భారత పార్లమెంటుపై దాడి చేస్తా

ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ మరోసారి భారత్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడు.

Updated : 07 Dec 2023 06:10 IST

ఖలీస్థానీ ఉగ్రవాది పన్నూ బెదిరింపులు
దిల్లీలో అప్రమత్తత.. భద్రత కట్టుదిట్టం

దిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ మరోసారి భారత్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడు. పార్లమెంటుపై దాడి చేస్తామంటూ అతను విడుదల చేసిన వీడియో కలకలం సృష్టిస్తోంది. దీంతో దిల్లీలో అప్రమత్తత ప్రకటించారు. గురుపత్వంత్‌ను హత్య చేయడానికి అమెరికాలో కుట్రలు జరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వీడియో రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం మొదలైన సమావేశాలు ఈ నెల 22 వరకు కొనసాగుతాయి. ఈ క్రమంలో డిసెంబరు 13లోగా పార్లమెంటుపై దాడికి పాల్పడతామంటూ పన్నూ చేసిన బెదిరింపులను.. భద్రతా సంస్థలు సీరియస్‌గా తీసుకున్నాయి. ‘పార్లమెంటు ప్రాంగణం అంతటా భద్రతను కట్టుదిట్టం చేశాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను అనుమతించం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని భద్రతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. దిల్లీ నగరవ్యాప్తంగా కూడా బందోబస్తు పెంచినట్లు తెలిపారు.2001వ సంవత్సరంలోనూ డిసెంబరు 13నే పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగింది. దీనికి సూత్రధారి అయిన అఫ్జల్‌ గురు ఫొటో ఒకటి పన్నూ విడుదల చేసిన వీడియోలో కనిపించింది. తనను చంపేందుకు భారత ఏజెన్సీలు కుట్ర చేశాయని, దానికి ప్రతిస్పందనగానే ఈ దాడి ఉంటుందని ఉగ్రవాది బెదిరించాడు. అఫ్జల్‌ గురు ఫొటోతో పాటు దిల్లీ బనేగా ఖలిస్థానీ (దిల్లీని ఖలిస్థానీగా మారుస్తాం) అనే నినాదం ఉన్న పోస్టర్‌ను పన్నూ ప్రదర్శించాడు. 2001 డిసెంబరు 13న పార్లమెంటుపై దాడి జరగ్గా, ఈ ఏడాదితో 22 ఏళ్లు పూర్తి కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని