సంక్షిప్త వార్తలు (8)

ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై పార్లమెంటు నైతిక విలువల కమిటీ రూపొందించిన నివేదిక శుక్రవారం లోక్‌సభ ముందుకు రానుంది.

Updated : 08 Dec 2023 06:11 IST

నేడు లోక్‌సభకు మొయిత్రాపై నైతిక విలువల కమిటీ నివేదిక

దిల్లీ: ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై పార్లమెంటు నైతిక విలువల కమిటీ రూపొందించిన నివేదిక శుక్రవారం లోక్‌సభ ముందుకు రానుంది. ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని కమిటీ తన నివేదికలో సిఫార్సు చేసింది. ఈ నెల 4వ తేదీనే సభలో ఆ నివేదికను ప్రవేశపెడతారని భావించినప్పటికీ విపక్ష సభ్యులు విస్తృత చర్చ జరపాల్సి ఉంటుందని తెలపడంతో ఆగిపోయింది. ఈ నివేదికను సభ ఆమోదించినట్లయితే మహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురవుతారు.


‘అఖిల భారత న్యాయసేవ’ అంశంలో ఏకాభిప్రాయం లేదు: కేంద్రం

దిల్లీ: అఖిల భారత న్యాయసేవ (ఆలిండియా జుడీషియల్‌ సర్వీసు) ఏర్పాటు విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని గురువారం రాజ్యసభలో కేంద్రం తెలిపింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని హైకోర్టులు ఈ ప్రతిపాదనకు సానుకూలంగా లేవని పేర్కొంది. ‘‘కొన్ని ప్రభుత్వాలు ఇందుకు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని లేవు. మరి కొందరు కేంద్రం ప్రతిపాదించిన ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని కోరుతున్నారు’’ అని ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ పేర్కొన్నారు.


హైకోర్టుల్లో 324 జడ్జీ పోస్టులు ఖాళీ

దిల్లీ: దేశంలోని అన్ని హైకోర్టులలో 324 జడ్జీల పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని, వీటిలో 112 మంది న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియ వివిధ దశల్లో ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ తెలిపారు. హైకోర్టులలో మంజూరైన మొత్తం జడ్జీల పోస్టులు 1,114 కాగా 790 మంది న్యాయమూర్తులు పని చేస్తున్నారని గురువారం మంత్రి రాజ్యసభకు తెలిపారు. ఈ నెల 4వ తేదీ నాటికి సుప్రీంకోర్టు 34 మంది జడ్జీలు ఉన్నారని, ప్రస్తుతం అక్కడ ఖాళీలేవీ లేవన్నారు.


కేరళ సిరో - మలబార్‌ చర్చి మేజర్‌ ఆర్చ్‌బిషప్‌ రాజీనామా

కొచిన్‌: కేరళలోని సిరో - మలబార్‌ చర్చి అధిపతి కార్డినల్‌ జార్జి ఎలెన్‌చెరీ గురువారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏకరీతిగా హోలీ మాస్‌ నిర్వహణతోపాటు చర్చి భూముల వ్యవహారంలో కొనసాగుతున్న విభేదాల నడుమ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరళ పరిణామాలతో కలతకు గురైన పోప్‌ ఫ్రాన్సిస్‌ క్రైస్తవ మతాధికారులు అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుతూ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. క్రిస్మస్‌ ముందు అందరూ కలిసి నడవాలని, ప్రార్థనలకు సంబంధించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని పోప్‌ కోరారు.


రాజ్‌పూత్‌ నేత హత్యకేసులో ఇద్దరు పోలీసుల సస్పెన్షన్‌

జైపుర్‌, ఇందౌర్‌: రాజస్థాన్‌ రాజధాని నగరమైన జైపుర్‌లో రాష్ట్రీయ రాజ్‌పూత్‌ కర్ణిసేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌సింగ్‌ గోగామేడీని కాల్చి చంపిన కేసుకు సంబంధించి శ్యాంనగర్‌ స్టేషన్‌ హౌస్‌ అధికారితోపాటు మరో బీట్‌ కానిస్టేబుల్‌ను పోలీస్‌ కమిషనర్‌ సస్పెండు చేశారు. కాగా, సుఖ్‌దేవ్‌సింగ్‌ భార్య శీలా షెకావత్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాజస్థాన్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, డీజీపీల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. సుఖ్‌దేవ్‌సింగ్‌ హత్యకు కుట్ర జరుగుతోందని ఈ ఏడాది ఫిబ్రవరి 14న పంజాబ్‌ పోలీసులు రాజస్థాన్‌ డీజీపీకి లేఖ రాసినా, ప్రభుత్వ పెద్దలు కావాలనే తగిన భద్రత కల్పించలేదన్నారు. రాజ్‌పూత్‌ నేత హత్యకు నిరసనగా గురువారం మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ నగరంలో కర్ణిసేన కార్యకర్తలు ఇందౌర్‌ - ఉజ్జయిని రహదారి దిగ్బంధనం చేసి ఆందోళనకు దిగారు.  


భారీ ప్లాట్‌ఫామ్‌ను జారవిడిచిన సి-17 విమానం

దిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన ఓ భారీ ప్లాట్‌ఫామ్‌ను భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కు చెందిన సి-17 రవాణా విమానం ఆగ్రాలోని ఓ మిలిటరీ జోన్‌లో గగనతలం నుంచి గురువారం విజయవంతంగా జారవిడిచింది. గరిష్ఠంగా 16 టన్నుల వరకూ బరువులను మోయగల సామర్థ్యం ఆ ప్లాట్‌ఫామ్‌కు ఉందని అధికారులు తెలిపారు. అంతటి సామర్థ్యమున్న ప్లాట్‌ఫామ్‌ను ఐఏఎఫ్‌ విమానమొకటి విజయవంతంగా జారవిడవడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.


మణిపుర్‌లో ఇక మద్యం అమ్మకాలు చట్టబద్ధం

ఇంఫాల్‌: మణిపుర్‌లో మద్యం విక్రయాలు, వినియోగంపై 30 ఏళ్లకు పైగా కొనసాగుతున్న నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై గ్రేటర్‌ ఇంఫాల్‌తోపాటు జిల్లా కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, హోటళ్లలో మద్యం అమ్మకాలను చట్టబద్ధం చేసింది. ఈ మేరకు బుధవారం గెజిట్‌ను విడుదల చేసింది. 1991లో తీసుకొచ్చిన మద్య నిషేధ చట్టం పైన పేర్కొన్న ప్రాంతాల్లో వర్తించదని స్పష్టం చేసింది. మద్యం అమ్మకాలతో రాష్ట్రానికి ఏటా కనీసం రూ.600 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఓ అధికారి వెల్లడించారు.


పన్నూ బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తున్నాం: భారత్‌

దిల్లీ: డిసెంబర్‌ 13లోగా భారత పార్లమెంట్‌పై దాడి చేస్తామంటూ ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ మరోసారి భారత్‌పై బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ‘ఆ బెదిరింపులను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యవహారాన్ని అమెరికా, కెనడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఒక అంశంపై మీడియా కవరేజీని కోరుకుంటారు. అలాంటి హెచ్చరికలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వీటిపై భారత ఏజెన్సీలు తగిన చర్యలు తీసుకుంటాయి’ అని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని