యాజమాన్య విద్యావ్యవస్థలో మార్పులు అవసరం

దేశ సమ్మిళిత అభివృద్ధి కోసం యాజమాన్య విద్యావ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు.

Updated : 08 Dec 2023 06:03 IST

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

దిల్లీ: దేశ సమ్మిళిత అభివృద్ధి కోసం యాజమాన్య విద్యావ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. గురువారం ఇక్కడ ‘లక్ష్మీపత్‌ సింఘానియా - ఐఐఎం లఖ్‌నవూ నేషనల్‌ లీడర్‌షిప్‌ అవార్డ్స్‌’ ప్రదానం చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. కృత్రిమమేధను (ఏఐ) యాజమాన్య విద్యకు అనుసంధానించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఏఐ సాంకేతికత ఉపయోగాల గురించి పూర్తిగా తెలిసినవారికి దాని కారణంగా ఉద్యోగాలు పోతాయనే భయం ఉండకూడదన్నారు. యాజమాన్య విద్యను భారతీయ కంపెనీలు, వినియోగదారులు, సమాజంతో అనుసంధానించాలని వివిధ సంస్థల అధిపతుల్ని, విద్యావంతుల్ని కోరారు. ఉత్తరాఖండ్‌లోని సిల్‌క్యారా కార్మికుల రెస్క్యూ ఆపరేషన్‌ గురించి ప్రస్తావిస్తూ.. సంక్షోభ సమయంలో నాయకత్వం ఎలా ఉండాలో చెప్పేందుకు ఇదొక నిదర్శనమన్నారు. మన దేశ యువత స్వయం ఉపాధి వైపు దృష్టి సారిస్తోందని, ప్రపంచలో ప్రముఖ టెక్నాలజీ సంస్థలకు నాయకత్వం కూడా వహిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌గా, పేరున్న యూనికార్న్‌ హబ్‌గా భారత్‌ నిలిచిందన్నారు. అమృత్‌కాల్‌లో భారత్‌ను  అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నది దృష్టిలో పెట్టుకొని ఐఐఎం లఖ్‌నవూ లాంటి సంస్థలు సిలబస్‌ను తయారు చేయాలని రాష్ట్రపతి కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని