష్యంగా చట్టాల్లో మార్పులకు అవకాశముండాలి

అక్రమ వలసలు, హింసతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, ఈ విషయంలో దేశ రక్షణ లక్ష్యంగా చట్టాల సవరణకు ప్రభుత్వానికి విశాల దృక్పథముండేలా పరిస్థితులుండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Published : 07 Dec 2023 05:39 IST

ఈ విషయంలో విశాల దృక్పథం అవసరం
అస్సాం పౌరసత్వ చట్టంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

దిల్లీ: అక్రమ వలసలు, హింసతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, ఈ విషయంలో దేశ రక్షణ లక్ష్యంగా చట్టాల సవరణకు ప్రభుత్వానికి విశాల దృక్పథముండేలా పరిస్థితులుండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అస్సాంలో పౌరసత్వ చట్టానికి సంబంధించిన సెక్షన్‌ 6ఏ విషయంలో ప్రభుత్వాలకు తగిన పరిష్కారం చూసుకునే అవకాశముండాలని పేర్కొంది. కేవలం అస్సాం కోసమే రూపొందించిన పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌ 6ఏ అక్రమ వలసదారులకు వరంగా మారిందని, అస్సాంలో వారు ఉండేందుకు విస్తృత అవకాశాలను కల్పిస్తోందని, భారత పౌరసత్వ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని దాఖలైన పిటిషన్లపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. ‘మనం ప్రభుత్వాలకు తగిన విధంగా స్పందించే అధికారమివ్వాలి. ఇప్పటికీ పలు ఈశాన్య రాష్ట్రాలు అక్రమ వలసలతో ఇబ్బందులు పడుతున్నాయి. హింసతో అట్టుడుకుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో దేశ రక్షణ లక్ష్యంగా మనం కొంత అవకాశమివ్వాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని