కేరళ సీఎం, గవర్నర్‌ మధ్య మరోసారి మాటల యుద్ధం

కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది.

Published : 08 Dec 2023 05:08 IST

కొచ్చిన్‌: కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఆరిఫ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌పై అభిమానం ఉంటే తనకు అభ్యంతరం లేదని, కానీ ఆయన గవర్నరుగా తన విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని విజయన్‌ గురువారం ఆరోపించారు. అంతకు ముందు రోజు మీడియాతో గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆయన ఈ ఆరోపణలు చేశారు. ప్రభుత్వం పంపిన రెండు ఆర్డినెన్స్‌లకు ఆమోదం తెలపకపోవడంపై బుధవారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆరిఫ్‌ స్పందిస్తూ వామపక్ష ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏదైనా బిల్లు, ఆర్డినెన్స్‌కు సంబంధించి అత్యవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వం.. రాజ్‌భవన్‌ను సంప్రదించి వివరణ ఇవ్వాలన్నారు. మార్క్సిస్టు పార్టీ సభ్యులు, కార్యకర్తలు పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ను ‘స్వతంత్ర కశ్మీర్‌’ అని సంబోధించడం మానుకోవాలని, విభజన వాదానికి ఆజ్యం పోయకూడదని సూచించారు. తాను ప్రభుత్వ సూచనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ ఒత్తిడిని కాదని పేర్కొన్నారు. దీనిపై తాజాగా విజయన్‌ స్పందిస్తూ.. గవర్నర్‌ ఏదైనా చెప్పాలి అనుకుంటే నేరుగా తనకే చెప్పాలని, మీడియాతో కాదన్నారు. సీఎం, గవర్నర్‌ మధ్య చాలా కాలంగా వివాదం ఉన్నా.. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మరింత ఎడం పెరిగింది. కన్నూర్‌ యూనివర్సిటీ ఉప కులపతిగా గోపీనాథ్‌ రవీంద్రన్‌ పునర్నియామకాన్ని సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ విషయంలో కేరళ ప్రభుత్వ జోక్యాన్ని, రవీంద్రన్‌ను తిరిగి నియమిస్తూ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ ఇచ్చిన ఉత్తర్వునూ తప్పు పట్టింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై గవర్నర్‌ ఆరిఫ్‌ ఖాన్‌ స్పందిస్తూ.. రవీంద్రన్‌ను వీసీగా నియమించాలంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారంటూ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని