ఉత్తరాది రాష్ట్రాలది గోముద్ర!: డీఎంకే ఎంపీ వ్యాఖ్యలపై గవర్నర్‌ తమిళిసై స్పందన

ఉత్తరాది రాష్ట్రాలు ‘గోమూత్రాని’కి నిదర్శనం కాదని, వాటిది ‘గోముద్ర’ అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. అవి పవిత్ర గోమాతకు చిహ్నమని తెలిపారు.

Updated : 09 Dec 2023 07:38 IST

అహ్మదాబాద్‌: ఉత్తరాది రాష్ట్రాలు ‘గోమూత్రాని’కి నిదర్శనం కాదని, వాటిది ‘గోముద్ర’ అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. అవి పవిత్ర గోమాతకు చిహ్నమని తెలిపారు. డీఎంకే ఎంపీ డి.ఎన్‌.వి.సెంథిల్‌ కుమార్‌ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఉద్దేశించి ఆమె ఈ మేరకు స్పందించారు. శుక్రవారం తమిళిసై.. అహ్మదాబాద్‌లో గుజరాత్‌ విశ్వవిద్యాలయం, ఇండియా థింక్‌ కౌన్సిల్‌ నిర్వహించిన ‘కల్చరల్‌ ఎకానమీ సమ్మిట్‌’ను ఉద్దేశించి ప్రసంగించారు. గోమూత్ర రాష్ట్రాల్లోనే భాజపా గెలుస్తుందంటూ సెంథిల్‌ కుమార్‌ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ తరహా ప్రకటనలు దురదృష్టకరమని తమిళిసై పేర్కొన్నారు. ‘‘నేను తమిళనాడు నుంచే వచ్చాను. ఈ మధ్య ఉత్తర-దక్షిణ విభజనను తీసుకురావడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. అందుకే నేను ఇలా చెప్పాల్సి వస్తోంది. మా రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ.. ఉత్తరాది రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలని వ్యాఖ్యానించడంపై నేను బాధపడుతున్నా. ఉత్తర-దక్షిణ విభజన ఉండకూడదు. పరస్పరం గౌరవించుకోవాలి. పూర్వం తమిళనాడులో ప్రజలు దేవుడి ముందు ఒక హుండీ ఉంచేవారు. అందులో నిత్యం డబ్బు సమర్పించేవారు. అలా పొదుపు చేసుకున్న సొమ్ముతో.. జీవితంలో కనీసం ఒక్కసారైనా కాశీయాత్ర (నేటి వారణాసి) చేయాలనుకునేవారు’’ అని తెలిపారు. తమిళనాడు ప్రజలు తమ రాష్ట్రంలోని రామేశ్వరం ఆలయాన్ని, ఉత్తరాదిన ఉన్న కాశీని వేర్వేరుగా చూడరని చెప్పారు. ‘‘కాశీని సందర్శించేవారు తమ తీర్థయాత్రను సంపూర్ణం చేసుకోవడానికి రామేశ్వరం కూడా వస్తారు. అలాగే రామేశ్వరం వచ్చినవారు.. కాశీని కూడా సందర్శిస్తారు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని