గుండెపోట్ల కలవరం.. 10 లక్షల మందికి సీపీఆర్‌ శిక్షణ

వయసుతో సంబంధం లేకుండా ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్న గుండెపోటు మరణాలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

Updated : 07 Dec 2023 06:08 IST

దిల్లీ: వయసుతో సంబంధం లేకుండా ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్న గుండెపోటు మరణాలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. నెల రోజుల కిందట గుజరాత్‌లో దసరా పండగ సందర్భంగా గర్బా నృత్యం చేస్తూ కొందరు మృతిచెందడం ఆందోళన కలిగించింది. ఈ అనూహ్య మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సీపీఆర్‌ టెక్నిక్‌లో శిక్షణ ఇచ్చేందుకు బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఈ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మందికి సీపీఆర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. గుర్తింపు పొందిన వెయ్యికి పైగా వైద్యకేంద్రాల ద్వారా ఈ శిక్షణ అందుతుంది. జిమ్‌లలో పనిచేసేవారూ ఈ శిక్షణలో భాగమవుతారు. అధికారిక గణాంకాల ప్రకారం.. 2021 - 2022 మధ్య గుండెపోటు మరణాలు 12.5 శాతం పెరిగాయి. గుజరాత్‌లో గత ఆరు నెలల్లో గుండెపోటు కారణంగా 1,052 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర  ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 80 శాతం మంది 11-25 ఏళ్ల మధ్య వయసువారే. ఈ నేపథ్యంలో సీపీఆర్‌పై దాదాపు 2 లక్షల మంది టీచర్లు, కళాశాలల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని