Supreme Court: జడ్జీలు తీర్పుల్లో ఉపదేశాలివ్వరాదు: సుప్రీం

తాము వెలువరించే తీర్పుల్లో జడ్జీలు వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడం కానీ, ఉపదేశాలివ్వడం కానీ చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.

Updated : 09 Dec 2023 07:55 IST

దిల్లీ: తాము వెలువరించే తీర్పుల్లో జడ్జీలు వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడం కానీ, ఉపదేశాలివ్వడం కానీ చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) తెలిపింది. లైంగిక కోర్కెలను నియంత్రించుకోవాలంటూ కిశోరప్రాయ బాలికలకు, మహిళలను గౌరవించడం నేర్చుకోవాలంటూ కిశోరప్రాయ బాలురకు ఓ తీర్పులో కలకత్తా హైకోర్టు సూచించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇవి అనవసరమైన, తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలంటూ జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్‌, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ సభ్యులుగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. రాజ్యాంగ అధికరణం 21 ప్రకారం ఇటువంటి వ్యాఖ్యలు కిశోరప్రాయుల హక్కుల ఉల్లంఘన పరిధిలోకి వస్తాయని తెలిపింది. తదుపరి విచారణను జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది. వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసేందుకు ఒక మహిళను కిడ్నాప్‌ చేసిన కేసులో నిందితుడికి పోక్సో చట్టంలోని 6 సెక్షన్‌ ప్రకారం శిక్ష విధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన కేసులో కలకత్తా హైకోర్టులోని జస్టిస్‌ చిత్తరంజన్‌ దాస్‌, జస్టిస్‌ పార్థసారథి సేన్‌ ధర్మాసనం ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. వీటిని భారత ప్రధాన న్యాయమూర్తి సుమోటాగా విచారణకు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని