సత్‌పుడా పులుల అభయారణ్యంలో 10 వేల ఏళ్లనాటి రాతి చిత్తరువులు

మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో గల సత్‌పుడా పులుల అభయారణ్యంలో జంతువుల గణన సందర్భంగా 10 వేల ఏళ్ల కిందటి రాతి చిత్తరువులను అటవీ అధికారులు గుర్తించారు.

Published : 08 Dec 2023 06:00 IST

మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో గల సత్‌పుడా పులుల అభయారణ్యంలో జంతువుల గణన సందర్భంగా 10 వేల ఏళ్ల కిందటి రాతి చిత్తరువులను అటవీ అధికారులు గుర్తించారు. చూర్నా గ్రామ పరిధిలోని ఓ కొండపై ఈ రాతి చిత్రాలను చూసిన అటవీశాఖ గార్డులు ఆశ్చర్యపోయారు. వేల సంవత్సరాల కిందట మనుషుల జీవన విధానాన్ని తెలిపేలా ఈ చిత్తరువులు ఉన్నాయి. చేతుల్లో ఆయుధాలతో ఆదిమానవులు వేటకు వెళుతున్నట్లుగా ఉన్న ఇందులో జిరాఫీ లాంటి జంతువు, మరికొన్ని వన్యమృగాలు కూడా కనిపిస్తున్నాయి. ఆహారం కోసం వేటాడుతున్న గిరిజనులు నృత్యాలు చేస్తూ వెళుతున్నట్లు వీటిని చిత్రించారు. ఈ పులుల అభయారణ్యంలో ఇటువంటి రాతి చిత్రాలు వందకు పైగా ఉన్నట్లు అటవీశాఖ సీనియర్‌ అధికారులు తెలిపారు. టైగర్‌ జోను కావడంతో ఈ బొమ్మలున్న గుహల్లోకి తాము అరుదుగా వెళతామన్నారు. ‘‘పురావస్తు శిలల గొప్ప చిత్రాలు ఉన్న చూర్నా ప్రాంతం చారిత్రక ప్రదేశం. దీనికి ఎస్‌డీఆర్‌ పచ్‌మఢీ, నర్మదాపురం ప్రాంతాలను కూడా కలిపితే దాదాపు 110 రాతి చిత్తరువులను చూడవచ్చు’’ అని చరిత్ర ఆచార్యులు డాక్టర్‌ హన్స వ్యాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని